Kesavarao And Vijaya Laxmi Confirmed To Join in Congress: బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు ఆ పార్టీని వీడుతుండగా.. తాజాగా సీనియర్ నేత కె.కేశవరావు (కేకే), ఆయన కుమార్తె.. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి హస్తం గూటికి చేరనున్నారు. ఈ నెల 30న కాంగ్రెస్ లో చేరనున్నట్లు విజయలక్ష్మి అధికారికంగా ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. అధికార పార్టీలో ఉంటేనే సమస్యల పరిష్కారం సులువవుతుందని విజయలక్ష్మి పేర్కొన్నారు. అటు, కె.కేశవరావు సైతం పార్టీ మార్పుపై స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసి తాను ఎందుకు పార్టీ మారుతున్నదీ వివరణ ఇచ్చారు. కేసీఆర్ తో భేటీ అనంతరం.. ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీకి సంబంధించిన పలు అంశాలపై కేసీఆర్ తో చర్చించానని చెప్పారు. పార్టీ అంతర్గత అంశాలపైనా చర్చ జరిగిందని.. కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. 'కేసీఆర్ నాకు చాలా గౌరవం ఇచ్చారు. నాకు కూడా ఆయనపై గౌరవం ఉంది. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నాకు బాగా సహకరించారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ లోనే ఉన్నారు. 84 ఏళ్ల వయసులో తిరిగి సొంత పార్టీలోకే వెళ్లాలని నిర్ణయించుకున్నా.' అని కేశవరావు స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ లోనే కేకే కుమారుడు
అయితే, కేకే కుమారుడు విప్లవ్ కుమార్ మాత్రం తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తండ్రి, సోదరి నిర్ణయాలతో తనకు సంబంధం లేదని చెప్పారు. దీనిపై స్పందించిన కేకే విప్లవ్ కుమార్ నిర్ణయం మంచిదేనని అన్నారు.
అసహనం వ్యక్తం చేసిన కేసీఆర్
అంతకు ముందు తాను పార్టీ మారడంపై కేశవరావు కేసీఆర్ ను కలిసి వివరణ ఇచ్చారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో గులాబీ బాస్ ను కలిసిన కేకే ఆయనతో చర్చించారు. తనకు ఉన్న ఇబ్బందులు చెప్పి పార్టీ మారుతున్నానని కేసీఆర్ కు చెప్పేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో కేసీఆర్ అసహనానికి గురైనట్లుగా తెలుస్తోంది. పదేళ్ల పాటు పార్టీలో పెద్ద పీట వేసి పదవులు ఇస్తే.. కష్టకాలంలో వదిలేసి వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తనకు ఉన్న ఇబ్బందులను ఆయన చెప్పబోగా.. సాకులు చెప్పవద్దని మండిపడినట్లుగా తెలుస్తోంది. అయితే, 'నేను పుట్టింది కాంగ్రెస్ లో.. కాంగ్రెస్ లోనే చనిపోతాను.' అని కేకే చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. కేసీఆర్ కేకేతో అన్నట్లు తెలుస్తోంది.
కాగా, ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ చీఫ్ గా పని చేసిన కె.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నేత. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరారు. ఆయన్ను కేసీఆర్ పార్టీ సెక్రటరీ జనరల్ పదవి ఇచ్చారు. వరుసగా రెండుసార్లు రాజ్యసభకు పంపించారు. పార్టీ పార్లమెంటరీ నేత పదవి కూడా ఇచ్చారు. అభ్యర్థుల ఎంపిక కమిటీకి కూడా కేకేనే ఛైర్మన్ గా వ్యవహరించారు. కేకే కూతురు విజయలక్ష్మికి జీహెచ్ఎంసీ మేయర్ పదవి ఇచ్చారు.