TDP News: పొత్తుల వ్యవహారం కొలిక్కిరావడంతో అందుకు తగ్గట్లుగా సొంతపార్టీ నేతలను మానసికంగా సిద్ధం చేసే పనిలోపడ్డారు తెలుగుదేశం‍(TDP) అధినేత చంద్రబాబు(CBN). పొత్తులో భాగంగా కొన్నిసీట్లను మిత్రపక్షాలకు కేటాయించాల్సిరావడంతో...ఆ సీట్లపై ఆశలు పెట్టుకున్న పార్టీ నేతలకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సీట్ల త్యాగం చేసిన వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ప్రాధాన్యం ఉంటుందని సంకేతాలిచ్చారు. 


తొలి ప్రాధాన్యం మీకే 
సార్వత్రిక ఎన్నికలకు సమయం మరింత దగ్గరపడటంతో  తెలుగుదేశం(TDP) పార్టీ పొత్తుల వ్యవహారం, సీట్లపంపిణీపై తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి బీజేపీ(BJP) పెద్దలను కలిసి వచ్చిన చంద్రబాబు..తెలుగుదేశం(TDP) పోటీ చేయనున్న సీట్లు ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు కేటాయించాల్సి సీట్లను సైతం  ఓకే చేశారు. ఇక మిగిలింది మిత్రపక్షలకు కేటాయించిన సీట్లలో టిక్కెట్లు ఆశిస్తున్న సొంత పార్టీ నేతలను బుజ్జగించడమే. ఇప్పుడు అదే పనిలో బిజీగా ఉన్నారు బాబుగారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మిత్రపక్షాలతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని...మరోసారి జగన్(Jagan) కు అవకాశం ఇస్తే పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని  నేతలకు ఆయన సూచించారు. కాబట్టి మిత్రపక్షాలకు సీట్లు కేటాయించిన చోట ప్రతిఒక్కరూ సహకరించాలని అందరితో కలిసి నడవాలన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ప్రాధాన్యం సీట్లు త్యాగం చేసిన వారిదేనన్నారు. ఎమ్మెల్సీ(MLC), రాజ్యసభ(Rajya Sabha) సీట్లలో సర్దుబాటు చేస్తామని...కార్పొరేషన్ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈమేరకు పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన....టిక్కెట్ రాలేదని ఎవరూ నిరుత్సాహపడొద్దని కోరారు. పార్టీని నమ్ముకుని ఉన్న వారికి కచ్చితంగా గుర్తింపు, ప్రాధాన్యం ఉంటాయని తెలిపారు. అలాంటి వారిని పార్టీ ఎప్పటికీ మర్చిపోదన్నారు. జగన్ తో విసిగిపోయిన చాలా మంది వైసీపీ నేతలు.. రాష్ట్రాభివృద్ధి కోసం తెలుగుదేశంలో చేరుతాం అంటున్నారని..వారి గుణగణాలు పరిశీలించి, పార్టీ బలోపేతానికి పనికొస్తారనుకున్న వాళ్లనే తీసుకుంటామన్నారు. అలాంటి వారితోనూ కలిసి పనిచేయాలని సూచించారు. 


నష్టపరిస్తే మరింత నష్టపోతాం
ఐదేళ్ల జగన్ అరాచక పాలన ఒకసారి అందరూ గుర్తు తెచ్చుకోవాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. ఈ ఐదేళ్లు ప్రతిఒక్కరూ ఎన్నెన్ని కష్టాలు పడ్డామో మననం చేసుకోవాలన్నారు. పొత్తు ధర్మం పాటించకుండా మరోసారి నష్టం చేయాలని చూస్తే మీరే తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. కాబట్టి ప్రతిఒక్కరూ పొత్తులకు సహకరించాలన్నారు. రాజకీయంగా మీకు కొన్ని ఇబ్బందులు వస్తాయని తనకూ తెలుసునన్నారు. అలాంటి ఇబ్బందులు ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకొస్తే సామరస్యంగా సర్దుబాటు చేస్తామన్నారు.  రా కదలిరా సభలు ముగుస్తున్నందున త్వరలో మరో ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. బీసీ సాధికార సభలకు మంచి స్పందన వస్తోందని.. ప్రతి నియోజకవర్గంలో ఈ సభలను నిర్వహించాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. ప్రతి 50 ఇళ్లకు ఒకరి చొప్పున కుటుంబ సారథులను నియమించాలని, ఓటర్ల జాబితాలో బోగస్‌ ఓట్లు లేకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో పార్టీ ఇచ్చిన హామీలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని.. నిర్లక్ష్యం చేయవద్దని పార్టీ నేతలకు చెప్పారు.