Jagan: వైఎస్ జగన్ రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఏపీలో తన పార్టీ పరిస్థితి మాత్రమే కాదు. జాతీయ స్థాయిలో ఎలాంటి రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపై ఆయనకు స్పష్టత లేకుండా పోయింది. ఓ వైపు ఎన్డీఏ కూటమి కాదనేసింది. ఇండియా కూటమి రమ్మంటోంది. కానీ ాయన మాత్రం ధైర్యం చేయలేకపోతున్నారు.
చెన్నై సమావేశానికి జగన్ దూరం
దక్షిణాదికి నియోజకవర్గాల పునర్విభజన విషయంలో అన్యాయం జరుగుతోందన్న వాదనతో నిర్వహించిన సమావేశానికి డీఎంకే నుంచి ప్రతినిధులు వచ్చి జగన్ ను కలిశారు. అప్పట్లో వారికి వస్తామా లేదా అన్న సమాచారం ఏమీ చెప్పలేదు. చివరికి వెళ్లలేదు. అయితే సన్నిహిత పార్టీగా గుర్తింపు ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ సమావేశంలో పాల్గొంది. కేటీఆర్ హాజరయ్యారు. కానీ జగన్ మాత్రం వెళ్లలేదు. స్టాలిన్ తో జగన్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. 2019లో జగన్ ప్రమాణ స్వీకారానికి వచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రుల్లో ఒకరు . అయినా స్టాలిన్ పిలుపునకు జగన్ స్పందించలేదు.
గతంలో జగన్ కు మద్దతుగా నిలిచిన ఇండియా కూటమి
కొద్ది నెలల కిందట జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేస్తే .. ఆయనకు మద్దతు ఇవ్వడానికి ఇండియా కూటమిలోని పార్టీల నేతలందరూ వచ్చారు. టీడీపీపై విమర్శలు చేశారు. కానీ జగన్ మాత్రం ఇండియా కూటమికి ఏ విషయంలోనూ మద్దతు ప్రకటించడానికి ధైర్యం చేయలేకపోతున్నారు. గతంలో పార్లమెంట్ లో ఏ విషయంలోనూ కాంగ్రెస్ కూటమిని సమర్థించలేదు సరి కదా ఇప్పుడు స్టాలిన్‌తో భేటీకి కూడా దూరంగా ఉన్నారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతుందా లేదా అన్న అభిప్రాయాన్ని చెప్పడానికి కూడా భయపడుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
లేఖ ద్వారా రెండు వర్గాలను సంతృప్తి పరిచే ప్రయత్నం
ఢిల్లీలో స్టాలిన్ సమావేశం జరుగుతున్న సమయంలో జగన్ ప్రధానికి ఓ లేఖ రాశారని వైసీపీ వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చాయి. వచ్చే ఏడాది (2026) జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలి. ప్రస్తుతం ఉన్న జనాభా లెక్కల ప్రకారం డీలిమినేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం కచ్చితంగా తగ్గుతుంది. అందుకే జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ లేకుండా చూడండి అని లేఖలో మోదీని కోరారు. సమావేశానికి వెళ్లకుండా.. బీజేపీని సంతృప్తి పరిచిన ఆయన మోదీకి లేఖ రాసి.. ఆ సమాచారాన్ని స్టాలిన్ కు పంపి.. వారినీ సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు. జగన్ తమ వైపే ఉన్నారని కనిమొళి కూడా ప్రకటించారు.
అయితే రాజకీయాల్లో ఇలా రెండు పడవలపై చేసే ప్రయాణం మనకకే దారి తీస్తుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. జగన్ ఏదో ఓ కూటమి వైపు మొగ్గితే మంచిదని అంటున్నారు. ఎన్డీఏతో కలిసే అవకాశాలే ఉండనప్పుడు బీజేపీ చల్లని చూపుల కోసం ప్రయత్నించడం రాజకీయంగా నష్టం జరుగుతుందని అంటున్నారు.