Chandrababu pawan put en end to rumours:  ఏపీలో గత కొన్ని రోజులుగా  పవన్ కళ్యాణ్ అలిగారని చంద్రబాబుకి కాస్త దూరంగా మెలుగుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. ముఖ్యంగా క్యాబినెట్ మీటింగ్కు కూడా రాకుండా పవన్ దూరంగా ఉండడంతో  ఈ ఊహలకి మరింత బలం చేకూరింది. అయితే విజయవాడలో జరిగిన  తమన్ మ్యూజికల్ నైట్ లో పవన్ కళ్యాణ్,చంద్రబాబు సరదాగా మాట్లాడుకుంటూ కనిపించి ఈ ఊహలకు చెక్ పెట్టారు.

 పవన్ నిజంగానే అలిగారా?

గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ టిడిపి వైఖరి పై అలిగారంటూ  ప్రత్యర్థులు సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వైరల్ చేస్తున్నారు. డానికి తగ్గట్టే తనకు ఒంట్లో బాలేదు అంటూ పవన్ కళ్యాణ్ అధికారక కార్యక్రమాలకు సైతం దూరంగా ఉన్నారు. 'జనంలోకి జనసేన ' లాంటి పార్టీ కార్యక్రమాలను కూడా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా జరిపించేసారు. ఈనెల 6న జరిగిన  క్యాబినెట్ బేటికి సైతం పవన్ హాజరు కాలేదు. దానితో పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు అంటూ  సీఎం చంద్రబాబు జనసేన కీలక నేత  నాదెండ్ల మనోహర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు అంటూ వార్తలు హల్చల్ చేశాయి. అయితే పవన్ కళ్యాణ్ అనారోగ్యం కారణంగానే అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు అనేది జనసేన వెర్షన్.

రూమర్స్ కు చెక్ పెట్టిన పవన్ 

కానీ ఇటీవల కాలంలో లోకేష్ కి ఉప ముఖ్యమంత్రి పదవి అంటూ టిడిపి శ్రేణులు వార్తలు వైరల్ చేసిన సందర్భంగా  టిడిపి హై కమాండ్ నుండి సరైన ఖండన రాలేదని పవన్ కళ్యాణ్ ఫీలయ్యారని.. క్షేత్రస్థాయిలో జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట సైతం టిడిపి నాయకులే  అధికారం చాలా ఇస్తున్నారు అని పవన్ కళ్యాణ్ నొచ్చుకున్నారంటూ ప్రత్యర్థి పార్టీలు కొత్త వాదన తెరమీదకు తెచ్చాయి. దానికి తగ్గట్టే పవన్ కళ్యాణ్ సైతం గత నాలుగు రోజులుగా దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శనకు కుమారుడు అకిరా నందన్ తో సహా వెళ్లొచ్చారు.  దానితో పవన్ కళ్యాణ్ కి అనారోగ్యంగా ఉంటే సౌత్ ఇండియా యాత్రకు ఎలా వెళ్లారంటూ మరో వాదన మొదలైంది. దానితో 'కూటమిలో ఏం జరుగుతుందీ' అంటూ జనంలో సైతం అనుమానాలు రావడం మొదలయ్యాయి. కాని వాటన్నిటికీ పవన్ కళ్యాణ్,చంద్రబాబు  శనివారం సాయంత్రం చెక్ పెట్టేసారు.

తమన్ మ్యూజికల్ షో లో బాబు -పవన్ చెట్టాపట్టాల్.!  

'తలసేమియా' బాధితులకు సహాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘యుఫోరియా’ పేరుతో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ విజయవాడలో మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహిస్తున్నారు.  ఈ కార్యక్రమంలో  ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు ,  ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ను ఎన్టీఆర్ ట్రస్ట్  మేనేజింగ్ ట్రస్టీ  నారా భువనేశ్వరి సాదరంగా స్వాగతించారు. ఆ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పక్క పక్కనే కూర్చుని ఉల్లాసంగా కనిపించారు. వారితో పాటే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రి నారా లోకేష్ కూడా ఒకే చోట సరదాగా మాట్లాడుకుంటూ  కనిపించడం రెండు పార్టీలు అభిమానుల్ని ఆహ్లాదపరిచింది. దానితో జనసేన టిడిపి మధ్య గ్యాప్ ఉందంటూ వినిపిస్తున్న వార్తలకు ప్రస్తుతానికి చెక్ పడినట్లు అయింది.