Dharmana Prasada Rao Comments On Volunteers: వాలంటీర్లను (volunteer )అడ్డంపెట్టుకుని ఈ సారి ఎన్నికలు నిర్వహించేందుకు వైసీపీ(YCP) ప్రయత్నిస్తోందని ప్రతిపక్షపార్టీల ఆరోపణలు నిజం అన్నట్టు నేతల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలని సీఎం జగన్ సహా లీడర్లంతా చెబుతూనే వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయాలని కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. మరో అడుగు ముందుకేసిన మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు.
బూత్ ఏజెంట్లుగా వాలంటీర్లు
వాలంటీర్లను పోలింగ్ బూత్ వద్ద ఏజెంట్లుగా నియమిస్తామని ధర్మాన చెప్పారు. పోలింగ్ బూత్‌లో కూర్చొని ఎవరికి ఓటు వేయాలో చెప్పేందుకు సిద్ధంగా ఉండాలంటూ కామెంట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలులో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో వాలంటీర్లు కీలకపాత్ర పోషిస్తారంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
పదే పదే వాలంటీర్లపై ప్రతిపక్షాలు ఆరోపణలు
వాలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగిస్తే ప్రలోబాలకు గురిచేసే అవకాశం ఉందని..వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని తెలుగుదేశం పదేపదే ఆరోపిస్తోంది. దీనిపై పలుమార్లు ఎన్నికల సంఘానికి(E.C) ఫిర్యాదు చేసింది. ఓటర్ల మార్పులు, చేర్పుల్లోనే వాలంటీర్లు పెద్దఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించింది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం..వాలంటీర్లను, సెక్రటరీ ఉద్యోగులను ఎన్నికల విధులు అప్పగించరాదని అధికారులను ఆదేశించింది.
పోస్టల్ బ్యాలెట్ వాడుకోవాలని సూచన
పోలింగ్ బూత్ ఏజెంట్లుగా వాలంటీర్లు ఉండాల్సి వస్తుందని చెప్పడమే గాక....ఈసారి ఎన్నికల్లో వృద్థులు, వికలాంగులకు ఇంటి వద్ద నుంచే ఓటు వేసే సదుపాయన్ని వాడుకోవాలని వాలంటీర్లకు సూచించారు. వృద్ధులు ఇంటివద్ద నుంచే ఓటు వేసేందుకు పెద్దఎత్తున దరఖాస్తు చేయాలని.... వారు ఓటు వేసే క్రమంలో సంక్షేమ పథకాలు గుర్తు చేసి దగ్గర ఉండి వైసీపీ(YCP)కి ఓటు వేసేలా చూడాలని ఆయన నేరుగా చెప్పారు.
పోస్టల్ బ్యాలెట్ వైసీపీకి పడేలా చూడాలని ఆదేశం
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం వైసీపీకే రావాలని వాలంటీర్లకు ధర్మాన సూచించారు. వారి నుంచి పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులు మీరే చేయించాలన్నారు. ప్రభుత్వంపై ఇప్పటికే ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని...వారంతా వృద్ధులు, వికలాంగులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయించే ప్రమాదం ఉందని అలా జరగకుండా మీరే దగ్గర ఉండి మన పార్టీకి ఓటు వేసేలా చూడాలన్నారు.
జగన్ రుణం తీర్చుకోవాలని సూచన
వాలంటీర్లు అంటేనే స్వచ్ఛంద సేవకులని... రేపటి ఎన్నికల్లో మీరు ఏజెంట్లగా కూర్చునే పరిస్థితి ఉంటుంది. ఈ విషయమై ఆలోచిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు ధర్మాన. వాలంటీర్లుగా మీకు అవకాశం ఇచ్చిన జగన్ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందంటూ వాలంటీర్లకు సూచించారు. తప్పకుండా పోస్టల్ బ్యాలెట్లు మొత్తం వైసీపీకి పడేట్లు చూడాలని ఆదేశించారు.
ధర్మాన ప్రసాదరావు కామెంట్స్‌పై టీడీపీ జనసేన నేతలు మండిపడుతున్నారు. తాము మొదటి నుంచి చెబుతున్నట్టుగానే ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి మరోసారి ఫిర్యాదు చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. ఈ వీడియోలను కూడా ఎన్నిల సంఘానికి అందజేస్తామని అంటున్నారు. వాలంటీర్లను పూర్తిగా నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.