Janasenani Pawan Kalyan Delhi Tour : రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా వెళ్లాలన్నది జనసేన అధినేత పవన్ కల్యాణ్ బలమైన ఆకాంక్ష. ఇందుకోసం బీజేపీ పెద్దలను ఒప్పించే బాధ్యతను ఆయన భుజాన వేసుకున్నారు. అనేక సభలు, సమావేశాల్లో కూడా ఆయన ఇదే మాటను చెప్పారు. బీజేపీ పెద్దలతో తాను మాట్లాడుతున్నాని, పొత్తు కుదురుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ నుంచి అటువంటి ప్రకటన ఎప్పుడూ రాలేదు. కానీ, పవన్ కల్యాణ్ మాత్రం పదే పదే చెబుతూ వచ్చారు.
వారం రోజులు నుంచి పవన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి బీజేపీ పెద్దలను కలుస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఆ పార్టీ ముఖ్య నాయకులు కూడా ఇదే విషయాన్ని చెబుతూ వచ్చారు. పొత్తుపై స్పష్టత వచ్చిందని, సీట్ల సర్ధుబాటుపై చర్చలకు పవన్, ఆ తరువాత చంద్రబాబు ఢిల్లీ వెళతారని ప్రచారం జరిగింది. రోజులు గడుస్తున్నాయి. కానీ, పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనకు సంబంధిన షెడ్యూల్ ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఇప్పట్లో ఢిల్లీ పర్యటన ఉండకపోవచ్చని అంతా భావిస్తున్నారు. బీజేపీ ముఖ్య నాయకుల అపాయింట్‌మెంట్ దొరకకపోవడం వల్లే పవన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం లేదా..? పొత్తుపై సానుకూల నిర్ణయం రాకపోవడం వల్లే ఆయన వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదా అని పలువురు చర్చించుకుంటున్నారు.
ఆ సీట్లపై కూటమికి స్పష్టత
టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులుగా పోటీ చేయబోయే ఎంపీ స్థానాలపై ఒక స్పష్టతకు ఇరు పార్టీలు వచ్చినట్టు చెబుతున్నారు. దీనిపై టీడీకి అనుకూలంగా వ్యవహరించే ప్రధాన మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. ఇవన్నీ, బీజేపీతో పొత్తు లేకపోవడానికి కారణాలుగా చెబుతున్నారు. బీజేపీ ముందుకు రాకపోవడం వల్లే ఇరు పార్టీల అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నట్టు చెబుతున్నారు. ఇరు పార్టీలు పోటీ చేయబోయే స్థానాలపై ఒక స్పష్టతకు వచ్చిన తరువాతే ఈ మేరకు నిర్ణయాన్ని కూటమి తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. బీజేపీపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగానే కూటమి ఈ నిర్ణయాన్ని తీసుకుందన్న ప్రచారమూ జోరుగా సాగుతోంది. మరి దీనిపై బీజేపీ ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో చూడాలి.
అభ్యర్థుల ప్రకటనపై కీలక చర్చలు
జనసేన పార్టీకి మచిలీపట్న, కాకినాడ పార్లమెంట్ స్థానాలను టీడీపీ కేటాయించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి కొన్ని సీట్లను జనసేన కోరుతోంది. అలాగే, అసెంబ్లీ స్థానాలపై ఇరు పార్లీ మధ్య కీలక చర్చలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇద్దరూ ఇప్పటికే కొన్ని సార్లు కలిసి చర్చించారు. కీలకమైన అసెంబ్లీ స్థానాల్లో ఇరు పార్టీల నుంచి ముఖ్యమైన నాయకులు పోటీలో ఉండడంతో అభ్యర్థుల ప్రకటనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో సమస్యలను పరిష్కరించుకునే పనిలో ఇరు పార్టీలు ఉన్నాయి. జనసేన పార్టీ మాత్రం వచ్చే ఎన్నికలకు ఈసారి బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు సిద్ధమవుతోంది, అంగ, అర్ధబలం ఉన్న నేతలపై జనసేన దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కనీస స్థాయిలో ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగుపెట్టడమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ ఉన్నట్టు చెబుతున్నారు.