AP Capital Issue : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో వ్యూహం మార్చారు. దసరాకు విశాఖకు రావడం లేదని ఇన్ఫోసిస్ ఆఫీస్ ప్రారంభోత్సవంలో చెప్పారు. డిసెంబర్ కల్లా వస్తానన్నారు. నిజానికి విశాఖ జగన్ పాలన విషయంపై నాలుగేళ్లుగా విస్తృత ప్రచారం జరుగుతోంది. మూడు రాజధానుల బిల్లు పెట్టినప్పటి నుండి సీఎం జగన్ ఎప్పుడైనా విశాఖ రావొచ్చని వైసపీ నేతలు ప్రచారం చేస్తూనే ఉన్నారు. మార్చి పోతే సెప్టెంబర్ అన్నట్లు ఈ దసరా కాకపోతే.. వచ్చే సంక్రాంతికి అని చెబుతూ వచ్చారు. అయితే ఏదీ నిజం కాలేదు. ఈ దసరాకు ఆయన మారడం ఖచ్చితం అనుకున్నారు. ఎందుకంటే రుషికొండపై ముచ్చటపడి కట్టించుకున్న క్యాంప్ ఆఫీస్ దాదాపుగా పూర్తయింది. ఎన్నికలకు ఇంకా ఎంతో కాలం సమయం లేదు. అందుకే.. క్యాంప్ ఆఫీస్ విశాఖకు తరలిస్తారని అనుకున్నారు. కానీ మళ్లీ డిసెంబర్ లోపు అని సీఎం జగన్ వాయిదా వేసుకున్నారు.
న్యాయపరమైన చిక్కులు వస్తాయనే ఆగిపోయారా ?
సీఎం జగన్ దసరాకు విశాఖకు వెళ్లడం కోర్టు ధిక్కరణ అవుతుందన్న అభిప్రాయం ప్రభుత్వం జీవోలు ఇచ్చిన తర్వాత ఎక్కువ మంది నుంచి వచ్చింది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు సహా ప్రభుత్వ కార్యాలయాలు వేటినీ తరలించేందుకు వీల్లేదని 2022 మార్చిలో హైకోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా సుప్రీంకోర్టు నిరాకరించింది. కేసు విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. డిసెంబర్‌లో విచారణ జరగాల్సి ఉంది.ఇలాంటి సమయంలో విశాఖకు కార్యాలయాలు మారిస్తే కోర్టు ధిక్కరణ నేరం అవుతుందన్న ఉద్దేశంతో సీఎం జగన్ ఆగిపోయారని భావిస్తున్నారు.
డిసెంబర్ లో అయినా వెళ్తారా ?
సుప్రీంకోర్టులో అమరావతి కేసులపై విచారణ డిసెంబర్‌కు వాయిదా పడింది. గత విచారణ సందర్భంగా ప్రతివాదులందరికీ నోటీసులు పంపాలని ఆదేశించిన ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్‌ను లీడ్ మ్యాటర్‌గా పరిగణిస్తూ తదుపరి విచారణ వాయిదా వేసింది. తదుపరి విచారణ డిసెంబర్ నెలలో చేపడతామని అప్పుడే తేదీని ఖరారు చేస్తామని తెలిపింది. అమరావతిపై తదుపరి చట్టాలు చేయడానికి వీల్లేదని హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చి రిట్ ఆఫ్ మాండమస్ ప్రకటించింది. అయితే చట్టాలు చేయడానికి వీల్లేదని ప్రకటించడం .. తమ అధికారాల్లో జోక్యం చేసుకోవడమేనని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించలేదు.ఆరు నెలల ఆలస్యంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసింది. వేగంగా విచారణ చేయాలని పదే పదే ఏపీ ప్రభుత్వ లాయర్లు సుప్రంకోర్టును కోరారు. అయితే విచారణ అంత కంటే ఎక్కువగా ఆలస్యమవుతోంది.
డిసెంబర్‌లోనూ విచారణ జరగకపోతే రాజధాని అంశంగానే ఎన్నికలకు వెళ్లే ప్లాన్ ఉందా ?
డిసెంబర్ లోనూ న్యాయపరమైన అంశాలపై స్పష్టత రాకపోతే ఇదే అంశాన్ని హైలెట్ చేసుకుని సీఎం జగన్ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. తాను మూడు ప్రాంతాలకు మూడు రాజధానలు కడదామనుకున్నాను కానీ.. న్యాయస్థానాల్లో పిటిషన్లు వేసి విపక్షాలు అడ్డుకున్నాయని ఈ సారి గెలిపిస్తే మూడు రాజధాని చేసి తీరుతానన్న నినాదంతో ఆయన ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అందుకే వాయిదాలు వేస్తున్నారని అంటున్నారు. ఎన్నికలకు ముందు న్యాయపరమైన చిక్కులు ఉన్నప్పటికీ.. విశాఖకు మకాం మారిస్తే.. ఎన్నికల సమయంలో అనేక సమస్యలు వస్తాయని వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.