BJP MLA Raghunandan Rao: తన తండ్రి, తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినం రోజున కవిత తిరుపతికి వెళ్లారని, అయితే తనకు తెలియదని చెప్పిన అభిషేక్‌రావు, రామచంద్ర పిళ్లై, సృజన్ రెడ్డిలతో కలిసి వెంకన్న దర్శనానికి ఎలా వెళ్లారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఇంగ్లీష్ దినపత్రికలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి వచ్చిన వార్త ఫొటోను నాంపల్లిలోని బీజేపీ ఆఫీసు (BJP State Office, Nampally) ) వద్ద మీడియాకు చూపించారు. ఆ ఫొటోలో ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. మా సోదరి కవిత తిరుపతిలో ఈ ఏడాది ఫొటో దిగారు. కల్వకుంట్ల కవిత తన కుటుంబంతో పాటు ఆ ఫొటోలో ఉన్న వ్యక్తుల పేర్లు అభిషేక్ రావు, రామచంద్ర పిళ్లై, సృజన్ రెడ్డి అని చెప్పారు. ఈ వ్యక్తులు నిజంగానే మీకు తెలియకపోతే ఈ ఫొటో చూసి అయినా సమాధానం చెప్పాలని చెల్లె అంటూ కవితను ప్రశ్నించారు.


కవితపై వ్యక్తిగత కోపం లేదు
ఈడీ హైదరాబాద్‌లో జరిపిన దాడులతో కవితకు సంబంధించి ఒక ఫొటో బయటకు వచ్చిందని, ఆ ఫొటోలో మద్యం సిండికేట్ సూత్రధారి రామచంద్ర పిళ్లైతో పాటు అభిషేక్ రావు కూడా ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. కేవలం వార్తల్లో వచ్చిన ఫొటోను మాత్రమే తాను చూపించానని, కవితపై తనకు ఎలాంటి వ్యక్తిగత కోపం లేదన్నారు. బీజేపీ ఎంపీలు, నేతలు అబద్ధాలు ఆడుతున్నారని కవిత, టీఆర్ఎస్ నేతలు అన్నారు. అయితే చెల్లె కవిత.. ఈ ఫొటో విషయంపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్‌కు, తనకు ఏ సంబంధం లేదని, ఆ వ్యక్తులను తానెప్పుడూ కలవలేదని చెప్పిన కవిత వెంకన్న సన్నిధిలో కలిసి ఫొటో ఎలా దిగావు చెప్పు చెల్లే అంటూ ఎమ్మెల్సీ కవితను సూటిగా ప్రశ్నించారు.


విజయసాయిరెడ్డి అల్లుడు.. 
లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, అడికోర్ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నారు సృజన్ రెడ్డి. అటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీ కవిత కలిశారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అల్లుడు సృజన్ రెడ్డి అని తెలిపారు. కంపెనీల పేర్లను పత్రికలో స్పష్టంగా ఇచ్చారని, వారు ఏ కంపెనీలకు డైరెక్టర్లుగా ఉన్నారో తేలిపోయిందన్నారు. బీజేపీ నుంచి కేవలం రాజా సింగ్ మాత్రమే నెగ్గారని, ఇప్పుడు మా బలం 3కు చేరిందన్నారు. కానీ శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిబంధనల్ని ఎప్పడు మార్చారో చెప్పాలని కోరారు. పుస్తకం మీ దగ్గర ఉంది, ఎంత మంది సభ్యులు ఉంటే ఓ పార్టీని బీఏసీకి పిలవాలో చెప్పాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, తప్పు చేసే వారిని ప్రశ్నించాలని వారికి పిలుపునిచ్చారు.


తెలంగాణలో హీట్ పంచుతోన్న లిక్కర్ స్కామ్.. 
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్తంగా మంగళవారం 30 చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ స్కామ్‌తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో హైదరాబాద్‌ లో కొన్నిచోట్ల ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అరుణ్ రామచంద్రన్ పిళ్లై, అభిషేక్‌రావు, సృజన్ రెడ్డి, గండ్ర ప్రేమ్‌సాగర్ నివాసాలు, ఆఫీసులలో సోదాలు జరిగాయి. ఇదే విషయమై తనపై ఆరోపణలు రావడంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఏ విచారణకైనా సిద్ధమైనా తనకు ఆ వ్యక్తులతో సైతం సంబంధం లేదన్నారు. ఈ విషయంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందిస్తూ ఎమ్మెల్సీ కవితకు కొన్ని ప్రశ్నాస్త్రాలు సంధించారు. 


Also Read: Raghunandan Rao: సభలో కుర్చీలు వెతుక్కునేలోపే అసెంబ్లీ వాయిదా పడింది - MLA రఘునందన్ రావు