YSRCP Vs TDP Local Body Elections AP:   ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా పోలీసులు, టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే ఆరోపిస్తున్నారు. అయితే, రాష్ట్ర ఎన్నికల సంఘం  వద్ద నమోదైన అధికారిక నామినేషన్ల గణాంకాలను పరిశీలిస్తే మాత్రం వాస్తవ చిత్రం వేరేలా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా  మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు , వార్డులలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కొన్ని చోట్ల ఉపసంహరించుకున్నారు. కొన్ని చోట్ల స్థానిక రాజకీయాలతో బహిష్కరించారు. కొన్ని నిర్దిష్ట స్థానాల్లో స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నప్పటికీ, ఏ ఒక్క నియోజకవర్గంలోనూ లేదా మున్సిపాలిటీలోనూ వైసీపీ అభ్యర్థులు పూర్తిగా నామినేషన్లు వేయలేకపోయిన పరిస్థితి లేదని ఎన్నికల సంఘం రికార్డులు చూపిస్తోంది. 

Continues below advertisement

శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ ప్రశాంతంగా నామినేషన్లు

ఉత్తరాంధ్ర నుంచి కోస్తా ఆంధ్ర వరకు అంటే.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం ,  నెల్లూరు జిల్లాల వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఈ జిల్లాల్లోని అన్ని పట్టణ స్థానిక సంస్థల్లోనూ వైసీపీ పోటీలో నిలిచింది. అధికారిక డేటా ప్రకారం.. సగటున ప్రతి వార్డుకు వైసీపీ తరఫున ఒకటికి మించి దరఖాస్తులు దాఖలయ్యాయి. నామినేషన్ కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ మైక్రో పర్యవేక్షణలో స్వీకరణ జరిగిన దృష్ట్యా, ప్రధాన తీరప్రాంత జిల్లాల్లో ఎక్కడా బిఫార్మ్‌లు లాక్కోవడం లేదా భౌతిక దాడులు జరగలేదని స్పష్టమవుతోంది.   

Continues below advertisement

వైసీపీ నేతలకు గట్టి పట్టున్న ప్రాంతాల్లో ఉద్రిక్తతలు

ఇక ఉద్రిక్తతలు నమోదైన రాయలసీమ జిల్లాలను పరిశీలిస్తే.. వైఎస్సార్ కడప, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పరిధిలోని కడప, తిరుపతి కార్పొరేషన్లు, మైదుకూరు, రాజంపేట వంటి కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇవి దశాబ్దాలుగా వైఎస్సార్‌సీపీకి కంచుకోటలుగా ఉన్న ప్రాంతాలు కావడం గమనార్హం. ప్రతిపక్షాల ఫిర్యాదుల మేరకు ఎస్ఈసీ సత్వరమే స్పందించి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి కేవలం 4 స్థానిక సంస్థల్లోని 72 వార్డుల్లో మాత్రమే రీ-నామినేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే, రాష్ట్రంలోని మిగిలిన 95 కంటే ఎక్కువ మున్సిపాలిటీలు,  వేలాది వార్డులలో నామినేషన్లు సజావుగానే సాగాయని స్వయంగా ఎస్ఈసీ క్షేత్రస్థాయి విచారణలోనే రుజువైంది.

వైసీపీ ఓటమికి  కారణాలు చెబుతోందా? 

పరిస్థితి ఇలా ఉండగా, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజు నుంచే మొత్తం స్థానిక ఎన్నికల వ్యవస్థపై వైఎస్సార్‌సీపీ నిందలు వేయడం వెనుక పక్కా రాజకీయ వ్యూహం ఉందనే అభిప్రాయం బలపడుతోంది. రాబోయే నవంబర్ 3న వెలువడే ఫలితాల్లో గనుక తమకు తీవ్ర ప్రతికూల ఫలితాలు వస్తే.. ఎన్నికలు పారదర్శకంగా జరగలేదు, నామినేషన్ల నుంచే అక్రమాలు సాగాయి అని ఓటమిని ఎన్నికల యంత్రాంగంపైకి నెట్టివేసేందుకు  ముందస్తుగానే ఈ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారా? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

పోలింగ్ పైనే అందరి దృష్టి 

గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలను ప్రోత్సహించిన వైసీపీ, ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే క్షేత్రస్థాయిలో అభ్యర్థుల కొరత ,  నైరాశ్యంలో ఉన్న శ్రేణులను కాపాడుకోవడానికి ఈ రకమైన  విక్టిమ్ కార్డ్ ఉపయోగిస్తోందనే విమర్శలు ఉన్నాయి. నామినేషన్లు దాఖలు చేసిన గణాంకాలను దాచిపెట్టి, కేవలం కొన్ని గొడవలను మాత్రమే భూతద్దంలో చూపిస్తూ వార్తల్లో నిలవాలని భావించడం వల్ల పార్టీ క్యాడర్‌లో మరింత కన్ఫ్యూజన్ పెరుగుతుందే తప్ప మేలు జరగదని విశ్లేషిస్తున్నారు.  ఎన్నికల సంఘం నవంబర్ 1న పోలింగ్ తేదీని ఖరారు చేసి, సుప్రీంకోర్టు సూచించిన భద్రతా చర్యలను పక్కాగా అమలు చేస్తున్న తరుణంలో.. నామినేషన్లు వేసిన తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడంపై వైసీపీ దృష్టి సారించాల్సి ఉంది. గణాంకాలు స్పష్టంగా నామినేషన్ల నమోదును చూపిస్తున్నప్పుడు, కేవలం ఆరోపణలకే పరిమితం కావడం ఫలితాల తర్వాత చెప్పబోయే సంజాయిషీలకేనా అనేది త్వరలోనే తేలిపోనుంది.