Jagan Gujarat Plan :  ప్రధాని మోదీ బాటలోనే ఏపీ సిఎం జగన్‌ వెళ్తున్నారా ? విపక్షాలన్నీ ఏకమైనా సింగిల్‌ గానే ఎన్నికల బరిలోకి వైఎస్ఆర్‌సీపీ అధినేత వెళ్లడం వెనక ఉన్న ధీమా ఏంటీ ? ఎన్నికల టైమ్‌ లో ఫిరాయింపు నేతలు ఎంతమంది ఉంటారు ? జగన్‌ స్ట్రాటజీ ఏంటన్నదిపైనే ప్రధాన చర్చ. ఏపీలో ఇంకా  అసెంబ్లీ ఎన్నికలకు టైమ్‌ ఉన్నా ఇప్పుడే ఎన్నికలన్నట్లు వాతావరణం కనిపిస్తోంది. త్వరలోనే విపక్షాలన్నీ జనాల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాయి.


ఏపీలో ముందే వచ్చిన ఎన్నికల వాతావరణం 


వారాహి రథయాత్ర ద్వారా జనసేన అధినేత, పాదయాత్ర ద్వారా టిడిపి యువనేత లోకేష్‌ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో వైసీపీలోని అంతర్గత కుమ్ములాటలకు బ్రేక్‌ పెట్టేందుకు ఏపీ సిఎం జగన్‌ సిద్ధమయ్యారు.  ఎన్నికలయుద్ధంలో ఎలా గెలవాలన్న దానిపైనా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో రానున్న ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ వైసీపీలో వర్గ పోరు రోజురోజుకి ఎక్కువైపోతోంది. ఏ జిల్లాలో చూసినా ఇదే తీరు. దీంతో జగన్‌ రంగంలోకి దిగక తప్పలేదు. జిల్లా సమీక్షల పేరుతో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, పార్టీ క్యాడర్‌ తో జగన్‌ భేటీ అవడంతో పాటు క్లాస్‌ తీసుకుంటున్నారన్న వార్తలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. 


గుజరాత్‌లో మోదీ ప్లాన్‌నే ఏపీలో అమలు చేయనున్న జగన్ !


కుమ్ములాటలకు చెక్‌ పెట్టకపోతే మీ రాజకీయభవిష్యత్‌ కి చెక్‌ పెడతానని నిర్మొహమాటంగా నేతలకు చెప్పడమే కాదు పనితీరు సరిగ్గా లేకపోతే టిక్కెట్‌ ఆశించవద్దని ముందుగానే హెచ్చరిస్తున్నారట. అంతేకాదు ప్రజా సమస్యలపై ఫోకస్‌ చేయకుండా అవినీతికి పాల్పడితే చర్యలు త ప్పవని కూడా స్పష్టం చేశారట. వాలంటీర్ల వ్యవస్థతో ముందుకు సాగుతూ ఈ 16 నెలల పాటు ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యలను తీర్చుస్తూ ఉంటే గెలుపు ఖాయమని చెప్పారట. వచ్చే ఎన్నికల్లో తన టార్గెట్‌ ప్రతిపక్షం లేకుండా చేయాలన్నదేనని స్పష్టం చేసిన జగన్‌ మీరు కూడా అదే కసితో పనిచేయాలని చెబుతూ పలు సూచనలు, సలహాలు ఇచ్చారట. జగన్‌ తీరుని చూసిన వాళ్లు ప్రధాని మోదీని గుర్తు చేసుకుంటున్నారట. గుజరాత్‌ ఎన్నికల్లో మోదీ-షాలు ఇదే వ్యూహాన్ని అమలు చేయడంతో భారీ మెజార్టీతో అధికారాన్ని అందుకున్నారు. 31 నియోజకవర్గాల్లో బీజేపీ బలహీనంగా ఉంది. ఎన్నికలకు ముందు ఆ నియోజకవర్గాలను గుర్తించి అక్కడి సమస్యలను తీర్చడంతో పాటు ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వకుండా కొత్తవారికి అవకాశం ఇవ్వడంతో గుజరాత్‌ లో మళ్లీ బీజేపీనే పాగా వేసింది. 


ప్రత్యేకహోదా, రాజధానిని మరిపించేలా వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టో 


ఇప్పుడు జగన్‌ కూడా అదే రూట్లో వెళ్తూ మరోసారి అధికారాన్ని అందుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్యేల పనితీరుని బట్టే సీటు ఇస్తానని చెప్పడం, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత నివ్వడం చేస్తున్నారు. ఇలా చేసుకుంటూ పోతే వచ్చే ఎన్నికల్లోనూ తిరిగి వైసీపీదే గెలుపు అని రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు. పథకాలు, సంక్షేమంతో పాటు వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించే అంశాలపై ఇప్పటికే జగన్‌ ఫోకస్‌ చేశారు. ప్రత్యేకహోదా, రాజధానిని మరిపించేలా ఆ మేనిఫెస్టో ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో కూడా నవరత్నాలతో పాటు మ్యానిఫెస్టోలో 98శాతం హామీలు అమలు పర్చమనే విషయాన్ని పదే పదే ప్రజలు వివరించాలని జగన్ థింక్ ట్యాంక్ నిర్ణయించిందంట. ప్రజలకు కావాలసిన అవసరాలు తీర్చుతున్న ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వమనే సంకేతాలను పంపించాలన్నదే జగన్ ఆలోచనగా తెలుస్తోంది. ఇదే ఫ్లో లో వెళ్తే 175 గ్యారెంటీ అనే నమ్మకంతో జగన్ అండ్ టీం ఉన్నట్లుగా అనిపిస్తోంది.