AP Local Body Elections : బీసీ రిజర్వేషన్ల చుట్టూ లీగల్, పొలిటికల్ గేమ్ - చట్టాల ముసుగులో రాజకీయాల ఓటు బ్యాంక్ డ్రామాలు ఆడుతున్నారా?
BC Quota: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల జీవోను కొట్టివేసిన హైకోర్టు. 50% సీలింగ్ గుర్తు చేసింది. చంద్రబాబు సుప్రీంకు వెళ్తామంటున్నారు.

AP High Court BC Quota: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీవోలను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న సర్వోన్నత న్యాయస్థానం నిబంధనలకు ఈ జీవోలు విరుద్ధమని స్పష్టం చేస్తూ, ఆరు వారాల్లో ప్రక్రియ ప్రారంభించి ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే, ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని సీఎం చంద్రబాబు ప్రకటించినప్పటికీ, న్యాయపరంగా ఇది నిలబడదని తెలిసి కూడా వేస్తున్న రాజకీయ ఎత్తుగడగానే స్పష్టమవుతోంది.
రిజర్వేషన్లు 50 శాతానికన్నా ఎక్కువ సాధ్యం కాదు!
రాజ్యాంగబద్ధమైన పరిమితులను అధిగమించి రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని రాజ్యాంగ ధర్మాసనాలు ఎన్నోమార్లు స్పష్టం చేశాయి. సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. స్థానిక సంస్థల్లో రాజకీయోచిత వెనుకబాటుతనాన్ని నిర్ధారించేందుకు త్రిసభ్య కమిషన్ ద్వారా ట్రిపుల్ టెస్ట్ నిర్వహించకుండా , 50 శాతం సీలింగ్‌ను దాటుకుని ఏ రాష్ట్రమూ రిజర్వేషన్లు పొడిగించకూడదని పేర్కొంది. ఈ తీర్పులు ఉన్నప్పటికీ 34 శాతం కోటాతో జీవోలు తెచ్చి, అది కోర్టుల్లో చెల్లదని తెలిసీ సుప్రీంకోర్టుకు వెళ్లడం కేవలం రాజకీయ వ్యూహాల్లో భాగంగానే జరుగుతోంది.
ప్రతీ సారి స్థానిక ఎన్నికలప్పుడు బీసీ రిజర్వేషన్ల రాజకీయం
ఈ తరహా రాజకీయ వ్యూహాలు తెలుగు రాష్ట్రాలకు కొత్తవేమీ కావు. ఉమ్మడి ఏపీ సమయం నుంచి మొన్నటి తెలంగాణ పంచాయతీ ఎన్నికల వరకు కూడా ప్రభుత్వాలు 50 శాతానికి మించి బీసీ కోటాను పెంచుతూ నిర్ణయాలు తీసుకోవడం, న్యాయస్థానాలు వాటిని అడ్డుకోవడం క్రమబద్ధమైన పరిణామంగా మారింది. తెలంగాణలోనూ బీసీ రిజర్వేషన్లపై గతంలో తెచ్చిన ఆర్డినెన్సులు కోర్టుల్లో నిలబడలేక చివరకు 50 శాతం లోపే ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ప్రభుత్వాలు రాజ్యాంగ నిపుణుల సలహాలు తీసుకోకుండా లేదా తెలిసీ విస్మరించి, ఎన్నికల ముందు భారీ రిజర్వేషన్ల హామీలు ఇవ్వడం ఒక అనవసర సంప్రదాయంగా మారింది. ఈ తరహా పరిమితికి మించిన రిజర్వేషన్ల హామీలు వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ఇచ్చేవి కావు. ఇవి ప్రధానంగా ఓటు బ్యాంకులను ఆకట్టుకునేందుకు ఆడే రాజకీయ క్రీడ. బీసీ వర్గాల్లో అత్యాశలు, ఆకాంక్షలు రేకెత్తించడం, ఆపై జీవోలను సిద్ధం చేయడం, న్యాయస్థానాలు రాజ్యాంగ చట్రంలో వాటిని కొట్టేయగానే మేము బీసీలకు న్యాయం చేయాలని చూశాం, కానీ కోర్టులు అడ్డుకున్నాయి అంటూ సానుభూతి పొందేందుకు ప్రయత్నించడం రాజకీయ పార్టీల పరిపాటిగా మారింది. దీనివల్ల అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగకపోగా, స్థానిక సంస్థల ఎన్నికలు సుదీర్ఘకాలం పాటు వాయిదా పడి స్థానిక పాలన స్తంభించిపోతోంది.
ట్రిపుల్ టెస్ట్ పూర్తి చేయాలి!
వాస్తవానికి, బీసీలకు స్థానిక సంస్థల్లో చట్టబద్ధమైన అధిక ప్రాతినిధ్యం కల్పించాలనే నిజమైన చిత్తశుద్ధి ప్రభుత్వాలకు ఉంటే, ముందుగా ట్రిపుల్ టెస్ట్ ద్వారా క్షేత్రస్థాయి డాటాను సేకరించి, రాజ్యాంగ సవరణల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. లేదా 50 శాతం పరిమితికి లోబడే బీసీలకు గరిష్టంగా లబ్ధి చేకూరేలా సీట్ల కేటాయింపు చేయాలి. కానీ, ఆచరణాత్మక పరిష్కారాలను విస్మరించి, న్యాయపోరాటం పేరుతో కాలయాపన చేయడం వల్ల సమయం, ప్రజాధనం వృథా కావడం తప్ప మరే ఫలితం ఉండదు. హైకోర్టు తీర్పు ను బట్టి చూస్తే సుప్రీంకోర్టుకు వెళ్లినా ఏపీ ప్రభుత్వానికి ఉపశమనం లభించే అవకాశాలు అత్యల్పం. కాబట్టి కోర్టుల వల్ల జరగలేదనే రాజకీయ నెపం నెట్టడం ఆపి, సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం పరిమితికి లోబడి ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయడమే ప్రజాస్వామ్య బద్ధమైన మార్గం. బీసీ సమాజం కూడా కేవలం కాగితాలపై ఇచ్చే 34 శాతం హామీల కంటే, చట్టబద్ధంగా అమలుకు సాధ్యమయ్యే ప్రాతినిధ్యంపైనే స్పష్టమైన రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















