TDP BJP alliance : ఏపీలో పొత్తుల అంశం కొలిక్కి వస్తోంది. 2014 కూటమి మళ్లీ తెరపైకి వస్తోంది. చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్లడంతో ఈ అంశంపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత రానుంది. మొత్తంగా ఆరు లోక్ సభ స్థానాలతో పాటు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకూ అసెంబ్లీ స్థానాలను బీజేపీ ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. వీటిపై ఢిల్లీలో జరిగే చర్చల్లో ఫైనల్ అయ్యే అవకాశం ఉంది.
ఆరు లోక్‌సభ స్థానాలపై క్లారిటీ వచ్చినట్లేనా ?
బీజేపీ పూర్తిగా కసరత్తు చేసిన తర్వాతనే ఆరు లోక్ సభ సీట్లను అడిగినట్లుగా తెలుస్తోంది. ఒంగోలు, రాజమండ్రి, విజయవాడ, రాజంపేట, వైజాగ్, తిరుపతి లోక్ సభ స్థానాలను బీజేపీ కోరుతోంది. అన్ని చోట్లా బలమైన అభ్యర్థులు ఉన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఒంగోలు నుంచి పోటీ చేయడానికి బీజేపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. ఇక రాజమండ్రి నుంచి సోము వీర్రాజు, రాజంపేట నుంచి సత్యకుమార్ యాదవ్, వైజాగ్ నుంచి జీవీఎల్ నరసింహారావు, తిరుపతి రిజర్వుడు నియోజకవర్గం నుంచి రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారి ఒకరు పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక కీలకమైన విజయవాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి బరిలో దిగడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు.
హిందూపురం పార్లమెంట్ స్థానం కోసం కూడా బీజేపీ ప్రయత్నం
వీటిలో ఏ స్థానంపైనైనా మీమాంస ఏర్పడితే.. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం కోసం బీజేపీ పట్టుబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అక్కడ ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇక అసెంబ్లీ సీట్ల విషయంలో ఇరవై నుంచి ఇరవై స్థానాల కోసం బీజేపీ పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. ఏ ఏ ఏ స్థానాలు అన్న అంశంపై ఇంకా క్లారిటీ లేదు. కానీ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున కేటాయించాలన్న డిమాండ్ ఉంది. పార్టీ బలంగా ఉన్న చోట బీజేపీ నాయకులు తమకు కేటాయించేలా గట్టిగా పట్టుబట్టే అవకాశం ఉంది.
20 నుంచి 25 అసెంబ్లీ స్థానాల కోసం బీజేపీ ప్రయత్నం
పొత్తుల అంశంపై ఇప్పటికే అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో బీజేపీ గెలిచిన స్థానాలు, గట్టి పోటీ ఇచ్చిన స్థానాలను దగ్గర పెట్టుకుని గెలుపు అవకాశాలపై విస్తృతంగా మేథోమథనం చేసిన తర్వాతనే బీజేపీ టిక్కెట్లను కేటాయింపుపై పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. పట్టుబట్టి సీట్లు తీసుకుని ఓడిపోయామన్న పేరు కూడా బీజేపీకి అక్కర్లేదని గెలిచే సీట్లను మాత్రమే కేటాయించాలని అటున్నట్లుగాచెబుతున్నారు. మొత్తంగా ఏ ఏ అసెంబ్లీ సీట్లను కేటాయిస్తారన్నదానిపై మాత్రం.. రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.