Nirmal District News: ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది- రైతులకు భరోసా ఇచ్చిన నిర్మల్ జిల్లా కలెక్టర్
నిర్మల్ జిల్లాలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఖానాపూర్ మార్కెట్‌యార్డ్‌లో తడిసిన ధాన్యాన్ని గురువారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి పరిశీలించారు.
స్థానిక రైతులతో, అక్కడి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. వరి రైతులు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వర్షంతో ధాన్యం తడవడంతో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు అభినవ్. ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అధిక తూకంతో కొనుగోళ్లు జరిపితే సంబంధిత నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ధాన్యం శుభ్రపరిచి, ఎండబెట్టే ఏర్పాట్లు చేయాలని, కొనుగోళ్లను వేగవంతం చేసి వెంటవెంటనే మిల్లులకు తరలించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
image 5
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. అకాల వర్షాలతో ధాన్యం తడవడం బాధకరమని, కొనుగోళ్లను వేగవంతం చేయాలనీ అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం పూర్తిగా రైతుల పక్షాన నిలుస్తుందని తెలిపారు. అధిక తూకాలు వేయడం, తక్కువ ధరలకు కొనుగోలు చేయడం వంటి పరిస్థితులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్కెట్‌యార్డ్‌లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి, తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.