KCR Akhilesh Meet : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తున్నది. దాదాపు రెండుగంటలకుపైగా భేటీ కొనసాగింది. దేశ రాజకీయాల్లో బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు, వాటిని ఎదుర్కొనేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయంపై చర్చించినట్లు సమాచారం. అఖిలేష్ యాదవ్ వెంట సమాజ్ వాది పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ కూడా ఉన్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్ తరచూ ఇతర రాష్ట్రాల పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు.
ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి కేసీఆర్ నైతిక మద్దతు ఇచ్చారు. అఖిలేష్ యాదవ్ గెలుస్తాడని పలుమార్లు చెప్పారు. అయితే ఎన్నికల ఫలితాలు అనుకున్న విధంగా రాలేదు. బీజేపీని ఎదుర్కొనే విషయంలో కేసీఆర్, అఖిలేష్ యాదవ్ ఒకే మాట మీద ఉంటున్నారు. ఈ క్రమంలో రాజకీయ వ్యూహం ఎలా పాటించాలన్నదానిపై చర్చించినట్లుగా తెలుస్తోంది. త్వరలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. కేసీఆర్ ఇంకా ఎవరికి మద్దతివ్వాలో నిర్ణయించుకోలేదు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా నిలబడిన కాంగ్రెస్ నేత మార్గరేట్ అల్వాకు ఓటు వేసే విషయంపై ఇంకా ఎలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకోలేదు.
నాలుగు రోజుల కిందట ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. అయితే ఇంకా కలవలేదు. జాతీయ రాజకీయాల్లో భాగంగా వివిధ పార్టీల నేతలతో మాట్లాడుతురాని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఓవైపు తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి హైదరాబాద్ ను వరదలు వణికించాయి. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కాలుకు గాయం కావడంతో ప్రగతిభవన్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నా సీఎం కేసీఆర్ ఢిల్లీలో మకాం వేయడంపై విమర్శలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ అంతర్గతంగా మరికొన్ని రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నారని.. రెండు, మూడు రోజుల్లో అయన మళ్లీ హైదరాబాద్ తిరిగి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.