Influence of Kavitha New Party: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక అంకం మొదలైంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పార్టీని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వంటి మూడు బలమైన శక్తులు ఉన్న చోట..  నాలుగో శక్తి గా కవిత ఏ మేరకు రాణిస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.  

Continues below advertisement

 తెలంగాణ రాజకీయాల్లో  నాలుగో శక్తి 

తెలంగాణలో ప్రస్తుతం త్రిముఖ పోటీ నెలకొంది. అధికారం కోల్పోయినా కేడర్ బలంగా ఉన్న బీఆర్ఎస్, అధికారంలో ఉన్న కాంగ్రెస్, పుంజుకుంటున్న బీజేపీ మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది. ఈ దశలో కవిత కొత్త పార్టీని ప్రకటించడం సాహసోపేతమైన నిర్ణయంగానే కనిపిస్తోంది. అయితే, తెలంగాణ రాజకీయాల్లో  స్పేస్  ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా సెంటిమెంట్, ప్రాంతీయ ఆకాంక్షలు బలంగా ఉన్న  గడ్డపై, గొంతు  లేని వర్గాలకు , అసంతృప్త నేతలకు కవిత పార్టీ ఒక వేదికగా మారే అవకాశం ఉంది. ప్రత్యేకించి మహిళా సాధికారత, తెలంగాణ సంస్కృతిని అజెండాగా మార్చుకుంటే కొంత మేర ఓటు బ్యాంకును ఆకర్షించవచ్చు.

Continues below advertisement

 సొంత ఇంటి నుంచే సవాల్? 

కవిత నిర్ణయం అన్నిటికంటే ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీనే ప్రభావితం చేయనుంది. కేసీఆర్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న నేతలు లేదా పార్టీలో ప్రాధాన్యత దక్కని సెకండ్ లైన్ లీడర్లు కవిత వైపు చూసే అవకాశం ఉంది. పార్టీ పేరులో తెలంగాణ ఉంటుంది.  ఇది బీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీల్చితే, అది పరోక్షంగా కాంగ్రెస్ ,  బీజేపీకి లాభం చేకూర్చవచ్చు. తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఆమె తీసుకుంటున్న ఈ అడుగు, తెలంగాణలో ఒక కొత్త రాజకీయ సంస్కృతికి నాంది పలకవచ్చు.  కవిత తన తాజా వ్యాఖ్యల్లో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. తెలంగాణలో జనాభా పరంగా పెద్ద సంఖ్యలో ఉన్న బీసీ సామాజిక వర్గాలను తన వైపు తిప్పుకోవడం ద్వారా బలమైన పునాది వేయాలని ఆమె వ్యూహంగా కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీలు కూడా బీసీ మంత్రాన్ని జపిస్తున్న తరుణంలో, కవిత తెలంగాణ బిడ్డ గా వారి ఆకాంక్షలను ఏ మేరకు నెరవేరుస్తారనేది కీలకం. ఆమె పార్టీలో చేరబోతున్న మేధావులు, ఉద్యమకారుల జాబితాను బట్టి ఈ పార్టీ గమ్యం దిశానిర్దేశం అవుతుంది.

 తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ పురుడుపోసుకుంటుందా? 

తెలంగాణ జాగృతి ద్వారా దశాబ్ద కాలంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న కవితకు క్షేత్రస్థాయిలో ఒక నెట్‌వర్క్ ఉంది. ఉద్యమ సమయంలో పనిచేసిన వారు, ప్రస్తుతం రాజకీయంగా అవకాశాలు లేని వారు ఆమె వెంట నడిచే అవకాశం ఉంది. ఒకవేళ ఆమె బలమైన అభ్యర్థులను నిలబెట్టి, ఒక పది నుంచి పదిహేను శాతం ఓట్లు సాధించగలిగితే.. రాష్ట్రంలో ఏ పార్టీ అయినా ప్రభుత్వ ఏర్పాటుకు ఆమె మద్దతు కోరాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే  కింగ్ మేకర్ గా ఎదిగే అవకాశం ఆమెకు ఉంటుంది.  ఆవిర్భావ సభలో పార్టీ జెండా, ఎజెండా , గుర్తు  పై పూర్తి స్పష్టత రానుంది.  తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు త్రిముఖ పోటీ నుంచి చతుర్ముఖ పోటీ వైపు మళ్లుతున్నాయి. ఈ మార్పు తెలంగాణ ఓటరు నాడిని ఎలా మారుస్తుందో వేచి చూడాలి. ముఖ్యంగా మహిళా నేత నేతృత్వంలో వస్తున్న మొదటి ప్రాంతీయ పార్టీగా ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందో  త్వరలోనే క్లారిటీ వస్తుంది.