Kammuri Nagaraju from Boya Comunity as the candidate for Anantapur MP post :  రాయలసీమ జిల్లాలలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉన్న జిల్లా అనగానే అనంతపురం జిల్లా ముందుంటుంది. అటువంటి జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకి కత్తి మీద సాములగా మారింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. వీటిలో అనంతపురం పార్లమెంటు, ధర్మవరం, అనంతపురం అర్బన్, గుంతకల్లు నియోజకవర్గం ఇప్పటివరకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. టిడిపి, జనసేన, బిజెపి కూటమిలో భాగంగా అనంతపురం జిల్లాలో ధర్మవరం అసెంబ్లీ స్థానం బిజెపికే అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. 


అనంతపురం ఎంపీ సీటు బోయ వర్గానికి ఇచ్చే అవకాశం  


చంద్రబాబు నాయుడు ప్రకటించిన మూడో జాబితాలో అనంతపురం పార్లమెంట్, హిందూపురం పార్లమెంట్, అనంతపురం అర్బన్, గుంతకల్లు నియోజకవర్గలలో అభ్యర్థులను ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు.. కానీ హిందూపురం పార్లమెంటు స్థానానికి మాత్రమే బికే పార్థసారథి పేరు మాత్రమే ప్రకటించారు. ప్రస్తుతం అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా ఎవరు అన్న పీఠముడి వీడటం లేదు. గతంలో 2019 ఎన్నికల్లో అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జెసి పవన్ రెడ్డి టిడిపి అభ్యర్థిగా బరిలో నిలిచాడు. నిన్న మొన్నటి వరకు జెసి పవన్ కుమార్ రెడ్డి అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడని అందరూ అనుకున్నారు. కానీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దింపాలన ఆలోచనతో టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ఉన్నట్లు స్పష్టమైంది. ఇప్పటికే వైసీపీ పార్లమెంటు అభ్యర్థిగా మాజీమంత్రి శంకర్ నారాయణ వైసీపీ ప్రకటించింది.  గత మూడు రోజులుగా ఐవిఆర్ఎస్ సర్వేలో వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన కమ్మూరి నాగరాజు, అంబిక లక్ష్మీనారాయణ, పార్థసారథి పేర్లు వినిపించాయి. ఇందులో బికే పార్థసారధిని హిందూపురం అభ్యర్థిగా చంద్రబాబునాయుడు మూడో జాబితాలో ప్రకటించారు. దీంతో అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా ఎవరు అన్నది ఉత్కంఠ నెలకొంది. 


కమ్మూరి నాగరాజు పేరు పరిశీలన


బోయ సామాజిక వర్గానికి చెందిన కమ్మురి నాగరాజు అనంతపురం టిడిపి పార్లమెంటు అభ్యర్థిగా దాదాపు ఖరారు అయినట్లు సమాచారం. ఈయన విద్యావంతుడు ప్రముఖ ఐటీ కంపెనీలకు కూడా అధినేత. 2023 జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప, కర్నూల్, అనంతపూరం ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశాడు. ఆ ఎన్నికల్లో కమ్మూరి నాగరాజుకు మొదటి రెండవ ప్రాధాన్యత ఓట్ల కింద 28,212 ఓట్లు సాధించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 28 వేల ఓట్లు పైగా సాధించిన నాగరాజు  వైసిపి టిడిపి నేతల దృష్టిలో పడ్డారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో రాష్ట్రంలో ఐటి   సెక్టర్ తీసుకువచ్చి ఎంతోమంది యువతకు ఉపాధి కల్పించారాని వారిలో నేను ఒక్కడినని పలు సందర్భాల్లో కమ్మూరి నాగరాజు చెప్పుకొచ్చాడు. నాడు ఆంధ్రప్రదేశ్ కు ఐటిరంగం రావడం వల్లే తాను కూడా ఎంతో లబ్ధి పొందాలని ఐటి సంస్థలకు అధినేత కూడా అయ్యానని తెలిపారు. అప్పటినుంచే చంద్రబాబు నాయుడు అంటేనే అభిమానంతో ఉండేవాన్ని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న పాలన చూసి యువతకు అండగా ఉండాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం సామాజిక సమీకరణాల్లో అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా వాల్మీకులను నిలబెట్టే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉందన్న విషయం తెలుసుకున్న కమ్మూరి నాగరాజు అనంతపురం పార్లమెంటు స్థానం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. 


మరికొందరు ఆశావాహులు కూడా..!


అనంతపురం తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు మరికొందరు ఆశావాహులు కూడా ప్రయత్నాలు ముంబరం చేశారు. అధినేత చంద్రబాబు మరోసారి తనకు అవకాశం కల్పిస్తారని జెసి పవన్ కుమార్ రెడ్డి భీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. మరోవైపు బిసి సామాజిక వర్గానికి చెందిన టిడిపి సీనియర్ నేత మాజీ అహుడా చైర్మన్ అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ పూల నాగరాజు కూడా పార్లమెంట్ టికెట్ కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎవరు వైపు మొగ్గు చూపుతారో.. కూటమి అభ్యర్థిగా ఎవరు అన్నది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది.