Jublihills ByElections: తెర వెనుక సమీకరణాలతోనే గెలుపు - జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో రాజకీయ పార్టీల బ్యాక్ డోర్ పాలిటిక్స్!
Jubilee Hills Back Door Politics: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో అన్నిరాజకీయ పార్టీలు బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేస్తున్నాయి. ఎవరు ఎవరికి సహకరిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Jubilee Hills Hot Politics: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కన్నా ఎక్కువగా జూబ్లిహిల్స్ ఉపఎన్నికపైనే దృష్టి సారించారు. తెలంగాణలో సంఖ్యాపరంగా పార్టీలు ఎక్కువే. కానీ ప్రధాన పోటీ జరిగేది మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే. అయితే జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో డైరక్ట్ పాలిటిక్స్ అసలు కనిపించడం లేదు. అన్నీ తెర వెనుక రాజకీయాలే కనిపిస్తున్నాయి. పార్టీల గెలుపు వెనుక రాజకీయ సమీకరణాలే కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే ఇతర పార్టీల మద్దతు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.
మజ్లిస్ మద్దతు తమకేనని కాంగ్రెస్ నమ్మకం
మజ్లిస్ పార్టీతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ పార్టీ మద్దతు తమకే ఉంటుందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. కానీ మజ్లిస్ వైపు నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. మజ్లిస్ విధానం ప్రకారం ఆ పార్టీ ఎవరికి బహిరంగంగా మద్దతు ప్రకటించదు. కానీ లోపాయికారీ మద్దతు మాత్రం ఇస్తూ ఉంటుంది. సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో సన్నిహితంగా ఉండి పొలిటికల్ ఫిక్సింగ్ చేసుకుంటారు. తమ అడ్డా అయిన పాతబస్తీలోకి ఎవరూ రాకుండా.. బయట వైపు ఆయా పార్టీలకు మద్దతు ఇస్తూంటారు. ఇప్పటి వరకూ బీఆర్ఎస్ పార్టీకి అదే సహకరించారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి తమకు సహకరిస్తారని అనుకుంటున్నారు. మజ్లిస్ 2014లో జూబ్లిహిల్స్ లో పోటీ చేసింది. రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత బీఆర్ఎస్ కుక సహకారంలో భాగంగా 2018, 2023 ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇప్పుడు కూడా పోటీపై ఎలాంటి ప్రకటన చేయలేదు కాబట్టి కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ పాత పరిచయాలతో బీఆర్ఎస్ కూడా మజ్లిస్ మద్దతు కోసం ప్రయత్నిస్తోంది.
బీజేపీ, టీడీపీ .. బీఆర్ఎస్ కోసం పని చేస్తున్నాయన్న ప్రచారం
మరో వైపు ఉపఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ సిరియస్ గా దృష్టి సారించలేదు. గతంలో ఎప్పుడు ఉపఎన్నికలు జరిగినా.. పోటీ బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే అన్నట్లుగా ఉండేది. దుబ్బాక, హుూజరాబాద్, మునుగోడు వంటి చోట్ల ఇదే జరిగింది. కానీ జూబ్లిహిల్స్ కు వచ్చే సరికి ఆ పార్టీ నెమ్మదిగా ఉంది. అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి జూబ్లిహిల్స్ లో బలం ఉంది. అందుకే ఆ పార్టీ మద్దతు కోసం కూడా బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. గతంలో కేటీఆర్ లోకేష్ తో సమావేశమయ్యారన్న ప్రచారం జరిగింది. మాగంటి గోపీనాథ్ టీడీపీ నేత. దశాబ్దాల పాటు టీడీపీలో ఉన్నారు. ఆయన సతీమణి కే టిక్కెట్ ఇచ్చారు కాబట్టి టీడీపీ క్యాడర్ సహకరిస్తుందని అనుకుంటున్నారు. ఇదే అనుమానాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి కూడా వెలిబుచ్చారు.
జూబ్లీహిల్స్ ఊప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని తేలడంతో బిఆర్ఎస్ పార్టీ అనైతిక అవగాహన కుదుర్చుకునేందుకు కుట్రలు చేస్తున్నట్లువార్తలు వస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిజెపి పోటీ చేస్తున్న కారణంగా కమలం పార్టీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ మిత్ర ధర్మం కోసం ఈ… pic.twitter.com/lZmuxZIK7X
— VIJAYASHANTHI (@vijayashanthi_m) October 6, 2025
పార్టీల సమీకరణాలే గెలుపునకు కీలకం
జూబ్లిహిల్స్ నియోజకవర్గం పూర్తిగా అర్బన్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు గేమ్ ఛేంజర్ గా ఉన్నారు. అదే సమయంలో ఇతర వర్గాలు కూడా ఫలితాలను ప్రభావితం చేస్తారు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ గట్టిగా తలపడే అవకాశాలు ఉన్నాయి. మిగతా పార్టీలు పోటీలో ఉంటాయా.. పోటీలో లేకపోతే ఎవరికి ప్రత్యక్షంగా లేదా .. పరోక్షంగా సపోర్టు చేస్తాయన్నది ఎన్నికల ఫలితాలను తేల్చనుంది. అందుకే అన్న ిరాజకీయ పార్టీలు తెర వెనుక ప్రయత్నాల్లో బీజీగా ఉన్నాయి.





















