YSRCP Rajyasabha : బీజేపీ చాయిస్‌గా ఓ రాజ్యసభ సీటు - వైఎస్ఆర్‌సీపీ ఆఫర్ ఇచ్చిందా ?
ఆంధ్ర నుంచి తమకు దక్కనున్న నాలుగు రాజ్యసభ సీట్లలో ఓ సీటును బీజేపీ సలహా మేరకు భర్తీ చేసేందుకు వైఎస్ఆర్‌సీపీ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు నాలుగో అభ్యర్థి పేరు అనూహ్యంగా ఉండే అవకాశం ఉందంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అధికార పార్టీల్లో రాజ్యసభ ఆశావహుల సందడి కనిపిస్తోంది. ఎన్నికలు జరగనున్న స్థానాలన్నీ అధికార పార్టీలకు దక్కనున్నాయి. మూడు టీఆర్ఎస్, నాలుగు వైఎస్ఆర్‌సీపీ ఖాతాలో పడనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. అభ్యర్థులపై రెండు అధికార పార్టీల హైకమాండ్ ఓ అంచనాకు వచ్చినా.. ఫైనల్ చేయలేకపోతున్నారు. ఏపీలో అయితే వైఎస్ఆర్‌సీపీ నేతలు మరీ ఉత్కంఠకు గురవుతున్నారు. సామాజిక, రాజకీయ సమీకరణాలతో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఇప్పటి వరకూ జరిగిన ప్రచారం ప్రకారం విజయసాయిరెడ్డి, గౌతమ్ అదానీ లేదా ప్రతీ అదానీ, కిల్లి కృపారాణి, బీద మస్తాన్ రావులకు అవకాశం ఖరారయింది. అయితే అనూహ్యంగా అదానీ గ్రూప్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తమకు ఎలాంటి రాజకీయ ఆసక్తులు లేవని... రాజ్యసభ స్థానం తీసుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది. దీంతో వైఎస్ఆర్‌సీపీ నేతలకు మరో స్థానం అందుబాటులోకి వచ్చినట్లయింది. ఇప్పుడీ స్థానానికి ఎవరిని ఎంపిక చేస్తారనేది వైఎస్ఆర్‌సీపీలో విస్తృత చర్చ జరుగుతోంది.
అలీ పేరును ఇప్పుడు పరిశీలనలోకి తీసుకుంటారా ?
మైనార్టీ నేతకు రాజ్యసభ ఇవ్వాలంటే మొదటి పేరుగా సినీ నటుడు అలీ పేరు తెర మీదకు వస్తుంది. ఇప్పటికే అలీకి రాజ్యసభ సీటు ఖరారు చేశారన్న ప్రచారం జరిగింది. సినిమా టిక్కెట్ రేట్ల అంశంపై చర్చించేందుకు సీఎం జగన్‌తో జరిగిన సమావేశానికి అలీ వెళ్లారు. ఆ సమయంలో జగన్ మరో వారంలో కలవమని సూచించారు. ఆ ప్రకారం అలీ సతీసమేతంగా వెళ్లి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. రెండు వారాల్లో గుడ్ న్యూస్ చెబుతానని చెప్పి జగన్ పంపించారు. ఆ తర్వాత ఆయనకు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవి ఇస్తారన్న ప్రచారం జరిగింద కానీ సాంకేతికంగా సాధ్యం కాదని తేలింది. రాజ్యసభ సీటే ఖచ్చితంగా ఇస్తారని అనుకున్నారు. అయితే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత అనూహ్యంగా ఆయన పేరు పరిశీలనలోకి రాలేదు. ఇప్పుడు అదానీ రేసు నుంచి వైదొలగడంతో ఈ సారి ఆయన పేరును పరిశీలించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
నాలుగో రాజ్యసభ సీటు బీజేపీ చాయిస్సేనా ?
అయితే వైఎస్ఆర్‌సీపీలో మాత్రం రాజ్యసభ అభ్యర్థులపై గుంభనం పాటిస్తున్నారు. బ యటకు చిన్న విషయం కూడా తెలియడం లేదు.కానీ మూడు మాత్రమే వైఎస్ఆర్‌సీపీ నేతలకు ఇస్తున్నారని మరొకటి బీజేపీ కోటాలో ఆ పార్టీ హైకమాండ్ సూచించిన వారికి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. అదానీ కుటుంబం నుంచి ఒకరి పేరును బీజేపీ సిఫారసు చేసి ఉంటుందని ఇప్పటి వరకూ భావించారు. అయితే అలాంటిదేమీ లేదని అదానీ గ్రూప్ ప్రకటనతో తేలిపోయింది. ఇప్పుడు బీజేపీ వేరే అభ్యర్థిని సూచిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఏపీ నుంచి రాజ్యసభ పదవీకాలం పూర్తి చేసుకుంటున్న సురేష్ ప్రభు బీజేపీ నేత. టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా ఆయన బీజేపీ అభ్యర్థిగానే రాజ్యసభకు పోటీ చేసి గెలుపొందారు. అలాగే ఈ సారి కూడా వైఎస్ఆర్‌సీపీ.. బీజేపీకి రాజ్యసభ సీటు ఆఫర్ చేసిందని.. పేరును బీజేపీనే ప్రతిపాదిస్తుందని చెబుతున్నారు . అందుకే అదానీ తమకు సీటు వద్దని చేసిన ప్రకటన విషయంలోనూ వైఎస్ఆర్‌సీపీ పెద్దగా స్పందించలేదంటున్నారు.
దావోస్ పర్యటనకు ముందే పేర్లు ఖరారు చేయనున్న సీఎం !
ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం జగన్ దావోస్ వెళ్లనున్నారు. ఆ లోపే అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది. 19వ తేదీన ఆయన బయలుదేరే అవకాశం ఉంది. మళ్లీ నెలాఖరు తర్వాతే తిరిగి వస్తారు. రాజ్యసభ నామినేషన్ల స్వీకరణకు తుది గడువు ఈ నెల 31వ తేదీ. జూన్ 1న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అదే నెల 3వ తేదీ వరకు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఇక జూన్ 10వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ముగిసిన తర్వాత అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే పోటీ ఉండదు కాబట్టి.. పోలింగ్ జరగదు. నామినేషన్ల ఉపసంహరణ రోజే ఏకగ్రీవ ప్రకటన ఉంటుంది.