CM Revanth Reddy Visits Yadagirigutta: యాదాద్రిలో తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల, పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పరిధిలో తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి, టెంపుల్ సిటీ పరిధిలో రూ. 99.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ, శంకుస్థాపనలు చేశారు.
యాదగిరిగుట్ట టెంపుల్ సిటీని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తరహాలో ఉన్నతంగా తీర్చిదిద్దే సంకల్పంతో ఈ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. 15 ఎకరాల విస్తీర్ణంలో రూ. 43.80 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ వేద పాఠశాలలో 300 మంది విద్యార్థులకు వసతితో కూడిన వేద విద్యను అందించనున్నారు.
రూ.43.5 కోట్లతో దీక్షాపరుల మండపం పనులకు, రూ.9.88 కోట్లతో కొండపై నిత్య కల్యాణం, రంగం మండపం నిర్మాణం, రూ.1.41 కోట్లతో మెట్ల మార్గానికి పైకప్పు, రూ.1.44 కోట్లతో మాఢవీధులకు మెట్ల పనులకు రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.
కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య సమక్షంలో శనివారం (మే 23, 2026)న జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
భక్తుల సౌకర్యార్థం డార్మిటరీ హాల్స్, దీక్షాపరుల సదనం, కొండపై భారీ కల్యాణ మండపం, మెట్ల మార్గానికి రక్షణ పైకప్పు (కానోపీ), కొత్త మెట్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. స్వామి వారి కృపతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సంతోషాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకున్నారు. ఈ సందర్భంగా కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు.