తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద అటవీ ప్రాంతంగా ఆదిలాబాద్‌జిల్లాకి పేరుంది. పునర్వవ్యవస్థీకరణలో భాగంగా ఈ జిల్లా కిందకి మూడు నియోజకవర్గాలు వచ్చాయి. అందులో ఆదిలాబాద్ ఒకటి కాగా మిగిలినవి బోథ్, ఖానాపూర్ నియోజవర్గాలు. ఇక దాదాపు 2 లక్షల ఓటర్లు ఉన్న ఆదిలాబాద్ నియోజకవర్గంలో మూడు మండలాలుగా బేల, ఆదిలాబాద్, జైనథ్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో అధికారం బీఆర్‌ఎస్ పార్టీదే. జోగురామన్న వరసగా రెండుసార్లు ఈ పార్టీ తరపున గెలిచారు. జిల్లాగా ఏర్పడినప్పుడు మొదట్లో సీపీఐ హవా నడిచింది. ఆ తర్వాత ఇది కాంగ్రెస్ అడ్డాగా మారింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో హస్తం స్పీడు తగ్గింది. సైకిల్ స్పీడుకి మిగిలిన పార్టీలన్నీ సైడ్ అయిపోయాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో కారు హవా మొదలైంది. కాంగ్రెస్ లో ఉన్న జోగు రామన్న గులాబీ పార్టీలోకి చేరి ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
2014లో జోగు రామన్న కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల్లోనూ ఆయన గెలిచినప్పటికీ కేబినెట్ లో మాత్రం చోటు దక్కలేదు. ప్రస్తుతం ఇక్కడ అధికారపార్టీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బలమైన కేడర్ ఉంది. మున్నూరు కాపు, మైనార్టీ ఓటర్ల అండ ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారంలో మాత్రం ఆశించిన స్థాయిలో జోగురామన్న పనితనం చూపించడం లేదన్న విమర్శలున్నాయి. వివాదరహితుడిగా పేరున్నా వర్గపోరుతో సతమతమవుతున్నారు. గులాబీ నేతలంతా నియోజకవర్గంలో కన్నా హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటారన్న వాదన ఉంది. ఈ మధ్యనే సీఎం కేసీఆర్ కూడా రానున్న ఎన్నికలను దృష్టిలోపెట్టుకొని బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులంతా ఆయా నియోజకవర్గాల్లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల్లోకి వెళ్లాలని చెప్పారు. అయితే ఈ మాటని ఆదిలాబాద్ నియోజకవర్గ నేతలు సీరియస్ గా తీసుకున్న దాఖలాలైతే కనిపించడం లేదు.
ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నప్పటికీ లబ్దిదారులకు చేరడం లేదన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఆశించిన స్థాయిలో అర్హులకు అందలేదు. ఇక సాగు, తాగునీటి సమస్యతో ఈ నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గతంలో తాగునీటి కోసం ప్రజలు ఖాళీ బిందెలతో నిరసనలు తెలిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా కానీ ప్రభుత్వం ఇప్పటివరకు సీరియస్ గా దృష్టి పెట్టలేదు. 50వేల ఎకరాలకు పైగా సాగు నీరందించే చనాఖా కోర్టా ప్రాజెక్టు, నేరడిగొండలో దాదాపు 20వేల ఎకరాలకు నీరందించే కుప్టీ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. ఇది ఎన్నికల హామీగానే మిగిలిపోయింది కానీ పూర్తి కావడం లేదు. దీంతో రైతన్నలు ఆగ్రహంతో ఉన్నారు. ఇలా చెప్పుకుంటే పోతే ఆదిలాబాద్ నియోజవర్గంలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలతో అల్లాడుతున్నారు.పట్టణం వరకు అయితే అభివృద్ధి బాగుంది కానీ గ్రామాల్లో అయితే రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. సరైన రవాణా వసతి కూడా లేకపోవడంతో గర్భిణిలు ప్రాణాలు వదిలిన సందర్భాలు కోకల్లలు. ప్రజా సమస్యలపై దృష్టిపెట్టాల్సిన అధికారపార్టీ నేతలు వర్గపోరు నుంచి బయటపడేందుకు సమయమంతా వృథా చేస్తున్నారు.
