Anna Hazare President Candidate KCR Plan : తెలంగాణ సీఎం కేసీఆర్ పదే పదే సంచలనం గురించి మాట్లాడుతున్నారు. కొద్ది రోజుల కిందట ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్‌ను కలిసిన తర్వాత దేశంలో ఓ సంచలనం జరగాల్సి ఉందన్నారు. గురువారం బెంగళూరులో దేవేగౌడ, కుమారస్వామిలను కలిసిన తర్వాత ఆ సంచలనం రెండు, మూడు నెలల్లోనే ఉంటుందన్నారు. దీంతో ఆ సంచలనం ఏమిటన్న చర్చ రాజకీయాల్లో ప్రారంభమైంది. రెండు, మూడు నెలల్లో ఉన్నది రాష్ట్రపతి ఎన్నికలే కావడంతో కేసీఆర్ .. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఉమ్మడిగా అభ్యర్థిని నిలబెట్టి బీజేపీ ( BJP )అభ్యర్థిని ఓడిస్తే కేసీఆర్ చెప్పిన సంచనలం నమోదవుతుందని అనుకోవచ్చు.
విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారానే ( Anna Hazare ) నిలబెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. స్వయంగా మహారాష్ట్రలోని అన్నా హాజరే స్వగ్రామం రాలేగావ్ సిద్ధికి వెళ్లి ఆయనతో మాట్లాడి ఒప్పించాలని నిర్ణయించుకున్నారు. ఈ వారమే వెళదామనుకున్నారు కానీ ఆగిపోయారు. వచ్చే వారం వెళ్లే అవకాశం ఉంది. అన్నాహజారే కాంగ్రెస్ హాయంలో అవినీతి వ్యతిరేక పోరాటం.. లోక్ పాల్ బిల్లు కోసం చేసిన పోరాటం దేశాన్ని కదిలించింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆ పోరాటం నుంచే వచ్చారు. అన్నా హజారే నేరుగా రాజకీయాల్లోకి రాలేదు.
ఆయనకు దేశవ్యాప్తంగా మంచి ఇమేజ్ ఉంది. ఏ పార్టీకీ ఆయన మద్దతుగా ఉన్న సందర్భాలు లేవు. దీంతో అన్ని పార్టీలు ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తాయని కేసీఆర్ నమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేజ్రీవాల్‌తోనూ ఈ అంశంపై కేసీఆర్ చర్చించినట్లుగా తెలుస్తోంది. దేవేగౌడ, కుమారస్వామితోనూ ఇదే టాపిక్ మాట్లాడినట్లుగా చెబుతున్నారు . కేసీఆర్ సంచలనం సృష్టించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఆ సంచలనం ఖచ్చితంగా రాష్ట్రపతి ఎన్నికలేనని అంచనాకు వస్తున్నారు. అందులో భాగంగానే అన్నా హజారేను తెరపైకి తెస్తున్నారని భావిస్తున్నారు.
అయితే అన్నా హజారేను అన్ని పార్టీలు అంగీకరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ( Congress ) కూడా ఒప్పుకోవాలి. కానీ యూపీఏ హయాంలో ఆ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చిన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన అన్నా హజారేను కాంగ్రెస్ సమర్థిస్తుందా అన్నది సందేహమే. అయితే ఆయనకు ఉన్న ఇమేజ్ ప్రకారం.. సమర్థిస్తే.. బీజేపీ వర్సెస్ అన్నా హజారే అన్నట్లుగా పోటీ జరిగితే.. కేసీఆర్ సంచలనం కోసం ప్రయత్నించే అవకాశం ఉంటుందని అంచనా వేయవచ్చు.