Brs Mla Prakash Goud Clarity On Party Changing: రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ (Prakash Goud) పార్టీ మార్పుపై యూటర్న్ తీసుకున్నారు. తాను కాంగ్రెస్ లో చేరబోనని.. బీఆర్ఎస్ (BRS)లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆయన.. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని సీఎంతో చెప్పినట్లు ప్రచారం సాగింది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం, శనివారం ఉదయం పార్టీ కేడర్ తో సమావేశమైన ఆయన పార్టీ మార్పుపై స్పష్టత ఇచ్చారు. అయితే, పార్టీ మారితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని పలువురు నేతలు, కార్యకర్తలు ఆయనకు సూచించినట్లు తెలుస్తోంది. వారి అభిప్రాయం మేరకు కాంగ్రెస్ లో చేరే నిర్ణయాన్ని ఆయన విరమించుకున్నారు. కాగా, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల గురించి చర్చించినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే పార్టీ మార్పుపై ప్రచారం సాగింది. అయితే, తన కేడర్ తో సమావేశమైన అనంతరం ప్రకాష్ గౌడ్.. దీనిపై పూర్తి స్పష్టత ఇచ్చారు.


'ఆ ఉద్దేశం లేదు'


కేడర్ కు ఇష్టం లేని పని తాను ఎప్పటికీ చేయనని.. బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని ప్రకాశ్ గౌడ్ స్పష్టం చేశారు. 'బీఆర్ఎస్ లోనే ఉంటూ రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రజలకు సేవ చేస్తా. ఇక్కడి ప్రజలు ఆందోళన చెందొద్దు. ఎలాంటి సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురండి. అందరికీ న్యాయం చేస్తాను.' అని పేర్కొన్నారు.


Also Read: CM Revanth Reddy : ఎన్టీఆర్ డైలాగ్‌తో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి వార్నింగ్ - హైటెన్షన్ కరెంట్ వైర్‌తో పోల్చుకుని