Southern route of Delimitation: నియోజకవర్గాల పునర్విభజన అంశం భారత రాజకీయాల్లో కీలక మలుపులకు కారణం అవుతోంది.  జనాభా నియంత్రణను పాటించి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలకు, ఈ ప్రక్రియ ఒక రాజకీయ శిక్షగా మారుతుందనే ఆందోళన గత దశాబ్దాలుగా నెలకొంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన  50 శాతం సీట్ల పెంపు  ఫార్ములాను విపక్షాలు తిరస్కరించడం, దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాధాన్యతను తమ చేతులతో తామే తగ్గించుకోవడమే అవుతుందనే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి.  జనాభా ప్రాతిపదికన పొంచి ఉన్న ప్రమాదం

Continues below advertisement

రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాలను పునర్విభజించాలి. అయితే, జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలు రాజకీయంగా నష్టపోకూడదనే ఉద్దేశంతో 1976 నుండి ఈ ప్రక్రియను స్తంభింపజేశారు. ఒకవేళ 2026 తర్వాత కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్ల కేటాయింపు జరిగితే, జనాభా విస్ఫోటనం సంభవించిన ఉత్తరాది రాష్ట్రాల బలం పార్లమెంట్‌లో అమాంతం పెరుగుతుంది. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల ఎంపీల సంఖ్య నిష్పత్తి పరంగా పడిపోయి, దేశ సమాఖ్య వ్యవస్థలో ఒక ప్రాంతంపై మరో ప్రాంతం ఆధిపత్యం చలాయించే ప్రమాదం ఏర్పడుతుంది.

50 శాతం పెంపు విన్-విన్  ఫార్ములా

Continues below advertisement

జనాభా హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా, లోక్‌సభలోని అన్ని రాష్ట్రాల సీట్లను సమానంగా 50 శాతం పెంచాలనే ప్రతిపాదనను కేంద్రం తీసుకు వచ్చింది.    ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 25 ఎంపీ సీట్లు 38కి పెరుగుతాయి. దీనివల్ల ఏ రాష్ట్రం తన ప్రస్తుత ప్రాధాన్యతను కోల్పోదు సరే కదా, పార్లమెంట్‌లో దక్షిణాది గొంతుక మరింత బలంగా వినిపించే అవకాశం ఉంటుంది. జనాభాను నియంత్రించినందుకు దక్షిణాదికి లభించే గౌరవప్రదమైన రాజీ మార్గంగా దీనిని పరిగణించవచ్చు.   విపక్షాలు ఈ వ్యూహాత్మక అంశాన్ని కేవలం రాజకీయ కోణంలో మాత్రమే చూస్తున్నాయి. మహిళా రిజర్వేషన్లతో దీనిని ముడిపెట్టి, సెంటిమెంట్లను రెచ్చగొట్టడం ద్వారా కేంద్రంపై పైచేయి సాధించాలని చూడటం వల్ల దక్షిణాదికే అసలైన నష్టం వాటిల్లుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ ఆచరణాత్మక పరిష్కారాన్ని వదులుకుంటే, భవిష్యత్తులో కొత్త జనాభా లెక్కల ఆధారంగా కేంద్రం కఠినమైన చట్టం తెస్తే అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు. రాజకీయం కోసం నేడు చేసే పోరాటం, రేపు దక్షిణాది రాష్ట్రాల శాశ్వత అస్తిత్వానికే గొడ్డలిపెట్టుగా మారే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

జీడీపీ వాదనలో అనేక  సమస్యలు

కేవలం జనాభాయే కాకుండా జీడీపీ  ప్రాతిపదికన అధిక వాటా కోరడంలోనూ కొన్ని చిక్కులు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల జీడీపీ మెరుగ్గా ఉన్నప్పటికీ, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ వంటివి ఇంకా ముందు వరుసలో ఉన్నాయి. కేవలం ఆర్థిక ప్రాతిపదికనే అత్యున్నత ప్రాధాన్యంగా కోరుకోవడం ఇతర రాష్ట్రాల్లో విద్వేషాన్ని పెంచే అవకాశం ఉంది. పునర్విభజన అనేది కేవలం భౌగోళిక సరిహద్దుల మార్పు కాదు, అది రాజకీయ అధికారం పంపిణీ. ప్రాంతీయ ప్రయోజనాల కంటే రాజకీయ స్వార్థమే మిన్న అని భావిస్తే, అభివృద్ధిలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా నిర్వీర్యం కావడం ఖాయం. దక్షిణాది రాష్ట్రాల నేతలు కేవలం భావోద్వేగాలకు లోనుకాకుండా వాస్తవ గణాంకాలను గమనించాలన్న అభిప్రాయం  నిపుణుల నుంచివస్తోంది.  50 శాతం ఫార్ములాను అంగీకరించడం వల్ల ప్రస్తుత ఎంపీల నిష్పత్తి మారదు, తద్వారా ఢిల్లీ పీఠం వద్ద దక్షిణాది పట్టు సడలదు. ఒకవేళ మొండి పట్టుదలతో ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తే, రాబోయే రోజుల్లో ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రధాన రాష్ట్రాలు మాత్రమే దేశ రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుంది. చంద్రబాబు నాయుడు హెచ్చరించినట్లుగా, లేనిపోని వివాదాలతో సముచితమైన ఫార్ములాను కాలదన్నుకుంటే భవిష్యత్తు తరాలు తీరని మూల్యం చెల్లించాల్సి వస్తుందని అంటున్నారు.