I.N.D.I.A. Meeting: దేశంలో ఎన్నికల మోడ్ తీసుకురావాలని I.N.D.I.A. నిర్ణయించింది. గురువారం ముంబైలోని ముంబై గ్రాండ్ హయాత్‌ హోటల్ జరిగిన అనధికార సమావేశంలో ప్రతిపక్ష పార్టీల నేతలు 2024 లోక్‌సభ ఎన్నికలల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని NDAని ఎదుర్కోవడానికి  సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రణాళికలపై చర్చించారు. తమ ప్రణాళికలను వేగవంతం చేయాలని నిర్ణయించుకున్నాయి . మరికొందరు అగ్రనేతలు సీట్ల పంపకాలను చర్చించారు. మరి కొన్ని వారాల్లో ఉమ్మడి ఎజెండాతో ముందుకు రావాల్సి ఉంటుందని నొక్కి చెప్పారు.


శుక్రవారం అధికారికంగా సమావేశం జరగునుంది. ఇందులో 28 బీజేపీయేతర పార్టీలు ముంబైలోని ముంబై గ్రాండ్ హయాత్‌ హోటల్ అధికారిక సమావేశాన్ని నిర్వహించనున్నాయి. ఇందులో I.N.D.I.A.కి చెందిన ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన 11 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. 


శుక్రవారం సమావేశంలో చర్చకు వచ్చే ముఖ్యాంశాలు
శుక్రవారం 10.30 గంటలకు దాని లోగోను ఆవిష్కరించే అవకాశం ఉంది. గురువారం దీనిపై ఎటువంటి చర్చ జరగలేదు. శుక్రవారం సమావేశం ఎజెండాపై గురువారం ప్రతిపక్ష నేతలు చర్చించారు. 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేసి సంయుక్తంగా విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తారు. సొంత పార్టీలకు ఉండే అధికార ప్రతినిధుల తరహాలో కూటమి తరఫున మాట్లాడేందుకు కొంత మంది అధికార ప్రనిధులను ప్రకటించవచ్చు. 


కూటమి ఉమ్మడి కార్యక్రమాన్ని ప్లాన్ చేయడానికి నాలుగు సబ్ గ్రూపులతో కలిసిన పెద్ద గ్రూప్‌ను ఏర్పాటు చేసే యత్నాల్లో ఉన్నారు. కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడం, సామాజిక నిర్వహణ కమిటీ, ఒక సమన్వయ కమిటీని చేయాలని కూడా నిర్ణయించారు. అలాగే మీడియా, అధికార ఎన్‌డీఎపై పరిశోధన, డేటా విశ్లేషణలు చేసే కమిటీ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఉమ్మడి ప్రచారాలు, ర్యాలీల కోసం ఒక సబ్‌కమిటీలను కూడా ఏర్పాటు చేస్తారు.


I.N.D.I.A. కూటమికి కన్వీనర్‌ ఉండటంపై శుక్రవారం కూటమికి చర్చ జరిగే అవకాశం ఉంది. అక్టోబర్ 2 నాటికి కూటమి మేనిఫెస్టోను తప్పనిసరిగా విడుదల చేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విపక్షాల  కూటమికి చెప్పారు. వచ్చే నెల చివరి నాటికి లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై  ఖరారు చేయాలని అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు 


ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున 2024 ఎన్నికల ప్రణాళికలను ఖరారు చేయడం అవసరమని పలువురు ప్రతిపక్ష నేతల అభిప్రాయపడ్దారు. ముందస్తు ఎన్నికలు వస్తే సమయం సరిపోదని, సమావేశాలు ఓట్లు రాల్చవని నొక్కి చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ కూడా రాష్ట్రాలలో పార్టీల మధ్య సీట్ల భాగస్వామ్యాన్ని త్వరగా ఖరారు చేయాలని పిలుపునిచ్చారని తెలిసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుల్లెట్ పాయింట్‌లలో ఉమ్మడి జాతీయ ఎజెండాను సిద్ధం చేయాలని సమావేశంలో చెప్పినట్లు తెలిసింది.


ఎన్డీఏ ఎన్నికల వ్యూహం, జిమ్మిక్కులను ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు అన్ని ఆకస్మిక ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. కేంద్రం సెప్టెంబర్ 18 నుంచి 22 మధ్య ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్న నేపథ్యంలో నితీష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. 


కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ మాజీ చీఫ్‌లు సోనియా గాంధీ , రాహుల్ గాంధీ, NCP చీఫ్ శరద్ పవార్, శివసేన (UBT) అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ బెనర్జీ, AAP కన్వీనర్ కేజ్రీవాల్, RJD అధినేత లాలూ ప్రసాద్, తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్, నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, సీపీఐ(ఎం) సీతారాం ఏచూరి, సీపీఐకి చెందిన డి రాజా, సీపీఐ(ఎంఎల్) దీపాంకర్ భట్టాచార్య, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆర్‌ఎల్‌డీ జయంత్ చౌదరి తదితరులు అనధికారిక చర్చల్లో పాల్గొన్నారు.