Fifty percent increase in seats: నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదించిన 50 శాతం సీట్ల పెంపు సూత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ మేధోమథనానికి దారితీసింది. జనాభా ప్రాతిపదికన మాత్రమే పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం దారుణంగా పడిపోతుందన్న ఆందోళనలతో కేంద్రం ప్రతిపాదించిన ఈ ప్రోరాటా పద్ధతి ఏ మేరకు సమన్యాయం చేకూరుస్తుందనే దానిపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి.
నిష్పత్తి మారదు.. ప్రాధాన్యత తగ్గదు
అమిత్ షా ప్రతిపాదించిన ఫార్ములాలోని ప్రధానాంశం ఏమిటంటే.. ప్రతి రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలను కచ్చితంగా 50 శాతం మేర పెంచడం. దీనివల్ల రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న ప్రాతినిధ్య నిష్పత్తి ఏమాత్రం మారదు. ఉదాహరణకు, లోక్‌సభలో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల వాటా సుమారు 24 శాతంగా ఉంది. అన్ని రాష్ట్రాల్లోనూ సీట్లు 50 శాతం పెరిగినప్పుడు, మొత్తం సీట్ల సంఖ్య పెరిగినా దక్షిణాది రాష్ట్రాల వాటా అదే 24 శాతంగా కొనసాగుతుంది. తద్వారా జనాభా నియంత్రణ పాటించినందుకు ఏ రాష్ట్రమూ తన రాజకీయ బలాన్ని కోల్పోదని కేంద్రం భరోసా ఇస్తోంది.
ప్రోరాటా పద్ధతి - అందరికీ సమన్యాయమేనా?
ఈ ప్రోరాటా పద్ధతి ఒక మధ్యేమార్గం . కేవలం 2021/2026 జనాభా లెక్కల ఆధారంగా సీట్లు కేటాయిస్తే, ఉత్తరాది రాష్ట్రాల సీట్లు భారీగా పెరిగి, దక్షిణాది ప్రాబల్యం 18-20 శాతానికి పడిపోయే ప్రమాదం ఉంది. కానీ, ఈ 50 శాతం పెంపుదల సూత్రం వల్ల ఉత్తరప్రదేశ్ లేదా బీహార్ వంటి రాష్ట్రాలకు అదనపు ప్రయోజనం కలగదు, అలాగే కేరళ లేదా తమిళనాడు వంటి రాష్ట్రాలకు నష్టం వాటిల్లదు. అంటే, పార్లమెంటులో ఒక బిల్లును ఆమోదించుకోవడానికి అవసరమైన ఓట్ల శాతంలో దక్షిణాది రాష్ట్రాల బలం యధాతథంగా ఉంటుంది.
సంఖ్యా బలం వర్సెస్ ప్రభావం
అయితే, ఇక్కడ ఒక చిన్న మెలిక ఉందని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు. శాతం పరంగా వాటా మారకపోయినా, సంఖ్యాపరంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగే సీట్లు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు, 80 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 50 శాతం అంటే 40 సీట్లు పెరుగుతాయి, కానీ 17 సీట్లు ఉన్న తెలంగాణలో కేవలం 8 లేదా 9 సీట్లు మాత్రమే పెరుగుతాయి. ఇది జాతీయ రాజకీయాల్లో, ముఖ్యంగా ప్రధానిని నిర్ణయించే క్రమంలో అత్యధిక సీట్లు ఉన్న రాష్ట్రాల ప్రభావం ఇంకా పెరిగేలా చేస్తుందని కొందరు దక్షిణాది నేతలు వాదిస్తున్నారు. అయితే ఓవరాల్ సీట్లు కూడా పెరిగినందున ఇప్పుడు ఉన్న ప్రాధాన్యతే ఉంటుందని లెక్కలు తీస్తున్నారు.
సమాఖ్య స్ఫూర్తికి రక్షణ కవచం
దక్షిణాదికి ప్రస్తుతం ఉన్న 24 శాతం వాటా పదిలంగా ఉంటుందని కేంద్రం చెబుతుండటం ఒక గొప్ప ఊరట. గతంలో ఎప్పుడూ లేని విధంగా, జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రస్తుత సీట్ల ప్రాతిపదికన పెంపుదల చేపట్టడం వల్ల హిందీ మాట్లాడే రాష్ట్రాల ఆధిపత్యం పెరుగుతుందన్న భయాలకు తెరపడే అవకాశం ఉంది. ఇది భారతదేశ సమాఖ్య స్ఫూర్తిని కాపాడటమే కాకుండా, అభివృద్ధి చెందిన రాష్ట్రాలను శిక్షించకుండా ప్రోత్సహించే చర్యగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అమిత్ షా ప్రతిపాదించిన ఈ పద్ధతి ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభలో గల 129 స్థానాలు సుమారు 194కి పెరుగుతాయి. అయితే, ఈ ప్రక్రియను రాజ్యాంగబద్ధంగా ఎలా అమలు చేస్తారు? ఆర్టికల్ 82ను ఎలా సవరిస్తారు? అనే సాంకేతిక అంశాలపై ప్రభుత్వం ఇచ్చే వివరణపైనే ఈ ఫార్ములా విజయం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం, ప్రోరాటా పద్ధతి దక్షిణాది ప్రయోజనాలకు ఒక రక్షణ కవచంగా కనిపిస్తోంది.
