Ap Cm Chandrababu Naidu Warm Welcoming Telangana : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి హైదరాబాద్‌లో శుక్రవారం (జులై 5న) రాత్రి ఘన స్వాగతం లభించింది. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన చంద్రబాబుకు పార్టీ శ్రేణులు భారీ ఎత్తున స్వాగతం పలికాయి. ఢిల్లీ పర్యటన ముగించుకుని నేరుగా హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబు నాయుడు.. బేగంపేట విమానాశ్రయానికి శుక్రవారం సాయంత్రం వచ్చారు. చంద్రబాబు తొలిసారిగా హైదరాబాద్‌కు వస్తుండడంతో తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు, చంద్రబాబు అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి భారీగా చేరుకున్నారు.


వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు ర్యాలీగా విమానాశ్రయం నుంచి చంద్రబాబు నివాసానికి బయల్దేరారు. ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయనకు గజమాలలతో ఘనంగా సత్కరించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వరకు అభిమానులతో ర్యాలీగా చంద్రబాబు కాన్వాయ్‌ కదులుతోంది. వేలాది మంది కార్యకర్తలు రావడంతో కాన్వాయ్‌ ముందుకు సాగడం లేదు. జోరువానలోనూ కార్యకర్తలు భారీగా తరలిరావడం గమనార్హం. వర్షంలో తడుస్తూనే ర్యాలీగా ముందుకు సాగారు. అడుగడుగునా చంద్రబాబుకు కార్యకర్తలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి వందలాది కార్లు, దిచక్ర వాహనాలతో ర్యాలీగా చంద్రబాబు కాన్వాయ్‌ ముందుకు సాగుతోంది. 








జోరు వానలోనూ రోడ్ షో
చంద్రబాబు తొలిసారి హైదరాబాద్‌కు వస్తుండడంతో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు స్వాగత ఏర్పాట్లు చేశాయి. ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలను అభిమానులు, పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశాయి. జోరు వానలోనూ పార్టీ కార్యకర్తలు వెంట రాగా చంద్రబాబు రోడ్ షో ముందుకు సాగింది. జై టీడీపీ, జై చంద్రబాబు నినాదాలతో అభిమానులు, కార్యకర్తలు ర్యాలీ వెంబడి నినాదాలు చేసుకుంటూ ముందుకు సాగారు. ఎయిర్‌పోర్టు నుంచి జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు ఇంటి వరకు ర్యాలీ కొనసాగింది. చంద్రబాబు రాకతో నగర పరిధిలోని అనేక ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. వేలాదిగా వాహనాలు వెంట చంద్రబాబు కాన్వాయ్‌ ర్యాలీగా ముందుకు సాగుతోంది.


శనివారం సీఎంల భేటీకి అంతా సిద్ధం 
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్ కు వచ్చిన చంద్రబాబు.. శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సమావేశం కానున్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన సమస్యలను రాష్ట్ర విభజనకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునేందుకు సమావేశం కావాలంటూ కొద్దిరోజుల కిందట ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమావేశం అవుదామంటూ తిరిగి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు.


హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు నాయుడు శనివారం తెలంగాణ ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర విభజనకు సంబంధించి అపరిస్కృతంగా ఉన్న అనేక సంస్థలపై చర్చించనున్నారు. షెడ్యూల్ తొమ్మిది, షెడ్యూల్ 10 లో ఉన్న సంస్థల విభజన పై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలపైన చర్చ జరగనుంది. శనివారం సాయంత్రం 6 గంటలకు ఇరువురు ముఖ్యమంత్రి ప్రజాభవంలో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.