How BJP is replacing the Communists:   కమ్యూనిస్టు కోటలుగా భావించే త్రిపుర, పశ్చిమ బెంగాల్, మరియు ప్రస్తుతం కేరళలో బీజేపీ అనూహ్యంగా బలపడటం భారత రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన పరిణామం. సిద్ధాంతపరంగా ఈ రెండు పార్టీలు ధ్రువాల వంటివైనప్పటికీ, కమ్యూనిస్టు కేడర్ , ఓటు బ్యాంక్ బీజేపీ వైపు మళ్ళడం వెనుక  బీజేపీ పదర్శిస్తున్న పక్కా  రాజకీయ మాయాజాలం ఉంది.  వీటికి ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులే కారణం. 

ప్రత్యామ్నాయ పార్టీగా మారుతున్న బీజేపీ 

 పశ్చిమ బెంగాల్ , త్రిపురలలో కమ్యూనిస్టుల పతనం తర్వాత, క్షేత్రస్థాయిలో ఉన్న కేడర్‌కు రక్షణ కరువైంది. ముఖ్యంగా బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్   దూకుడును తట్టుకోవడానికి, సీపీఎం బలహీనపడిన వేళ, తమను తాము కాపాడుకోవడానికి కమ్యూనిస్టు కార్యకర్తలు శక్తివంతమైన ప్రత్యామ్నాయంగా ఉన్న బీజేపీని ఆశ్రయించారు. ముందు ప్రాణం, తర్వాతే సిద్ధాంతం  అనే రీతిలో  లెఫ్ట్  నుంచి  రైట్ కు వలసలు సాగాయి. గతంలో ఎర్ర జెండా పట్టుకున్న వారే ఇప్పుడు కాషాయ జెండాను భుజానికెత్తుకోవడం వెనుక ఉన్న ప్రధాన కారణం అధికార పక్షం నుంచి ఎదురయ్యే దాడులను తట్టుకోగల ఏకైక శక్తి బీజేపీ అని వారు నమ్మడమే.

జాతీయవాదం , సంక్షేమం  సరికొత్త కలయిక

కమ్యూనిస్టులు ఎప్పుడూ వర్గ పోరాటం, అట్టడుగు వర్గాల  గురించి మాట్లాడతారు. బీజేపీ కూడా ప్రధాని మోదీ నాయకత్వంలో  పేదల సంక్షేమం  పేరుతో అదే వర్గాలను టార్గెట్ చేసింది. ఉచిత బియ్యం, గ్యాస్ కనెక్షన్లు, పక్కా ఇళ్లు వంటి పథకాలు కమ్యూనిస్టుల సంప్రదాయ ఓటు బ్యాంకైన పేదలు, కార్మికులను ఆకర్షించాయి. దీనికి తోడు సాంస్కృతిక జాతీయవాదం తోడవ్వడంతో, కమ్యూనిస్టుల అంతర్జాతీయవాదం కంటే సొంత దేశ భక్తి, భద్రత వైపు ప్రజలు మొగ్గు చూపారు. సిద్ధాంతం కంటే దైనందిన జీవితంలో మార్పును చూపడం బీజేపీకి కలిసొచ్చింది.

సంప్రదాయ ఓట్ల విచ్ఛిన్నం - కేరళ ఉదాహరణ 

కేరళలో ప్రస్తుతం సీపీఎం, కాంగ్రెస్  మధ్యే ప్రధాన పోటీ ఉన్నప్పటికీ, బీజేపీ ఓటు శాతం నిలకడగా పెరుగుతోంది. ముఖ్యంగా హిందూ సామాజిక వర్గాల్లో కమ్యూనిస్టులకు ఉన్న పట్టును బీజేపీ క్రమంగా విచ్ఛిన్నం చేస్తోంది. శబరిమల వంటి భావోద్వేగ అంశాలు, స్థానిక హిందూ ధర్మ రక్షణ వంటి నినాదాలతో కమ్యూనిస్టు అనుకూల హిందూ ఓటర్లను తనవైపు తిప్పుకోవడంలో బీజేపీ విజయవంతమైంది. త్రిపురలో చేసినట్టే, ఇక్కడ కూడా కమ్యూనిస్టుల సంప్రదాయ ఓటు బ్యాంక్ ను దెబ్బతీసి, తాను మూడవ ప్రత్యామ్నాయంగా కాకుండా ప్రధాన ప్రత్యర్థి గా ఎదగాలనేది బీజేపీ వ్యూహం.

ఆరెస్సెస్ పాత్ర కీలకం

బీజేపీ ఎదుగుదల వెనుక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్  క్షేత్రస్థాయి పనితీరు కీలక పాత్ర పోషిస్తోంది. కమ్యూనిస్టుల మాదిరిగానే బీజేపీ కూడా బలమైన కేడర్ బేస్డ్  పార్టీ. కమ్యూనిస్టు పార్టీలు గ్రామాల్లో ఏ విధంగా పట్టు సాధించాయో, అదే రీతిలో ఆరెస్సెస్ శాఖలు గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల ద్వారా చొచ్చుకుపోతున్నాయి. కమ్యూనిస్టు నేతలు ప్రజలకు దూరమైన చోట, ఈ శూన్యాన్ని బీజేపీ భర్తీ చేస్తోంది. త్రిపురలో 25 ఏళ్ల పాలనను ఒక్కసారిగా కూల్చడం వెనుక ఈ పక్కా ప్రణాళికే ఉంది. అదే పంధాలో కమ్యూనిస్టుల్ని బలహీనం చేసి తాము బలపడుతున్నారు.