BRS : భారత రాష్ట్ర సమితి మహారాష్ట్రలో వడివడిగా అడుగులు వేస్తోంది. పార్టీ విస్తరించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. కాందార్ లోహలో రెండో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరుకాబోతున్నారు. ఓ ప్రణాళిక ప్రకారం అక్కడ బీఆర్ఎస్‌ను విస్తరిస్తున్నారు. దీనికి సరిహద్దు ప్రాంతాల బీఆర్ఎస్ నేతలు మాత్రమే కాకుండా ... తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. చేరి ఊరుకోకుండా ఊళ్లల్లో తిరుగుతూ బీఆర్ఎస్‌ను బలోపేతం చేస్తున్నారు. అయితే ఈ ఊపు ఒక్క మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లోనే కనిపిస్తోంది. ఇతర పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, ఏపీతో పాటు ఒడిషాలోనూ కనిపించడం లేదు.
ముంగిటే ఎన్నికలున్నా కర్ణాటక వైపు దృష్టి సారించని కేసీఆర్ !
బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు తర్వాత తొలి టార్గెట్ కర్ణాటకేనని కేసీఆర్ ప్రకటించారు. ఎందుకంటే ఆ రాష్ట్రంలోనే మొదట ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.కానీ ఇప్పుడు కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ రేపో, మాపో రాబోతోంది.. ఎన్నికలు ముంచుకొస్తున్నా కనీసం కొంత మంది నేతల్ని చేర్చుకునే ప్రయత్నం చేయలేదు. దేవేగౌడ పార్టీ జేడీఎస్ తో పొత్తులు కన్ఫర్మ్ అయ్యాయని.. ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ తెలంగాణగా ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో ముఖ్యంగా తెలుగువారున్న చోట్ల బీఆర్ఎస్ పోటీ చేస్తుందని మిగతా చోట్ల జేడీఎస్‌కు మద్దతు ఇస్తుందని చెప్పుకున్నారు. మొదట్లో బీఆర్ఎస్ కార్యక్రమాలకు పిలిచినప్పుడల్లా వచ్చిన కుమారస్వామి తర్వాత ముఖం చాటేస్తున్నారు. జేడీఎస్ సపోర్టుగా కర్ణాటకలో అడుగుపెడదామనుకున్న బీఆర్ఎస్ చీఫ్ కు పరిస్థితులు కలిసి రావడం లేదన్న ప్రచారం జరుగుతోంది.
ఏపీ, ఒడిషాలపై ఎందుకు సైలంట్ ?
మహారష్ట్ర కంటే బీఆర్ఎస్ ఎక్కువగా ఏపీ ప్రజలకు పరిచయం. కానీ అక్కడ ఇంకా ఎలాంటికార్యకలాపాలు ప్రారంభించలేదు. కనీసం బహిరంగసభలు పెట్టే ప్రయత్నం చేయలేదు. ప్రధాన పార్టీల తరపున పోటీ చేసి మూడు సార్లు ఓడిపోయిన తోట చంద్రశేఖర్ ను తెచ్చి అధ్యక్షుడిగా నియమించినా అసలు ఆ పార్టీ ఉనికి కనిపించడం లేదు. ఎవరూ చేరడం లేదు. కనీసం కార్యకలాపాలు చేయడం లేదు. తోట చంద్రశేఖర్ కూడా తెలంగాణలోనే ఉంటున్నారు. ఒక ఒడిషా నుంచి కొంత మంది నేతల్ని చేర్చుకున్నారు కానీ.. వారేమీ చేస్తున్నారో ఎవరికీ తెలియదు. అక్కడ పార్టీ కార్యాలయాలను ప్రారంభించి భారీ బహిరంగసభలను ఏర్పాటు చేస్తామని చెప్పారు కానీ ఇంత వరకూ ఎలాంటి అప్ డేట్ లేదు. ఉద్దేశపూర్వకంగానే అక్కడ బీఆర్ఎస్ కార్యకలాపాలను ముమ్మరం చేయలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇలా ఎందుకు చేస్తున్నారో కానీ మహారాష్ట్ర ఒక్క దానిపైనే అదీ కూడా సరిహద్దు ప్రాంతాలపై గురి పెట్టడం మాత్రం వ్యూహమేనని అంచనా వేస్తున్నారు.
చుట్టుముట్టిన ఇతర సమస్యల వల్ల వేగం తగ్గించారా ?
భారత రాష్ట్ర సమితి విషయంలో కేసీఆర్ పూర్తి దృష్టి పెట్టలేకపోతున్నారు. అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కవితను చుట్టుముట్టడంతో ఈ విషయంపై ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. దీనికి తోడు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసు కూడా వెంటాడుతోంది. ఇవన్నీ సమన్వయం చేసుకుని జాతీయ రాజకీయాలపై అవసరమైన దృష్టి పెట్టడానికి కేసీఆర్‌కు సమయం సరిపోవడంలేదన్న అభిప్రాయం బీఆర్ఎస్ క్యాడర్‌లో వినిపిస్తోంది. అయితే ఎక్కడ బలం ఉందో గుర్తించి అక్కడజ సమయం కేటాయిస్తున్నారని దీని వల్ల మ్యాగ్జిమం ఫలితాలు వస్తాయని అంటున్నారు. మొత్తంగా కేసీఆర్ ఇప్పటికైతే బీఆర్ఎస్ విస్తరణ మహారాష్ట్రలోనే చేపడుతున్నారు.