AP PCC Chief YS Sharmila: విజయవాడ : ఏపీలో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి. అధికార పార్టీ వైఎస్సార్ సీపీ (YSRCP) ఇదివరకే ఆరు ఇంఛార్జ్ ల జాబితాలను విడుదల చేసింది. కొన్నిచోట్ల అభ్యర్థులను మార్చగా, మరికొన్ని చోట్ల ఎంపీలకు ఎమ్మెల్యేలుగా, అసెంబ్లీ వెళ్లే వారిని లోక్‌సభకు పంపాలని జగన్ ప్లాన్ చేశారు. సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. టీడీపీ సైతం ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేసింది. వైఎస్ షర్మిల చేరికతో కాంగ్రెస్‌లో నూతనోత్సాహం కనిపిస్తోంది. అందులోనూ ఆమెకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించడం పార్టీ కేడర్ లోనూ జోష్ తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది.




కాంగ్రెస్ హైకమాండ్ నేడు ఏపీ ఎన్నికల కమిటీని ఆదివారం నాడు ప్రకటించింది. ఈ కమిటీకి పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చైర్ పర్సన్ గా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో సీనియర్ నేతలు రఘువీరారెడ్డి, టి.సుబ్బరామిరెడ్డి, పళ్లంరాజు, కేవీపీ రామచంద్రరావు, గిడుగు రుద్రరాజు, శైలజానాథ్, చింతా మోహన్, తులసి రెడ్డి, జేడీ శీలం సహా మొత్తం 20 మంది సీనియర్లకు చోటు దక్కింది. ఈ మేరకు ఏఐసీసీ నుంచి ఆదివారం నాడు ప్రకటన విడుదల చేశారు.


మరోవైపు ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో షర్మిల తీరక లేకుండా గడుపుతున్నారు. తెలంగాణలో నియంతను గద్దె దింపానని, ఇక ఏపీలోనూ నియంతను గద్దె దింపడమే తన ముందున్న లక్ష్యమని షర్మిల చెబుతున్నారు. తన సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ పై సంచలన ఆరోపణలు చేస్తూ షర్మిల దూసుకెళ్తున్నారు. ప్రత్యేక హోదా అంశం, విభజన చట్టం హామీలు.. లాంటి కీలక అంశాలను షర్మిల పదే పదే ప్రస్తావిస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యాక తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా అంశంపైనే చేస్తానని మాటిచ్చారని షర్మిల స్పష్టం చేశారు.