BJP leader Adinarayana: ఉమ్మడి అనంతపురం జిల్లాలో  ముదిగుబ్బ ఎంపీపీగా ఉన్న ఆదినారాయణ యాదవ్ అనే బీజేపీ నేత కూటమిలో కలకలం రేపుతున్నారు. ఆయన కబ్జాలు, దాడులు, దందాలతో చెడ్డపేరు వస్తోందని అంటున్నారు. ఆదినారాయణపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. 


గిరిజనుల భూముల్ని కబ్జా చేసిన ఆదినారాయణ 


ముదిగుబ్బ మండలంలో అడవి బ్రాహ్మణపల్లె గ్రామంలో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల్ని ఆదినారాయణ యాదవ్ కబ్జా చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఆన్ లైన్ లో ఆయన పేరు మీదుగా భూములు మారిపోయాయి. దీంతో గిరిజనులు ఆందోళన చేస్తున్నారు. ఆదినారాయణపై చర్యలు తీసుకుని గిరిజనులకు న్యాయం చేయాలని పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ  ముదిగుబ్బ మండలంలో జరిగిన గిరిజన భూముల అక్రమాలపై తీవ్రంగా స్పందించారు. ఆదినారాయణ తప్పుడు పత్రాలు సృష్టించి, రెవెన్యూ రికార్డుల్లో తమ కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసి, సుమారు 100 ఎకరాల గిరిజన భూములను స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. ఈ రోజు సిపిఐ నేతలు నేరుగా ఆ గ్రామాల్లోని బాధిత రైతు కుటుంబాలను పరామర్శించి, ఆక్రమించబడిన భూములను పరిశీలించారు.  ఇలాంటి రౌడీలు, కబ్జాలు చేసే నాయకులను రాజకీయాలకు దూరంగా ఉంచాలని, తన అనుచరుడు ఆదినారాయణ నుంచి దళిత, గిరిజన భూములను తిరిగి వారికి అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని  ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. 


ఆదినారాయణపై అనేక ఆరోపణలు 


ఆదినారాయణపై చాలా కేసులు ఉన్నాయి.   కొద్ది రోజుల కిందట అదానీ కంపెనీ అన్నమయ్య జిల్లాలో చేపట్టిన ఓ ప్రాజెక్టు వద్ద కమిషన్లు ఇవ్వలేదని కొంత మంది వ్యక్తులు దాడి చేశారు. అదానీ సంస్థల పైనే దాడులు చేసింది ఆదినారాయణలేనని చెబుతున్నారు.   2022లో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను సూరప నేని రమేశ్ చౌదరి ని కిడ్నాప్ చేసి, డబ్బులు వసూలు చేసిన కేసులో నిందితుడుగా ఉన్నారు. నకిలీ తుపాకులతో ప్రైవేటు సైన్యాన్ని తీసుకెళ్లి బెదిరించి స్థలాలు కబ్జాలు చేసిన కేసులు కూడా ఉన్నాయి. ఇటీవల   పెనుకొండలో నమోదైన కబ్జా కేసులో నిందితుడుగాఉన్నారు.  


ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి !


ముదిగుబ్బ మండలానికి ఎంపీపీగా ఉన్న ఆయన ఆ పదవి మండల స్థాయిదే అయినా దాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్న దందాలు అన్నీ ఇన్నీ కావు. ఆదినారాయణ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేత. మొదటగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉండేది. టీడీపీ అధికారంలోకి వచ్చాక మంత్రిగా ఉన్న పల్లె రఘునాథ రెడ్డి దగ్గర చేరారు. ఆయన మందీ మార్భలం చూసి  పార్టీలో చేర్చుకుని ప్రోత్సహం ఇచ్చారు. టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో అధికారంలోకి వచ్చిన వైసీపీలో చేరారు. అక్కడ ఆయన చేసిన దందాలకు లెక్కలేదు. ఎన్నికలు దగ్గర పడిన తర్వాత కూటమి గెలుపు ఖాయమని అంచనాకు వచ్చి బీజేపీలో చేరిపోయారు. ఆయన గురించి తెలుసోఇ తెలియదో కానీ బీజేపీ పెద్దలు చేర్చుకున్నారు.  ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇక ఆదినారాయణ దందాలకు అడ్డం లేకుండా పోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


మంత్రి సత్యకుమార్ స్పందించాలని సీపీఐ రామకృష్ణ డిమాండ్ 


భూములను పరిశీలించి బాధితులతో మాట్లాడిన సీపీఐ నేత రామకృష్ణ ఏపీ  ప్రభుత్వంలో ఏకైక మంత్రిగా సత్యకుమార్ ఉన్నారు..ఆయన స్పందించాలని డిమాండ్ చేశారు.  మంత్రిగా ఉండి బీజేపీ వాళ్లు బడుగు,బలహీన వర్గాలు..భూముులు కబ్జా చేసి మోసం, దగా చేస్తూ ఉంటే ఈ పాటికి స్పందించాల్సి ఉంది. ఇంత వరకూ ఆ మంత్రిగారు స్పందించలేదు. స్థానిక మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కూడా అయిన సత్యకుమార్ యాదవ్ కూడా దీనిపై స్పందించాలన్నారు. . పేదలు, దళితులు, గిరిజనులకు అండగా నిలబడాలి. సత్యసాయి జిల్లా ఇంచార్జ్ మంత్రి.. అనగాని సత్యప్రసాద్.. ఆయన రెవిన్యూ మంత్రి కూడా .. ఆయన బాధ్యతలు తీసుకున్న దగ్గరే ఇలాంటివి జరిగాయంటే యుద్ధ ప్రతిపదికపైనా స్పందించాల్సి ఉంది. యాక్షన్ తీసుకోవాలి. దీన్ని రాష్ట్ర స్థాయి ఉద్యమంగా తీసుకుపోతామని హెచ్చరించారు.  


 బీజేపీపెద్దలు తెలుసని బ్లాక్ మెయింగ్ చేసి దందాలుచేస్తారని ఆరోపణలు


రాష్ట్ర బీజేపీ ముఖ్యులంతా తనకు తెలుసని చెప్పి చెలరేగిపోవడం ప్రారంభించారు. ఆది నారాయణపై ఇటీవలి కాలంలో వరుసగా కేసులు నమోదవుతున్నాయి.   తాను బీజేపీ మంత్రికి అనుచరుడినని. తాను ఏం చేసినా.. పోలీసులు, అధికారులు తన జోలికి  రారని బెదిరిస్తున్నట్లుగా ఓఆరోపణలు ఉన్నాయి.  అధికారంలో ఉన్న పార్టీలో చేరి.. ఆ పార్టీ పేరును ఉపయోగించుకుని నేరాలకు పాల్పడే ఇలాంటి వారిని ఏ మాత్రం సహించినా అది మొత్తం పార్టీనే దెబ్బతీస్తుందని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదినారాయణను పార్టీ నుంచి సాగనంపాలని అగ్రనేతలు ఎవరూ ప్రోత్సహించకూడదని అంటున్నారు.