KT Rama Rao Greater Hyderabad Meetings: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  ఎన్నికలపైనే పడింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మారిన పొలిటికల్ ఈక్వేషన్లతో ఈ ఏడాదిలోనే రాబోయే గ్రేటర్ ఎన్నికలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హైదరాబాద్‌ను తమ పార్టీకి బలమైన కోటగా నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. దీనికోసం నగరంలో తెరవెనుక ఒక భారీ  వార్ రూమ్  రన్ అవుతున్నట్లు, అందులోంచే వ్యూహాత్మక ఆపరేషన్లు నడుస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

Continues below advertisement

మైక్రో లెవల్ ప్లానింగ్ పై కేటీఆర్ దృష్టి

ఈ సారి కేటీఆర్ కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా, మైక్రో-లెవెల్ ప్లానింగ్‌పై దృష్టి పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని డివిజన్ల వారీగా ఓట్ల మార్పిడి, ఓటర్ల జాబితా సవరణ   ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు అక్రమంగా ఓట్లను తొలగించకుండా ఉండేందుకు క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ ఏజెంట్లను  అలర్ట్ చేశారు. నియోజకవర్గాల వారీగా అసెంబ్లీ ఇన్‌చార్జులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో నిరంతరం టచ్‌లో ఉంటూ వరుస సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టకూడదనే సంకల్పం ఆయన ప్లానింగ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.

Continues below advertisement

రెండు గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పట్టు 

ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరకముందు, హైదరాబాద్ మహానగరంలో గులాబీ పార్టీకి అసలు ఉనికి ఉండేది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా వెనుకాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ మలి దశ ఉద్యమం, ఆ తర్వాత పదేళ్ల అధికార కాలంలో ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చడం ద్వారా బీఆర్ఎస్ ఇక్కడ తిరుగులేని పట్టు సాధించింది. ఇప్పుడు రాష్ట్రంలో అధికారం లేనప్పటికీ.. నగర ప్రజలు ఇప్పటికీ తమవైపే ఉన్నారని, తమ బలం తగ్గలేదని నిరూపించుకోవాల్సిన అగ్నిపరీక్ష కేటీఆర్ ముందుంది.

గెలుపు బీఆర్ఎస్‌కు అత్యంత అవసరం

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో గ్రేటర్ ఎన్నికల్లో గెలవడం బీఆర్ఎస్ మనుగడకు ఎంత అవసరమో కేటీఆర్‌కు బాగా తెలుసు. ఒకవేళ ఇక్కడ గనుక పట్టు కోల్పోతే, పార్టీ కేడర్ నైరశ్యంలోకి వెళ్లడమే కాకుండా వలసల తీవ్రత పెరిగే ప్రమాదం ఉంది. అందుకే జీహెచ్‌ఎంసీ ఎన్నికలను డూ ఆర్ డై  బ్యాటిల్‌గా భావించి కేటీఆర్ రంగంలోకి దిగారు. ఇటీవల జరిగిన రివ్యూ మీటింగుల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్న ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుని, కార్పొరేటర్ టికెట్లు ఆశించే వారు ప్రజల్లోనే ఉంటూ పోరాడాలని దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది చివర్లో ఎలాగైనా గ్రేటర్ పీఠాన్ని దక్కించుకుని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడింది తామేనని నిరూపించడమే కేటీఆర్ ఏకైక లక్ష్యం. ఇందుకోసం ఓటర్ల నమోదు నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు ప్రతి విషయంలోనూ డేటా ఆధారిత వ్యూహాలతో దూసుకుపోతున్నారు. కేటీఆర్ నడుపుతున్న ఈ నిశ్శబ్ద యుద్ధం మరియు క్షేత్రస్థాయి వ్యూహాలు గ్రేటర్ రాజకీయాల్లో ఎలాంటి ఫలితాలను ఇస్తాయో, కూటమి మరియు కాంగ్రెస్ స్పీడ్‌కు ఎలా బ్రేకులు వేస్తాయో చూడాలి.