Telugu Desam Party : ఏపీలో తెలుగుదేశం దూకుడు పెంచుతోంది. అసెంబ్లీ సాక్షిగా స‌వాల్ చేసి వ‌చ్చిన చంద్రబాబు ఇక‌పై రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రజ‌ల్లోకి వెళ్లాల‌ని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మ‌హానాడు వేదిక‌గా తెలుగు త‌మ్ముళ్లలో జోష్ నింపేందుకు ప్రణాళిక‌లు రెడీ చేస్తున్నారు. మహానాడు వేదిక‌గా చేసుకొని అటు పార్టీ క్యాడ‌ర్ కు దిశనిర్దేశం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో అంది వచ్చే ప్రతి అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌టం ద్వారా అధికారమే టార్గెట్ గా ప‌నిచేయాల‌ని నిర్ణయించింది. మ‌హానాడు వేదిక‌గా చేసుకొని పార్టీ నాయ‌కులు, కార్యక‌ర్తలు మ‌రింత దూకుడు పెంచే దిశ‌గా చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. ఇక పార్టీ వ్యవ‌స్థాప‌క అధ్యక్షుడు ఎన్టీఆర్ శ‌తజ‌యంతి వేడుక‌ల‌ను ప్రారంభం అవటంతో పార్టీ క్యాడ‌ర్, కార్యక‌ర్తలు వీటిని స‌మ‌న్వయం చేసుకొని, నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో ఇంఛార్జ్ లు ప‌నిచేయాల‌ని కూడా సంకేతాలు ఇచ్చారు. 


డిజిటల్ అడుగులు 


వచ్చే సార్వత్రిక ఎన్నిక‌ల్లో తాడోపేడో తేల్చుకోవాలని పార్టీ కేడర్ కు ఇప్పటికే సంకేతాలు అందినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ వేదిక‌గా చంద్రబాబు చేసిన స‌వాల్ నేపథ్యంలో 2024లో అధికారంలోకి రావ‌టం టీడీపీ  లక్ష్యంగా పెట్టుకుంది. టీడీపీ నిర్వహిస్తున్న మ‌హానాడు ఒక ఎత్తయితే, పోటీగా వైసీపీ నాయ‌కులు బ‌స్సు యాత్ర నిర్వహిస్తున్నారు. దీంతో టీడీపీ నిర్వహించే మ‌హానాడుకు టీవీ ఛాన‌ల్స్ లో క‌వ‌రేజి కాస్త ఇబ్బందిగా మారింది. ఇక డిజిట‌ల్ వైపు వెళ్లాల‌ని టీడీపీ నిర్ణయానికి వ‌చ్చింది. ఈ క్రమంలోనే ప్రతి మ‌నిషికి ఇప్పుడు సెల్ ఫోన్ కీల‌కంగా మారిన నేప‌థ్యంలో పార్టీ కార్యక్రమాలు భ‌విష్యత్ కార్యచర‌ణ అనేది ఇక పై డిజిటల్ రూపంలోనే ఉండాల‌న్నది టీడీపీ వ్యూహంగా మారింది. ఈ దిశ‌గానే టీడీపీ మ‌హానాడుకు వ‌చ్చిన నాయ‌కులు, కార్యక‌ర్తల‌కు అగ్ర నాయ‌క‌త్వం ఇలాంటి స‌ల‌హాలు సూచ‌న‌లే ఇస్తుంది. భ‌విష్యత్ లో టీడీపీ వ్యూహలు ఇంకా ఎలాంటి మార్పులు ఉంటాయి. ఎత్తుగ‌డ‌ల‌కు ఎలాంటి ప‌దును పెడుతుంద‌న్నది కాల‌మే నిర్ణయించాల్సి ఉంది. 


పార్టీలో నూతనోత్సాహం


తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతోంది. ముఖ్యంగా యువతకు టీడీపీ నుంచి పిలుపొచ్చింది. పార్టీలో సీనియర్లను పక్కనపెట్టి, దాదాపు 40 శాతం వరకు యువతకు టికెట్లు ఇచ్చి అసెంబ్లీ బరిలోకి దించాలన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిర్ణయాన్ని సీనియర్ నేతలు ప్రశంసిస్తున్నారు. మరోవైపు వరుసగా మూడు పర్యాయాలు ఎన్నికల్లో ఓడిపోయిన నేతలకు సైతం టీడీపీ టికెట్ ఇచ్చేది లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు లోకేశ్. పార్టీలో పదవులు రెండు సార్లు దక్కుతాయని, యువతకు అవకాశం ఇస్తూ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని లోకేశ్ మహానాడులో స్పష్టం చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో నేతలు యాక్టివ్ గా లేరని, అలాంటి నేతలకు ఇంఛార్జ్ పదవులు ఉండవని, ఒకవేళ అధికారంలోకి వస్తే మంత్రులు పార్టీకి తమ ప్రొగ్రెస్ రిపోర్ట్ చేసేలా చర్యలు తీసుకుంటామన్న వ్యాఖ్యలను పార్టీ సీనియర్ నేతలు బోండా ఉమామహేశ్వరరావు, ప‌ల్లె ర‌ఘునాథ్ రెడ్డి, నిమ్మకాయల చిన రాజ‌ప్ప సమర్థించారు.