BRS Politics :   భారత రాష్ట్ర సమితిలో అంతర్గతంగా అలజడి రేగుతోంది. పలువురు పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారన్న ప్రచారం జరుగుతూండటమే దీనికి కారణం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లలో డిపాజిట్లు కూడా కోల్పోవడంతో చాలా మంది నేతలు రాజకీయ  భవిష్యత్ పై ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వారిపై ఒత్తిడి వస్తోంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ప్రయోగించిన ఆకర్ష్ తరహాలోనే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఆకర్ష్ అస్త్రం ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చనిపోవడంతో వచ్చిన  ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. 


కాంగ్రెస్‌తో పలువురు ఎమ్మెల్యేల చర్చలు ?               


ప్రస్తుతం 35 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో ఉన్నారు. వీరిలో కనీసం ఇరవై  మందిని పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. నిజానికి పార్టీ ఫిరాయింపులపై  పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు నుంచే ఊహాగానాలు వస్తున్నాయి. కొంత మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. వారంతా కాంగ్రెస్ చేరికలను ఖండించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే చేరిపోవడానికి రెడీ అయినా చివరి క్షణంలో ఆగిపోయారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. ఇప్పుడు వారందరితో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మరోసారి చర్చించి చేరికలకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా చెబుతున్నారు.      


పిలిచి మాట్లాడుతున్న కేసీఆర్                     


ఎవరెవరు కాంగ్రెస్‌లో చేరుతారో స్పష్టత రావడంతో.. బీఆర్ఎస్ హైకమాండ్ వారిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కొద్ది రోజుల కిందట నలుగురు ఎమ్మెల్యేలను కేసీఆర్ ఫామ్ హౌస్‌కు పిలిపించుకుని మాట్లాడారు. వారితో దిగిన ఫోటోను విడుదల చేశారు. వారు పార్టీ మారుతారని తెలియడంతోనే  పిలిచి మాట్లాడారని అంటున్నారు. అలాగే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా పార్టీ మారబోతున్నారని అంటున్నారు. ఆయనను చేర్చుకోవద్దని కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన సరితా తిరుపతయ్య పోరాడుతున్నారు . కానీ ఆమెకు అభయం లభించలేదని తెలుస్తోంది. 


కేసీఆర్‌కు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేస్తారా ?                  


అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవ్వాలని అనుకుంటున్నారు. అంతకు ముందే ఆయనకు ప్రతిపక్ష నేత హోదా పోయేలా చేయాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీనే కాదు.. బీజేపీ కూడా ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నంలో ఉందని చెబుతున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా తామే వ్యవహరించాలని బీజేపీ అనుకుంటోంది. రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్ బీజేపీకే ఉంటుందన్న ఉద్దేశంతో కొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపే చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలతో తమ పార్టీ నేతల్ని ఆపడం.. బీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి తలకు మించిన భారం అవుతోంది.