South vs North India Delimitation:  భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం మళ్లీ తీవ్ర రాజకీయ వేడిని రాజేస్తోంది. దేశ జనాభా 1971లో 54 కోట్లుగా ఉన్నప్పుడు నిర్ధారించిన 543 లోక్‌సభ స్థానాలే.. నేడు జనాభా 140 కోట్లు దాటినా కొనసాగుతుండటంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 1976లో ఎమర్జెన్సీ కాలంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 2001 వరకు సీట్ల సంఖ్యను స్తంభింపజేయగా, తిరిగి 2002లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా 2026 వరకు   ఫ్రీజ్ చేశారు. అయితే, ఇప్పుడు లోక్‌సభ సీట్ల పెంపును మరో 25 ఏళ్ల పాటు వాయిదా వేయాలని కాంగ్రెస్ ప్రతిపాదించడం వెనుక రాజకీయ శక్తుల మధ్య ఉన్న ప్రయోజనాల యుద్ధం స్పష్టమవుతోంది.

Continues below advertisement

జనాభా పెరుగుల తేడాల వల్ల సమస్యలు

ఈ సీట్ల పెంపు ప్రతిపాదనలను నిలిపివేయడం , వాయిదా వేయాలని కోరడం వెనుక ఉన్న ప్రధాన సాంకేతిక, రాజకీయ కారణం  దక్షిణాది వర్సెస్ ఉత్తరాది  రాష్ట్రాల మధ్య ఉన్న జనాభా నిష్పత్తి తారతమ్యం. గత నాలుగైదు దశాబ్దాలుగా కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసి జనాభాను నియంత్రించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాలు.. జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్లు పెంచితే పార్లమెంట్‌లో తీవ్రంగా నష్టపోతాయని భయపడుతున్నాయి. జనాభా విస్ఫోటనం చెందిన ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు లోక్‌సభ సీట్ల సంఖ్య విపరీతంగా పెరిగి, దేశ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం, ప్రాధాన్యత తగ్గిపోతుందనేది ప్రధాన ఆందోళన. కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్లు పెంచితే, జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. కానీ అదే సమయంలో, 25 లక్షల మందికి ఒక ఎంపీ ఉండటం ప్రజాస్వామ్య ప్రాతినిధ్య సూత్రానికే విరుద్ధం.

Continues below advertisement

రిజర్వేషన్లు ఆ స్థాయిలో పెరగవా?  మరో కోణంలో చూస్తే, నియోజకవర్గాల సంఖ్య పెరగకపోవడం వల్ల ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు వర్గాలతో పాటు బీసీ, మహిళా ప్రాతినిధ్యం కూడా పరిమితమైపోతోందనే వాదన బలంగా ఉంది. కొత్తగా అమలులోకి రానున్న మహిళా రిజర్వేషన్ చట్టం  ప్రకారం పార్లమెంట్‌లో 33 శాతం స్థానాలు మహిళలకు కేటాయించాల్సి ఉంది. మొత్తం సీట్లు పెరగకుండా ఈ రిజర్వేషన్లు వర్తింపజేస్తే, ప్రస్తుతం ఉన్న జనరల్ స్థానాల్లో సగానికి పైగా కోత పడి తీవ్ర రాజకీయ అసంతృప్తికి దారితీస్తుంది. అందుకే నూతన పార్లమెంట్ భవనాన్ని కూడా భవిష్యత్తులో 888 మంది లోక్‌సభ సభ్యులు కూర్చునేలా కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. కాంగ్రెస్ వంటి విపక్షాలు ఈ పెంపును మరో 25 ఏళ్లు ఫ్రీజ్ చేయాలని కోరడం వెనుక ప్రత్యక్షంగా దక్షిణాది రాష్ట్రాల ఆకాంక్షలను కాపాడటం ఒకటైతే, పరోక్షంగా ఉత్తరాదిలో బలంగా ఉన్న బీజేపీ రాజకీయ ఆధిపత్యాన్ని అడ్డుకోవడమేననే విశ్లేషణలు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన స్థానాలు పెరిగితే హిందీ రాష్ట్రాల్లోనే లోనే మెజారిటీ మార్కు సులువుగా లభించే అవకాశం అధికార పార్టీకి దక్కుతుందనే భయం విపక్షాల్లో ఉంది. అందువల్లనే, సమాఖ్య స్ఫూర్తి దెబ్బతినకుండా ఉండే వరకు ఈ నిర్ణయాన్ని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

సమాన నిష్పత్తిలో పెంచుతామంటున్న కేంద్రం

అయితే,  ప్రస్తుతం ఉన్న నిష్పత్తిలోనే అన్ని రాష్ట్రాల్లో సీట్లు పెంచితే సమస్య ఏముంది  అనే ప్రశ్నకు రాజ్యాంగ నిపుణులు ఒక పరిష్కారం చూపుతున్నారు. జనాభాతో పాటు రాష్ట్రాల జిడిపి భాగస్వామ్యం, సామాజిక పురోగతి,  ప్రస్తుత సీట్ల నిష్పత్తిని ప్రామాణికంగా తీసుకుని పునర్విభజన చేపడితే ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని విశ్లేషిస్తున్నారు. జనాభా పెరిగిన కొద్దీ ప్రజాప్రతినిధికి-ప్రజలకు మధ్య దూరం పెరుగుతోందని, ఒక ఎంపీ ఇరవై ఐదు లక్షల మందికి ప్రాతినిధ్యం వహించడం వల్ల క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం కష్టమవుతోందని పేర్కొంటున్నారు.  1971 నాటి పాత లెక్కలతోనే ఇంకా కాలం వెళ్లదీయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం సీట్ల పెంపును మరో పాతికేళ్లు వాయిదా వేయడం కంటే, దక్షిణాది రాష్ట్రాల సీట్ల శాతాన్ని కాపాడుతూనే, పెరిగిన జనాభాకు తగినట్లుగా ఎంపీ స్థానాలను పెంచే సమగ్ర విధానాన్ని రూపొందించడమే కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాజకీయ పార్టీలు చేయాల్సిన అసలైన పని.