జోగు రామన్నకు ఇంటిపోరు తప్పడంలేదు
రానున్న ఎన్నికల్లో సీటు కోసం జోగు రామన్నతో పాటు ఈసారి లోక భూమారెడ్డి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సీఎం కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా భూమారెడ్డికి పేరుంది. దీనికి తోడు మంత్రి పదవి ఇవ్వలేదని జోగురామన్న కొన్నాళ్లు పార్టీకి దూరంగా ఉండటంతో కేసీఆర్ కూడా ఆయనపై గుస్సాగా ఉన్నారన్న వార్తలు వచ్చాయి. ఈ లెక్కలన్నీ చూసుకున్న భూమా ఈసారి ఆదిలాబాద్ టిక్కెట్ ఆశిస్తూ అందుకు తగ్గ వ్యూహరచనతో రాజకీయాలు మొదలెట్టారట. మరోవైపు అధికారపార్టీ ఇంటిపోరుని అవకాశంగా మలచుకోవాలని బీజేపీ చూస్తోంది. అంతేకాదు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పై గురిపెట్టింది ఆ పార్టీ.
గెలపుపై కమలం ఆశలు
దీనికి తోడు డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో నియోజకవర్గంలో గెలుపు కోసం కాషాయం శతవిధాలుగా పనిచేస్తోంది. గత ఎన్నికల్లో జోగురామన్నతో పోరాడి ఓడిన పాయల్ శంకర్ ఈసారి గెలుపు ధీమాతో ముందుకెళ్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో లోక్ సభ సీటును బీజేపీ గెలుచుకుంది. ఆదిలాబాద్ ఎంపీ సీటును కైవసం చేసుకోవడంతో ఎమ్మెల్యే సీటు కూడా గెలుస్తామనే ధీమా తో ఉంది కమలంపార్టీ. ఒకప్పుడు నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉండేది కానీ రాష్ట్ర విభజనతో తెలుగుదేశం పార్టీ ఇక్కడ జెండా ఎత్తేసింది. అడ్రస్ గల్లంతైన ఈపార్టీ ఇప్పుడు మళ్లీ దుకాణం తెరిచింది. ఆపార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టారు. అయితే రానున్న ఎన్నికల్లో టిడిపి ఏఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందన్నది ఇంతవరకు క్లారిటీ లేదు.
మసకబారిన కాంగ్రెస్ పార్టీ
జాతీయపార్టీగా ఒకప్పుడు తెలుగురాష్ట్రాల్లో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా మసకబారిపోయింది. హస్తానికి బలమైన కేడర్ ఉన్నాకానీ దమ్మున్న నాయకుడు లేకపోవడంతో ఒకప్పుడు కంచుకోటగా ఉన్న ఆదిలాబాద్ నియోజవర్గంలో ఇప్పుడ కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రమే. రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టినా ఆ ప్రభావం ఇక్కడ ఏ మాత్రం కనిపించడం లేదు. పాదయాత్రలో తిరిగి పూర్వవైభవం తీసుకొస్తామని కాంగ్రెస్ సీనియర్లు చెబుతన్న మాటలు ఏ మేర ప్రభావం చూపుతాయో అన్నది సందేహమే. చెప్పుకోవడానికి పార్టీలు చాలానే ఉన్నాయి. కానీ ఎన్నికల పోరు మాత్రం బీఆర్ ఎస్ వర్సెస్ బీజేపీ అనే మాట ఈ నియోజవర్గంలో స్పష్టంగా కనిపిస్తోంది. తిరిగి జోగురామన్న ముచ్చటగా మూడోసారి గెలుపందుకుంటారా లేదంటే ఓడినచోటే గెలవాలన్న కసితో ఉన్న పాయల్ శంకర్ కోరిక తీరుతుందా అన్నది ఆదిలాబాద్ నియోజవర్గ ఓటర్లు తేల్చడానికి ఎంతో సమయం లేదు.