Balineni Casino : కేసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన తర్వాత రాజకీయంగానూ ఈ అంశం చర్చనీయాంశమయింది. ఆయన ఖాతాదారుల్లో రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కొంత మంది పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ పేర్లలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు కూడా ఉంది. దీంతో ఆయన స్పందించారు. కేసినో నిర్వాగకుడు చీకోటి ప్రవీణ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. తాను పేకాట ఆడతానని ఒప్పుకుంటాన్నారు అప్పుడప్పుడూ కేసినోకీ పోయివస్తూంటానన్నారు. అంత మాత్రాన చీకోటి ప్రవీణ్ కేసినోతో కానీ ఆయన హవాలాతో కానీ తనకు సంబంధం ఉన్నట్లు కాదన్నారు. 


బాలినేనిపై కేసినో, పేకాట ఆరోపణలు తరచూ చేసే టీడీపీ నేతలు 


ఇటీవలి వరకూ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డిపై టీడీపీ నేతలు గతంలో పలుమార్లు పేకాట, కేసినో ఆరోపణలు చేశారు. ఆయన కేసినోల కోసమే నెలలో సగం రోజులు కేటాయిస్తూంటారని ఆరోపిస్తూంటారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి వీటిని ఖండిస్తూ ఉంటారు. దమ్ముటే నిరూపించాలని సవాల్ చేస్తూంటారు. కొద్దిరోజుల కిందట ఒంగోలు నుంచి చెన్నైకు తరలిస్తున్న రూ. ఐదు కోట్ల నగదును తమిళనాడు పోలీసులు పట్టుకున్నారు. అప్పట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉన్నారు.  ఆ నగదు అంతా బాలినేని శ్రీనివాసరెడ్డి హవాలా రూపంలో పంపుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. 


చెన్నైకు హవాలా నగదు తగలిస్తున్నారని.. హవాలా మంత్రి అని పిలుస్తున్న టీడీపీ నేతలు


తమిళనాడులో నగదు పట్టుబడినప్పటి నుండి  బాలినేని శ్రీనివాసరెడ్డిని టీడీపీ నేతలు హవాలా మంత్రి అని టీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తనను అలా అంటే ఊరుకునేది లేదని పలుమార్లు హెచ్చరించారు కూడా. బాలినేని పై ఈ రకమైన ఇమేజ్ ఉండటతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కేసినోలు.. హవాలా కేసుల గురించి చర్చకు వచ్చినా ఆయన పేరు ప్రచారంలోకి వస్తోంది. ఉద్దేశపూర్వకంగా టీడీపీ నేతలు ఇలా ప్రచారం చేస్తున్నా...  బాలినేని శ్రీనివాసరెడ్డికి మాత్రం వివరణ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. 


ఏపీ రాజకీయాల్లో చీకోటి ప్రవీణ్ కలకలం


చీకోటి ప్రవీణ్ ఇంట్లో సోదాల్లో  స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు ఇతర పత్రాల్లో పదహారు మంది ఎమ్మెల్యేల పేర్లు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆ పేర్లు ఎవరివో ఇంత వరకూ బయటకు రాలేదు. కానీ కొంత మందిపేర్లను.. వారి బ్యాక్ గ్రౌండ్ ను బట్టి సోషల్ మీడియాలో తెరపైకి వస్తున్నాయి. దీంతో రాజకీయంగా దుమారంరేగుతోంది.