Kalvakuntla Family Political Dispute : రాజకీయాలకు, కుటుంబ బంధాలకు మధ్య కల్వకుంట్ల  కవిత  స్పష్టమైన గీత గీశారు. తన తండ్రి లేకపోతే తాను లేనని తాను వ్యక్తిగతంగా తాను ఎప్పుడూ విమర్శించబోనని స్పష్టం చేశారు. కేవలం రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ను మాత్రమే విమర్శిస్తున్నానని అంటున్నారు. కవిత లెక్క ప్రకారం రాజకీయం వేరు.. కుటుంబం వేరు. కుటుంబాన్ని రాజకీయంతో ఆమె మిక్స్ చేయలేదు. చేయాలనుకోవడం లేదు.    రాజకీయం వేరు.. రక్తసంబంధం వేరు 

Continues below advertisement

కల్వకుంట్ల కవిత తన రాజకీయ ప్రస్థానంలో కుటుంబ బంధాలకు, సిద్ధాంతాలకు మధ్య ఒక స్పష్టమైన సరిహద్దును గీశారు.  నా తండ్రి లేకపోతే నేను లేను.. వ్యక్తిగతంగా ఆయనపై నాకు అపారమైన గౌరవం ఉంది. కానీ రాజకీయంగా బీఆర్ఎస్ అధ్యక్షుడి నిర్ణయాలను విమర్శించకుండా ఉండలేను  అని ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగకూడదన్నది ఆమె ప్రధాన ఉద్దేశం. అయితే, ప్రస్తుత రాజకీయాల్లో వ్యక్తిగతం, రాజకీయం వేరువేరుగా చూడటం అసాధ్యమన్న వాస్తవం ఆమె ఇంటి నుంచే మొదలైనట్లు కనిపిస్తోంది.

 తెగిపోయిన బంధాలు.. కేసీఆర్ మౌనం

Continues below advertisement

కవిత తన రాజకీయ అడుగులను స్వతంత్రంగా వేయడం ప్రారంభించినప్పటి నుండి, కేసీఆర్ కుటుంబంలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. తన తండ్రి తనతో మాట్లాడి నెలలు గడుస్తోందని కవిత స్వయంగా అంగీకరించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. గతంలో కవిత లేకుండా కేసీఆర్ ఏ కార్యక్రమం చేసేవారు కాదు, కానీ ఇప్పుడు కుటుంబ వేడుకలకు సైతం ఆమెకు సమాచారం అందడం లేదని తెలుస్తోంది. కేసీఆర్ మౌనం కేవలం రాజకీయ అసమ్మతి మాత్రమే కాదు, అది ఒక తండ్రిగా ఆయనలో ఉన్న అసహనాన్ని ,  వ్యూహాత్మక దూరాన్ని సూచిస్తోంది.

 కేటీఆర్, కేసీఆర్ పాటించలేకపోతున్న కవిత విధానం

కవిత ప్రతిపాదిస్తున్న రాజకీయం వేరు - వ్యక్తిగతం వేరు  అనే సూత్రాన్ని కేసీఆర్ మరియు, కేటీఆర్ పాటించేందుకు సిద్దంగా లేరు.  తెలంగాణ రాజకీయాల్లో దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యం వహించిన వారిద్దరికీ, సొంత కుటుంబ సభ్యురాలే గళం విప్పడం మింగుడుపడటం లేదు. రాజకీయ విమర్శలను వ్యక్తిగత ద్రోహంగా భావించే సంప్రదాయం ఉండటంతో, కవిత తీరును వారు కుటుంబ చీలికగా పరిగణిస్తున్నారు. ఫలితంగా, కవితను ఒంటరిని చేయడం ద్వారా ఆమెపై ఒత్తిడి పెంచాలని చూస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కుటుంబం దూరం పెట్టినా, కవిత తన రాజకీయ లక్ష్యం నుండి వెనక్కి తగ్గడం లేదు. రాజకీయంగా కేసీఆర్ తప్పులను ఎత్తిచూపుతూనే ఉంటాను.. ప్రజల పక్షాన నా పోరాటం ఆగేది లేదు అని ఆమె కుండబద్దలు కొట్టారు. తండ్రి ఇమేజ్ నుండి బయటకు వచ్చి, తనకంటూ ఒక సొంత అస్తిత్వాన్ని నిర్మించుకునే క్రమంలో ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఆమె స్థాపించిన  తెలంగాణ రక్షణ సేన  రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకుపైనే గురి పెట్టింది. 

భవిష్యత్తులో రాజకీయ ప్రకంపనలు ఖాయమా?

కల్వకుంట్ల కుటుంబంలో ఏర్పడిన ఈ చీలిక కేవలం ఒక ఇంటి సమస్య కాదు, ఇది తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే అవకాశం ఉంది. కవితను పూర్తిగా దూరం పెట్టడం వల్ల కేసీఆర్ నష్టపోతారా? లేక కుటుంబ మద్దతు లేకుండా కవిత రాజకీయంగా నిలదొక్కుకోగలరా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏదేమైనా, ఒక కూతురిగా తండ్రిని గౌరవిస్తూనే, ఒక నాయకురాలిగా ఆయన రాజకీయాలను ఎండగట్టడం అనేది భారతీయ రాజకీయాల్లో ఒక అరుదైన , సాహసోపేతమైన ప్రయోగమని అనుకోవచ్చు.  కవిత పోరాటం ఇప్పుడు కేవలం ప్రత్యర్థి పార్టీలపై మాత్రమే కాదు, తనను నిరాకరిస్తున్న తన సొంత కుటుంబ వ్యవస్థపై కూడా సాగుతోంది. ఈ  వారసత్వ యుద్ధం  చివరకు ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.