BRS Vs Governer : తెలంగాణ ప్రభుత్వ తీరుపై కేంద్రానికి నివేదిక పంపించానని గవర్నర్ తమిళిసై ప్రకటించారు. ఆ నివేదికలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని ఆ నివేదికలో చెప్పినట్లుగా కూడా మీడియాకు వెల్లడించారు గవర్నర్. ఇప్పుడా నివేదికపై కేంద్రం ఎలా స్పందించబోతోంది ? రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందా ? అనే దానిపై రాజకీయవర్గాలు విస్తృత చర్చలు జరుపుతున్నాయి. 


గవర్నర్ వ్యూహాత్మకంగా రెచ్చగొడుతున్నారా ? 


ప్రజా ప్రభుత్వం పట్ల గవర్నర్ వ్యవహరిస్తున్న తీరుపై రాజకీయ పార్టీల్లో అభ్యంతరాలు ఉన్నాయి. గవర్నర్ కు లేని అధికారాల్ని చెలాయించే ప్రయత్నం చేస్తున్నారని   ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారన్న విమర్శలు అన్ని వైపుల నుచి వస్తున్నాయి. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు ఇప్పటికీ  రాజ్ భవన్ లో ఉన్నాయి. వాటిపై అభ్యంతరాలు ఉంటే తిరస్కరించాలి అంతే కానీ దగ్గర పెట్టుకోకూడదని కొంత మంది వాదిస్తున్నారు.  ఇలా చేయడం వల్ల ఆ చట్టాలు చేయాలనుకున్న ప్రభుత్వం చేతులు కట్టేసినట్లయిందంటున్నారు.  పట్టించుకుంటేనా ఇదొక్కటే కాదు ప్రతీ విషయంలోనూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు పదే పదే చెబుతున్నారు. 


రిపబ్లిక్ డే వేడుకలు జరపకపోవడం వ్యూహాత్మక తప్పిదమేనా ? 
 
రిపబ్లిక్ డేను తెలంగాణ ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదన్నది చాలా మందికి పజిల్ గా మారింది.  నిజానికి కేసీఆర్ తమిళిసై వేదిక పంచుకోనంత శత్రుత్వాన్ని పెంచుకోలేదు. ఇటీవల రాష్ట్రపతి తెలంగాణకు వస్తే ఆమెతో కలిసి స్వాగత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతకు ముందు హైకోర్టు సీజే ప్రమాణ స్వికారానికి రాజ్ భవన్ కు వెళ్లారు. ఏ విభేదాలు లేనట్లుగా మాట్లాడారు. ఇప్పుడు రిపబ్లిక్ డే కూడా దేశానికి సంబంధించిన అంశం కాబట్టి అలాగే వ్యవహరించి ఉంటే వివాదం ఉండేది కాదు. రాజకీయ సంచలనం అయ్యేది కాదు. కానీ కేసీఆర్ రిపబ్లిక్ డే వేడుకల్ని నిర్వహించడానికి ఇష్టపడలేదు. దీనికి కారణం గవర్నర్ ప్రసంగమేనని భావిస్తున్నారు. రాజకీయ ఎజెండాతో పని చే్తున్న గవర్నర్ తాము ఇచ్చిన ప్రసంగం చదవరన్న ఆలోచనతోనే తమ ప్రభుత్వం కార్యక్రమం లో తమ ప్రభుత్వాన్ని గవర్నర్ తో విమర్శింపచేసుకున్నట్లవుతున్న కారణంగా నిర్వహించడానికి వెనుకాడినట్లుగా కనిపిస్తోంది. బీజేపీ టార్గెట్ పెట్టుకున్న రాష్ట్రాల్లో అదే జరుగుతోంది. రాజ్ భవన్ లో  సీస్, డీజీపీల సమక్షంలో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో తమిళిసై ప్రభుత్వం విమర్శలు కూడా చేశారు. సీఎం హాజరై ఉంటే ప్రభుత్వమే ఇబ్బంది  పడేదని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. 


ఈ అంశాలనే బీజేపీ దేశవ్యాప్తంగా హైలెట్ చేసే చాన్స్ !  


గవర్నర్ తమిళిసై రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న ఉద్దేశంతో ప్రోటోకాల్ ఇవ్వడం లేదు తెలంగాణ ప్రభుత్వం.  తమిళిసై ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోంది. ఆమెను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. టిట్ ఫర్ టాట్ అనే అభిప్రాయం ఎక్కువ మందికి వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అలా చేయకుండా ఆమెకు రాజ్యాంగం ప్రకారం దక్కాల్సిన ప్రోటోకాల్ ఇచ్చి ఉంటే ఒక్క గవర్నర్ వ్యవహారశైలి మాత్రమే హైలెట్ అయ్యేది. కానీ ఇక్కడ ప్రభుత్వం గవర్నర్ పట్ల వ్యవహరిస్తున్న విధానం కూడా చర్చనీయాంశం అవుతోంది. కేంద్రం ఇప్పుడు గవర్నర్ నివేదిక ఆధారంగా కీలక నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఇవన్నీ చర్చల్లోకి వస్తాయని రాజకీయవర్గాలుచెబుతున్నాయి. 


ఎన్నికల షెడ్యూల్ వచ్చాక రాష్ట్రపతి పాలన విధించే వ్యూహం ఉందా ? 


అయితే రాష్ట్రాల్లో రాష్ట్రపతిపాలన విధించడం అంత సులువు కాదు.  కానీ కేసీఆర్ ముందస్తుకు వెళ్లాలనుకున్నా లేకపోతే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరవాతైనా రాష్ట్రపతి పాలన విధించవచ్చు. అందుకు గవర్నర్ నివేదిక .. ఇప్పుడు జరిగిన పరిణామాలు అవకాశాలు కల్పిస్తాయి.  ఇలా చేయడం కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఇబ్బందికరం అవుతుంది. బహుశా ఆ ప్లాన్ కోసమే గవర్నర్ తో ఇలా రచ్చ చేయిస్తున్నారేమో కానీ ఇదే నిజం అయితే బీఆర్ఎస్ బీజేపీ ట్రాప్ లో పడినట్లే అనుకోవచ్చని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.