Biggest challenge for BRS in 2026: తెలంగాణ రాజకీయాల్లో 2026 సంవత్సరం సరికొత్త సమీకరణాలకు వేదిక కాబోతోంది. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ లేదా బీజేపీ కంటే కూడా సొంత ఇంటి నుంచే వచ్చే ముప్పు అతి పెద్ద సవాల్‌గా మారే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టడం ఖాయమయింది.  

Continues below advertisement

వెనక్కి తగ్గేది లేదంటూ పోరాటం చేస్తున్న కవిత 

తెలంగాణ ఉద్యమ కాలం నుండి తెలంగాణ జాగృతి ద్వారా సాంస్కృతిక సారథిగా కవితకు ప్రత్యేక గుర్తింపు ఉంది. బీఆర్ఎస్ పార్టీలో మహిళా గళంగా ఆమె కీలకంగా వ్యవహరించారు. కారణాలు ఏమైనా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆమె జాగృతి పేరుతో రాజకీయం  చేస్తున్నారు. కానీ ఇంకా రాజకీయ పార్టీగా ప్రకటించలేదు.  కొత్త ఏడాదిలో ఆమె సొంతంగా పార్టీని ప్రకటించి, మరింతగా క్షేత్రస్థాయిలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. అది బీఆర్ఎస్‌కు పరోక్షంగా పెనుగండంగా మారుతుంది. ఇది కేవలం రాజకీయ చీలిక మాత్రమే కాదు, కేసీఆర్ స్థాపించిన పార్టీకి నైతిక , సెంటిమెంట్ పరమైన దెబ్బగా పరిణమించే ప్రమాదం ఉంది. నాలుగైదు ఓట్ల శాతంతో బీఆర్ఎస్‌కు తీవ్ర నష్టం

Continues below advertisement

రాజకీయాల్లో 1 లేదా 2 శాతం ఓట్ల వ్యత్యాసమే అధికార మార్పిడికి కారణమవుతుంది. గత ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే బీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్య ఓట్ల శాతం తేడా చాలా స్వల్పంగా ఉంది. కవిత కొత్త పార్టీ పెట్టి, రాష్ట్రవ్యాప్తంగా కనీసం  *4 నుండి 5 శాతం ఓట్లను  చీల్చగలిగితే, అది నేరుగా బీఆర్ఎస్ గెలిచే స్థానాలపై ప్రభావం చూపుతుంది. బీఆర్ఎస్ సంప్రదాయ ఓటు బ్యాంకులో మహిళలు, సాంస్కృతిక సంఘాలు కీలక పాత్ర పోషిస్తారు.  కవితా తన బలాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తే, ఆ ఓట్లు చీలిపోయి అల్టిమేట్‌గా కాంగ్రెస్ లేదా బీజేపీకి లబ్ధి చేకూరుతుంది. 

 నేతల వలసలు, క్యాడర్ అయోమయం 

కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తే, బీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు ఆమె వైపు చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆమెకు ఉన్న పట్టు పార్టీకి నష్టం కలిగించవచ్చు. క్యాడర్ ఎవరి వైపు ఉండాలో తెలియక అయోమయానికి గురైతే, పార్టీ క్షేత్రస్థాయిలో బలహీనపడుతుంది. కేసీఆర్ ఇమేజ్‌ను నమ్ముకున్న కార్యకర్తలు, కుటుంబంలోనే చీలిక వస్తే మానసికంగా కుంగిపోయే ప్రమాదం ఉంది.

 బీఆర్ఎస్ ముందున్న ఏకైక మార్గం 

కవితను తమ దారిలోకి తెచ్చుకోకపోతే లేదా ఆమెను పార్టీలో సముచిత స్థానంతో సంతృప్తి పరచకపోతే బీఆర్ఎస్ మనుగడకు  పెద్ద సమస్యగా మారుతుంది. పార్టీకి విఘాతం కలగకుండా ఉండాలంటే కుటుంబ సమన్వయం కంటే కూడా రాజకీయ సమన్వయం అత్యవసరం. ఆమెను దూరం పెట్టడం వల్ల వచ్చే నష్టం కంటే, ఆమెతో కలిసి ప్రయాణించడం వల్ల కలిగే లాభాలను పార్టీ అధిష్టానం బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. 2026లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను వాడుకుని పుంజుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్‌కు, ఈ అంతర్గత సంక్షోభం అడ్డంకిగా మారవచ్చు. కవితా ఫ్యాక్టర్ కేవలం ఓట్ల చీలికకే పరిమితం కాకుండా, పార్టీ భవిష్యత్తును నిర్ణయించే స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. కొత్త ఏడాదిలో కేసీఆర్ ఈ చిక్కుముడిని ఎలా విప్పుతారో వేచి చూడాల్సి ఉంది.