BRS On Chandrababu Arrest :  తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడును అరెస్ట్ చేయడం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. ఎన్నికలకు ముందు పూర్తిగా రాజకీయకక్ష సాధింపు చర్యగానే అన్ని పార్టీలు చూస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు సహా అన్ని పార్టీల నేతలు చంద్రబాబు అరెస్టును ఖండించారు. బీఆర్ఎస్ నేతలు కూడా ఖండించారు కానీ.. ఎక్కువగా  టీడీపీలో ఉండి బీఆర్ఎస్‌లో కీలక పొజిషన్లలో ఉన్న వారే స్పందించారు. కానీ ఇటీవల కేటీఆర్ .. చంద్రబాబు అరెస్టుతో తెలంగాణకు సంబంధం లేదని అది అక్కడి రాజకీయం అని ఘాటుగా వ్యాఖ్యానించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై రాజకీయంగా సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది.  ఈ లోపు బీఆర్ఎస్ కూడా ముఖ్య నేతలు కూడా టోన్ మార్చారు. హరీష్ రావు చంద్రబాబు అరెస్టును ఖండిస్తన్నట్లుగా ప్రకటన చేశారు. ఖమ్మం పర్యటనలో కేటీఆర్..  ఎన్టీఆర్‌ను గతంలో లేనంతగా పొగిడారు. దీంతో రాజకీయం మారిందేమో అన్న అభిప్రాయానికి తెలంగాణ రాజకీయవర్గాలు వస్తున్నాయి.


చంద్రబాబుకు మద్దతుగా తెలంగాణలో పలు చోట్ల ర్యాలీలు


చంద్రబాబునాయుడును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన తర్వాత ఆయన అరెస్ట్ అక్రమమని నిరసిస్తూ.. తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు చేపట్టిన నిరసనలు క్రమంగా పెరుగుతూడంటంతో  పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇది వివాదాస్పదం అయింది. అయితే చాలా చోట్ల బీఆర్ఎస్ నేతలే స్వయంగా చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించారు. ఎల్బీనగర్‌లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సహా అనేక మంది ప్రదర్శనలు నిర్వహించారు. మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వంటి వారు రాజకీయాల్లో కక్ష సాధింపులు మంచివి కావని ప్రకటనలు చేసారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు నల్లగొండ, నిజామాబాద్ వంటి చోట్ల ఇంకా ప్రదర్శలు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌లోనూ పలు కాలనీల్లో చంద్రబాబుకు్ మద్దతుగా ప్రదర్శనలు చేస్తున్నారు. 


మొదట చంద్రబాబు అరెస్టు అక్కడి రాజకీయాలన్న హరీష్, కేటీఆర్ ! 


చంద్రబాబు అరెస్టు అయిన తర్వాత ..  హరీష్ రావు ఓ సందర్భంలో పాపం చంద్రబాబు అరెస్టయ్యారట అని.. కాస్త వెటకారక స్వరంలో మాట్లాడారు. తర్వాత అవి ఏపీ రాజకీయాలని .. తెలంగాణకు సంబంధం లేదన్నారు. కేటీఆర్ కూడా అదే చెప్పారు. కేటీఆర్ అసలు  తెలంగాణలో నిరసనలు చేస్తే అణిచి వేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ  ప్రకటనలు మిస్ ఫైర్ అయ్యాయన్న విశ్లేషణలు వచ్చాయి. తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా బలహీనపడింది కానీ.. చంద్రబాబుపై అభిమానం మాత్రం అంతే ఉందని.. రోజు రోజుకు పెరుగుతున్న నిరసనలు వెల్లడిస్తూ ఉండటంతో పాటు.. కేటీఆర్, హరీష్ ల స్పందన ద్వారా.. టీఆర్ఎస్‌కు అండగా ఉంటున్న కొన్ని  వర్గాలు దూరమవుతాయన్న ప్రచారం ప్రారంభమయింది. దీంతో  వెంటనే బీఆర్ఎస్ నష్టనివారణా చర్యలు తీసుకుందని.. చంద్రబాబు అరెస్టు విషయంలో ఆయనకు సానుభూతి చూపిస్తున్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారంటున్నారు. కేటీఆర్ ఖమ్మంలో ఎన్టీఆర్ ను పొగడటం వెనుకా అదే రాజకీయం ఉందంటున్నారు. 


చంద్రబాబు అరెస్ట్ ఏపీలోనే కాదు తెలంగాణలోనూ టీడీపీకి మేలు చేసిందా ?


చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని రాజకీయ కక్షల కోసమే అరెస్టు చేశారన్న అభిప్రాయం ప్రజల్లో ఎక్కువగా ఏర్పడటంతో ఆయనకు సానుభూతి వస్తోందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఇది తెలంగాణలోనూ రావడం.. మొదట్లో బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యతిరేకత ప్రకటనలతో కొన్ని వర్గాల్లో వ్యతిరేకత రావడంతో టీడీపీకి రాజకీయంగా మేలు జరిగిందని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ ఎలా చేయాలన్నది ఇంకా కసరత్తు చేయలేదు. బలమున్న స్థానాల్లో పోటీ  చేయాలనుకుంటోంది. బీజేపీతో పొత్తులు ఉండవని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో తమకు అండగా ఉంటున్న కొన్ని  వర్గాల ఓట్లు .. చంద్రబాబు అరెస్టు వల్ల దూరం కాకూడదన్న ఉద్దేశంతోనే బీఆర్ఎస్ అగ్రనేతలు ... విధానాన్ని మార్చుకుంటున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.