KTR Serious On CM Revanth Reddy: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అరాచక, దుర్మార్గమైన పాలన తీరును ప్రజలు గమనిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. భూములు ఇవ్వని పాపానికి దళిత, బలహీనవర్గాల రైతులను జైల్లో పెట్టారని.. వారిపై కేసులు పెట్టడమే కాకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను, సభను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. అలా చేస్తుందనే సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. సర్కారు అప్పులపై వాస్తవాలను సరి చూసుకుంటే ఇబ్బందేమీ లేదన్నారు. గతంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి నోటీసులిస్తే అప్పటి స్పీకర్ చర్చకు అనుమతిచ్చారని గుర్తు చేశారు.






'భూములివ్వకుంటే జైల్లో పెడతారా.?'


తమ భూములివ్వమన్న పాపానికి రైతులను జైల్లో పెట్టి హింసించారని కేటీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. 'ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశాం. ప్రభుత్వ కార్యక్రమాలకు కాంగ్రెస్ ఇంఛార్జీలను పిలుస్తున్నారు. మా ఎమ్మెల్యేలను పిలవడం లేదు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై ప్రత్యేక చర్చ జరపాలని స్పీకర్‌ను కోరాం. భూములివ్వకుంటే జైల్లో పెడతారా.?. అన్నదాతలపై థర్ట్ డిగ్రీ ప్రయోగించారు. రైతుల బాధలు సమస్యలు కావా.?. అక్కడి రైతులు ఇబ్బంది పడుతుంటే పర్యాటకంపై చర్చ అవసరమా.?. సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఒక్క పైసా తేలేదు. ప్రశ్నించిన వారిని జైలుకు పంపుతున్నారు. లగచర్ల ఘటనపై చర్చ పెట్టకుండా రేవంత్ పారిపోయారు. రాష్ట్రంలో ఉన్నది అరాచక ప్రభుత్వం. కొడంగల్ ప్రజల తరఫున బీఆర్ఎస్, కేసీఆర్ ఉన్నారు. రైతుల తరఫున మేం పోరాడతాం.' అని కేటీఆర్ తెలిపారు.






బీఆర్ఎస్ ఆందోళన


లగచర్ల రైతులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై అసెంబ్లీలో చర్చకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో శాసనసభను మంగళవారానికి వాయిదా వేశారు. దీంతో అసెంబ్లీ లోపలికి వెళ్లే దారిలో కూర్చుని ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. రైతులకు బేడీలు వేసి మంత్రులు జల్సాలు చేశారని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని.. లగచర్ల రైతులు అధైర్యపడొద్దని అన్నారు. ఫార్మాసిటీకి 14 వేల ఎకరాలను సేకరించి పెడితే కాంగ్రెస్ ప్రభుత్వమే వద్దందని తెలిపారు. రైతులకు రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


Also Read: Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు