Nitin Gadkari Bombay High Court Case:  నీట్  పరీక్షల వివాదం తర్వాత, ఇప్పుడు దేశంలో తదుపరి జెన్ జీ, మధ్యతరగతి ప్రజాగ్రహానికి కేంద్రంగా E20  పెట్రోల్  ఇంధన విధానం మారబోతున్న  సూచనలు కనిపిస్తున్నాయి.  సాధారణ వాహనదారులు, ముఖ్యంగా డెలివరీ బాయ్స్, ఉద్యోగులు, ద్విచక్ర వాహనదారులు రోజువారీ మైలేజ్ తగ్గిపోవడం, ఇంజిన్ పార్ట్‌లు త్వరగా పాడైపోవడం, నిరంతర రిపేర్ల వల్ల ఖర్చులు పెరగడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ ఆగ్రహం నెమ్మదిగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపైకి, ముఖ్యంగా రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వైపునకు మళ్లుతోంది.

Continues below advertisement

గడ్కరీపై తీవ్ర వ్యతిరేక  ప్రచారం

ఈ వివాదంలో గడ్కరీ సొంత ప్రయోజనాలు, ఆయన కుటుంబ లాభాలు దాగి ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో డిజిటల్ ,  AI డీప్‌ఫేక్ వీడియోలతో కూడిన ప్రచారం ఊపందుకుంది. అయితే, దీనిపై నితిన్ గడ్కరీ బాంబై హైకోర్టును ఆశ్రయించారు. ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అనేది కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని విధానమని, రోడ్డు రవాణా శాఖ మంత్రిగా తనకు అందులో ఎలాంటి వ్యక్తిగత లేదా విధానపరమైన స్వార్థ ప్రయోజనాలు లేవని గడ్కరీ కోర్టులో స్పష్టం చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించే దుష్ప్రచారాన్ని, డీప్‌ఫేక్ కంటెంట్‌ను తొలగించేలా మెటా, ఎక్స్, గూగుల్ సంస్థలపై సివిల్ దావా వేసేందుకు హైకోర్టు అనుమతి కూడా లభించింది.

Continues below advertisement

మైలేజ్‌లో కోత ఐదు శాతం లోపేనని కేంద్రం వివరణ

ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా E20 వల్ల ఇంజిన్లకు ప్రమాదం లేదని, మైలేజ్‌లో కోత కేవలం 3 నుండి 5 శాతమేనని సర్థించుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయి అనుభవాలు భిన్నంగా ఉన్నాయన్నది వినియోగదారుల వాదన. ప్రత్యేకించి 2023 కంటే ముందు తయారైన లేదా E20-కాంపాటిబిలిటీ లేని వాహనాలలో ఫ్యూయల్ లైన్లు, కార్బొరేటర్లు, రబ్బర్ సీల్స్ త్వరగా పాడవుతున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. దీనికితోడు బంకుల్లో సాధారణ పెట్రోల్ E10 లేదా ప్యూర్ పెట్రోల్ ప్రత్యామ్నాయంగా లభించకపోవడం లేదా ఎక్కువ ధరకు అందుబాటులో ఉండటం మధ్యతరగతి జేబులపై అదనపు భారాన్ని మోపుతోంది.

గడ్కరీపైనే ప్రధానంగా డిజిటల్ క్యాంపెయిన్ 

మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు, మంత్రుల రాజీనామాల వార్తల వల్ల ఈ వివాదం కొంతకాలం పక్కదారి పట్టినట్లు అనిపించినా, స్థానికంగా నిరసన జ్వాలలు చల్లారలేదు. దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైన ఆందోళనలతో పాటు, పార్లమెంట్ ముట్టడికి రవాణా సంఘాలు పిలుపునిచ్చాయి. రోజువారీ వాహనాలపై ఆధారపడే యువత, ఉద్యోగులతో కూడిన  జెన్ జీ  నెట్‌వర్క్ సామాజిక మాధ్యమాల్లో దీనిపై పెద్ద ఎత్తున డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. నీట్ వివాదంలో మాదిరిగానే యువత వీధుల్లోకి వస్తే, అది కేంద్రానికి కోలుకోలేని దెబ్బగా మారే ప్రమాదం ఉంది. గతంలో కీలక సమస్యలు ఎదురైనప్పుడు మంత్రులపై రాజీనామా ఒత్తిడి పెరిగినట్లే, ఈ ఇంధన వివాదంలోనూ ప్రతిపక్షాలు, ఉద్యమకారులు గడ్కరీ టార్గెట్‌గా వ్యూహాలు రచిస్తున్నారు.  . క్షేత్రస్థాయి అసంతృప్తికి తగిన పరిష్కారం చూపకపోతే, ఇది గడ్కరీకి మరియు మోదీ ప్రభుత్వానికి తీవ్రమైన రాజకీయ సంక్షోభాన్ని తెచ్చిపెట్టవచ్చు.

ప్రజలకు వాస్తలు తెలియచేయాలి!

ఈ వివాదాన్ని కేవలం  దుష్ప్రచారం, పెట్రోలియం లాబీ కుట్ర"గా కొట్టిపారేయడం ద్వారా ప్రభుత్వం ఈ నిరసనలను ఆపడం కష్టం. పాత వాహనదారులకు అవసరమైన సాంకేతిక మద్దతు ఇవ్వడం లేదా పెట్రోల్ బంకుల్లో ప్యూర్ పెట్రోల్, E10 ఆప్షన్లను సరసమైన ధరకు అందుబాటులో ఉంచడం వంటి సానుకూల చర్యలు తీసుకోవాలి. లేకపోతే, ఈ E20 వివాదం డిజిటల్ స్పేస్ నుండి నేరుగా వీధుల్లోకి చేరి పెద్ద రాజకీయ ఉద్యమంగా రూపంతరం చెందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేంద్రమే వేగంగా స్పందించాల్సి ఉంది.