SLBC Tunnel Rescue operation: టన్నెల్ నుంచి తిరిగి వచ్చేసిన NDRF టీమ్- ఆరు మీటర్ల మేర బురద ఉందన్న అధికారులు
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ మార్గంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం ఎన్టీఆర్‌ఎఫ్ సిబ్బంది 11 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్‌లో ప్రయాణించారు. అక్కడి నుంచి 14 కిలోమీటర్ల దూరం వరకు నడుచుకుంటూ వెళ్లారు.
ఇంజినీర్లు, టెక్నికల్ స్టాఫ్, కార్మికులు కలిపి మొత్తం 8 మంది టన్నెల్ లోపల చిక్కుకుపోయారు. వీరిని కాపాడేందుకు SLBC టన్నెల్ లోపలికి వెళ్లిన NDRF టీమ్ 4 గంటల తరువాత టన్నెల్ నుంచి బయటకు వచ్చింది.
లోపలికి వెళ్లిన ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది టన్నెల్ లో చిక్కుకున్న వారి పేర్లు పెట్టి కొద్దిసేపు పిలిచారు. అటు వైపు ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లోపల మోకాలు లోతు వరకు నీరు, బురదతో నిండి ఉండడంతో NDRF టీమ్ మరింత ముందుకు వెళ్లలేకపోతోంది. ముఖ్యంగా ప్రమాదం జరిగిన చోట ఆరు మీటర్ల పైన బురదతో నిండిపోయిందని అధికారులు చెబుతున్నారు.
ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది సహకారంతో అధికారులు ఫ్లై కెమెరాతో ప్రమాదం జరిగిన దృశ్యాలను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. NDRF టెక్నికల్ మిషనరీతో టన్నెల్ లోపలికి వెళ్లిందని అధికారులు తెలిపారు.
టన్నెల్ బోరింగ్ మెషిన్ వద్దకు వెళ్లిన ఎన్టీఆర్ఎఫ్ (NDRF) టీమ్ లోపల చిక్కుకుపోయిన వారి జాడ సైతం గుర్తించలేకపోయింది. బోరింగ్ మెషిన్ వద్దకు వెళ్లిన టీమ్ అక్కడ మొత్తం మూసుకుపోయినట్లు గుర్తించారు. నీళ్లు రావడంతో బురద, మట్టితో టన్నెల్ పేరుకుపోయింది.