TS Paper Leak Politics :  భారత రాష్ట్ర సమితికి ప్రస్తుతం పరిస్థితులు అంత కలసి రావడం లేదు.  లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఇబ్బంది పడుతూంటే..  కేటీఆర్‌కు  టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వివాదాలు ఇబ్బందికరంగా మారాయి. విపక్షాల ఆరోపణలకు కేసీఆర్ వివరణ ఇచ్చినట్లుగా స్పందించడంతో అటు రేవంత్ రెడ్డి ఇటు బండి సంజయ్ ఆరోపణల తీవ్రత పెంచారు. అయితే ఈ ఆరోపణలు ఎదుర్కోవడానికా అన్నట్లుగా సిట్ అధికారులు  రాజకీయంలో జోక్యం చేసుకోడం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు సిట్ ను వేసిందే  ఈ కేసును నిర్వీర్యం చేయడానికని  విపక్షాలు ఆరోపణలు అందుకుంటున్నాయి. 


రాజకీయంగా చేసే ఆరోపణలకు సిట్ నోటీసులు ఇవ్వడం కరెక్టేనా ?


రాజకీయానికి అధికారవర్గానికి చాలా స్పష్టమైన తేడా ఉంటుంది. రాజకీయ నేతలు ఎన్ని ఆరోపణలు చేసుకుంటారో లెక్క పెట్టాల్సిన పని లేదు. కానీ ఈ ఆరోపణల్లో అధికారవర్గాలు జోక్యం చేసుకుంటే గందరగోళం ఏర్పడుతుంది. పేపర్ల లీకేజీ విషయంలో రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలకు ఆధారాలు కావాలని సిట్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఇంటికి ఆ నోటీసుల్ని అంటించింది. ఇరవై మూడో తేదీన తమ ఎదుటకు హాజరు కావాలని ఆదేశించింది. నిజానికి అలాంటి వ్యాఖ్యలు బండి సంజయ్ కూడా చేశారు. ఆయనకు ఈ నోటీసులు ఇవ్వలేదు. ఇస్తామని చెబుతున్నారు. కానీ  బండి సంజయ్ ముందుగానే  తనకు నోటీసులు ఇచ్చే దమ్ముందా అని సవాల్ చేస్తున్నారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి తనకు నోటీసులు ఇచ్చారు సరే.. దర్యాప్తుకు సంబంధించిన కీలకమైన విషయాలు చెప్పిన కేటీఆర్‌కూ నోటీసులు ఇవ్వాలని లేకపోతే హైకోర్టుకు వెళ్తానని ప్రకటించారు. ఇప్పుడు అటు రేవంత్ కానీ ఇటు సంజయ్ కానీ ఎదురు దాడి చేస్తోంది ప్రభుత్వం మీద కాదు.. సిట్ అధికారులపైనే. 


సిట్ నోటీసులపై రాజకీయ రచ్చ ఖాయం - నిరుద్యోగులు ఊరుకుంటారా ?


సిట్ ఇలా రాజకీయ పార్టీల నేతలకు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. వారు సిట్ అధికారులపై ఎదురుదాడి చేస్తారు. సిట్ అధికారులు ఎవరికి సన్నిహితులో ప్రచారం చేస్తారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం వారిని ఉపయోగించుకుంటున్నారని  వాదిస్తారు. ఈ వ్యవహారంలో సిట్ దర్యాప్తు అసలు కోణంలో జరగడం కష్టమవుతుంది. అసలు సిట్ చేయాల్సింది వేరు. రాజకీయంగా ఎవరు ఎన్నైనా ఆఆరోపణలు చేసుకోవచ్చు కానీ.. వాటికి ఆధారాలు అడగడం అంటే... సిట్ విచారణ దారి తప్పినట్లే. ప్రత్యేక దర్యాప్తు బృందం అసలు చేయాల్సింది..నేరం ఎలా జరిగింది..ఎవరు చేశారు.. ఎంత నష్టం జరిగింది.. నిరుద్యోగులు నష్టపోకుండా ఏం చేయగలగాలి వంటివే. కానీ ఇప్పుడు  రాజకీయంలో వేలు పెట్టేసింది.  
 
నిరుద్యోగుల భావోద్వేగాలతో ముడిపడిన అంశం ! 


తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి సారి పెద్ద ఎత్తున ఉద్యోగ  ప్రకటనలు ఇస్తున్నారు.  అసలు ఉద్యమ ఎజెండాలోనే ఉద్యోగాలు ఉన్నాయి. తెలంగాణ వస్తే తమకు ఉద్యోగం వస్తుందని నిరుద్యోగులు నమ్మారు. ఎనిమిదేళ్ల పాటు ఎదురు చూసి ఇప్పుడు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూంటే.. అడ్డగోలుగా తన్నుకుపోతున్నారన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది.  అందుకే ఓ నిరుద్యోగి ఆత్మహత్య కూడా చేసుకున్నారు.  ఖచ్చితంగా ఇది ప్రభుత్వ లోపమే.  ఉద్యోగ ప్రశ్నాప త్రాలను ఇంత ఈజీగా తస్కరించవచ్చని ఎవరూ అనుకోరు. అది అంత తేలికగా అయ్యేది కాదు. అందుకే నిరుద్యోగుల్లో అసహనం కనిపిస్తోంది. రాజకీయ పార్టీలు ఆరోపణలు వారు మరింత ఆగ్రహానికి గురయ్యేలా చేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం  నిరుద్యోగులకు మరింత భరోసా ఇచ్చేలా దర్యాప్తు చేయాల్సిఉంది.  తక్షణం చర్యలు తీసుకుని నిరుద్యోగుల్లో నమ్మకం పెంచుకుంటేనే ప్రయోజనం . లేకపోతే మొదటికే మోసం వస్తుంది. అందుకే కేటీఆర్ కూడా డిఫెన్సివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. కానీ రాను రాను విపక్షాల ఆరోపణలు తీవ్రమవుతున్నాయి.   


డిఫెన్స్‌లో బీఆర్ఎస్ ! 


టీఆర్ఎస్ రాజకీయంలో కానీ బీఆర్ఎస్ రాజకీయంలో కానీ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇతర పక్షాలను ఇబ్బంది పెట్టడం తప్ప.. బీఆర్ఎస్ ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. ఓ అజెండాను సెట్ చేయడం తప్ప.. తాము ఫాలో అయింది లేదు . కానీ తొలి సారి ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో కేటీఆర్  చేసిన వ్యాఖ్యలతో డిఫెన్సివ్ గేమ్ ఆడుతున్నట్లయింది. ఇది ఆయనపై అనేక రకాల ఆరోపణలు రావడానికి కారణం అవుతుంది. చివరికి రాజకీయంలో సిట్ జోక్యం చేసుకోవడం  బీఆర్ఎస్‌కు మరింత ఇబ్బంది కలిగించే అవకాశం ఏర్పర్చిందని అనుకోవచ్చు.