Hyderabad Silent Book Reading Movement: హైదరాబాద్, సికింద్రాబాద్‌లో వీకెండ్స్ బుక్ రీడింగ్ క్లబ్బులు- పుస్తక ప్రియులను కలుపుతున్న సైలెంట్ రీడింగ్ కమ్యూనిటీ
హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో పుస్తక ప్రియుల కోసం ఏర్పాటు చేసిన వేదికలు ఇటీవల మరింత ప్రాచుర్యం పొందుతున్నాయి. శనివారం, ఆదివారం సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు పుస్తకాలు చదవడానికి ఆసక్తిగల వారు కేబీఆర్ పార్క్, ఏఎస్ రావు నగర్ పార్కుల్లో కలిసి పుస్తకాలను చదువుతూ, వాటిపై చర్చలు చేస్తున్నారు. ఈ సమావేశాల్లో, పుస్తకాలు చదవడమే కాకుండా, వారి నాలెడ్జ్ ను ఇతరులకు షేర్ చేసుకుంటున్నారు.
2024లో ప్రారంభమైన సికింద్రాబాద్ రీడ్స్ క్లబ్, బెంగళూరులోని కబ్బన్ రీడ్స్ నుంచి ప్రేరణ పొందింది. జూబిలీ హిల్స్ లో హైదరాబాద్ రీడ్స్ అనే ఒక సైలెంట్ రీడింగ్ కమ్యూనిటీ ఉన్నప్పటికీ, సికింద్రాబాద్ కు దగ్గరలో పుస్తకప్రియులకు ఒక వేదిక ఏర్పాటు చేయాలని ఆలోచించాం. అందుకే ప్రస్తుతం AS Rao Nagar Park లో సికింద్రాబాద్ రీడ్స్ ఏర్పాటు చేశాం అని క్లబ్ నిర్వాహకులు చెప్పారు. ఈ వేదిక పుస్తకాలు చదవడానికి మాత్రమే కాకుండా, వాటిపై అభిప్రాయాలు పంచుకునే వేదికగా కూడా మారింది.
హైదరాబాద్ రీడ్స్ 2023లో ప్రారంభమై, ఇప్పటికీ కేబీఆర్ పార్క్‌లో రీడింగ్ కమ్యూనిటీ ను ఏర్పాటు చేసింది. ఇటీవలే సత్త్వా నాలెడ్జ్ సిటీ వద్ద కూడా ఈ వేదిక ఏర్పాటు చేయబడింది. ప్రతి ఆదివారం, ఇక్కడ పుస్తక చర్చలు, రచయితల సమావేశాలు, అలాగే సామాజిక అంశాలపై చర్చలు జరుగుతున్నాయి.
బుక్ రీడింగ్ లో భాగంగా విద్యార్థులు, ఉద్యోగులు, హోంమేకర్స్ ఈ సైలెంట్ బుక్ రీడింగ్ సేషన్ లో పాల్గొంటున్నారు. ఇక్కడ మేము పుస్తకాలు చదవడం మాత్రమే కాకుండా, వాటి గురించి అభిప్రాయాలను కూడా పంచుకుంటాం. దీనితో, మనం కొత్త విషయాలను నేర్చుకోవడం, పుస్తకాలపై మరింత అవగాహన పొందడం సాధ్యమవుతుంది, అని సభ్యులు చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా, ఇలాంటి సైలెంట్ రీడింగ్ కమ్యూనిటీలు ఇతర నగరాల్లో కూడా ఏర్పడుతున్నాయి. ఉదాహరణకు, లండన్, న్యూయార్క్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఇవి విస్తరిస్తున్నాయి.
Read to Relax, Cubbon Reads (బెంగళూరు), Book Café (ముంబై), New York Public Library's Reading Room వంటి వేదికలు ఈ కమ్యూనిటీలకు ప్రతిరూపాలుగా ఉన్నాయి. ఇవి లిటరేచర్ మీద ఆసక్తి ఉన్న ప్రజలను ఒకే వేదిక పై కలుపుతూ, యువత కు, పిల్లలకు బుక్ రీడింగ్ మీద ఆసక్తిని పెంచే విధంగా మారుతున్నాయి.
ఈ వేదికలు పుస్తక ప్రియులకు ఒక మంచి నాలెడ్జ్ షేరింగ్ ప్లాట్ఫామ్ కలిపిస్తూ లిటరేచర్ మీద చర్చలు, అనుభవాలు పంచుకునేందుకు ఒక మంచి వేదికగా మారుతోంది.
శనివారం సాయంత్రం కలుసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతిరోజు స్కూల్, కాలేజీ, జాబ్స్ అంటూ మేము ఎంతో బీజీ గా ఉంటాము. శనివారం, ఆదివారం సాయంత్రం సమయాల్లో కాస్త ప్రశాంతత కోసం ఇక్కడ కలసి పుస్తకాలు చదవడం మంచి అనుభూతిని ఇస్తుంది, అని హైదరాబాద్ రీడింగ్ కమ్యూనిటీ సభ్యులు తెలిపారు.
ఇక మున్ముందు మరిన్ని రాష్ట్రాల్లో ఈ బుక్ రీడింగ్ కమ్యూనిటీ సాంప్రదాయాన్ని విస్తరింపజేస్తే దేశ వ్యాప్తంగా లిటరేచర్ ప్రేమికులు తమ విలువైన అభిప్రాయాలను పంచుకునేందుకు ఒక చక్కటి వేదిక గా మారుతుంది అని వారు అభిప్రాయపడుతున్నారు.