KCR master plan for BRS revival:  తెలంగాణ రాజకీయాల్లో పదిహేనేళ్ల పాటు తిరుగులేని శక్తిగా వెలిగిన భారత్ రాష్ట్ర సమితి  ఇప్పుడు తిరిగి పూర్వ వైభవం కోసం నిశ్శబ్దంగా పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత కొంతకాలం మౌనంగా ఉన్న అధినేత కేసీఆర్, ఇప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు సరికొత్త వ్యూహాలను అమలు  చేయనున్నారు.  ఎన్నికల ఫలితాల తర్వాత కార్యకర్తల్లో నెలకొన్న నైరాశ్యాన్ని పోగొట్టడంపై కేసీఆర్ ప్రధానంగా దృష్టి సారించారు. నియోజకవర్గాల వారీగా కీలక నేతలతో టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ, ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. పార్టీ శ్రేణులకు అండగా ఉంటామనే నమ్మకాన్ని కలిగిస్తూనే, ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు.

ఫిరాయింపుల మధ్యే పటిష్టమైన బృందం 

రాజకీయాలు వేగంగా మారుతున్నా కేసీఆర్ ఏమాత్రం తొందరపడకుండా వ్యవహరిస్తున్నారు. వెళ్లే వారిని అడ్డుకోకుండా, మిగిలి ఉన్న నిబద్ధత గల నాయకులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పదవుల కోసం పార్టీ మారే వారితో పోలిస్తే, సిద్ధాంతం కోసం నిలబడే వారే పార్టీకి అసలైన బలమని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ద్వితీయ శ్రేణి నాయకత్వానికి పెద్దపీట వేస్తూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు వారిని సమాయత్తం చేస్తున్నారు. దీనికోసం ప్రతి మండలానికి ఒక ఇన్‌ఛార్జ్‌ను నియమించి కొత్త రక్తాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు.

 సెంటిమెంట్ నుంచి వాస్తవికత వైపు 

గతంలో తెలంగాణ సెంటిమెంట్ మీద ఎక్కువగా ఆధారపడిన బీఆర్ఎస్, ఇప్పుడు ప్రజా సమస్యల మీద గొంతు ఎత్తుతోంది. నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, పెన్షన్ల పంపిణీలో జరుగుతున్న జాప్యం వంటి అంశాలను అస్త్రాలుగా మార్చుకుంటోంది. ప్రజల పక్షాన నిలబడి పోరాడటం ద్వారా కోల్పోయిన ప్రజాధారణను మళ్ళీ పొందవచ్చని కేసీఆర్ గట్టిగా విశ్వసిస్తున్నారు. శాసనసభలో కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా వ్యూహకర్తలతో కలిసి నిరంతర చర్చలు జరుపుతున్నారు. ఓ వైపు తెలంగాణ సెంటిమెంట్ తో పాటు ప్రజా సమస్యలను  కూడా ఎక్కువగా తెరపైకి తెచ్చి  పోరాడాలని భావిస్తున్నారు. 

 వ్యూహకర్తగా కేసీఆర్  సైలెంట్ ఆపరేషన్                    

బయటకు పెద్దగా కనిపించకపోయినా, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కేంద్రంగా కేసీఆర్ రాజకీయ చదరంగం నడుపుతున్నారు. ఎప్పుడు ఏ అడుగు వేయాలో తెలిసిన ఆయన, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైనప్పుడు దాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకప్పుడు ఉద్యమ నేతగా పార్టీని ఎలా నిర్మించారో, ఇప్పుడు కూడా అదే పట్టుదలతో పునర్నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.సరైన సమయం చూసి బీఆర్ఎస్ పార్టీ మొత్తాన్ని ఒక్క సారి రీయాక్టివేట్ చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. గోదావరి జలాల పేరుతో బహిరంగసభలతో  దీన్నిప్రారంభించాలనుకున్నా.. మున్సిపల్ ఎన్నికల కారణంగా  వాయిదా వేశారు.