Fire Accident Helpline Number: సంగారెడ్డి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం, బాధితుల సమాచారం కోసం హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని పారిశ్రామికవాడలో సోమవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 50కి చేరువ అయింది. పలువురు కార్మికులు ఇంకా ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.
సిగాచీ పరిశ్రమలో ప్రమాదంలో చనిపోయిన, గాయపడిన కార్మికుల కుటుంబాలకు సహాయం కోసం సంగారెడ్డి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటుచేశారు.
సిగాచి పరిశ్రమ అగ్నిప్రమాదానికి సంబంధించిన కార్మికుల సమాచారం కోసం, తక్షణ సహాయం కోసం సంబంధిత వ్యక్తులు 08455–276155 నంబర్‌లో సంప్రదించాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు.
మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి మంగళవారం ఉదయం పాశమైలారంలో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. జిల్లా ఇంచార్జి మంత్రి కావడంతో సహాయకచర్యలను పర్యవేక్షించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు.
ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ లో శిథిలాల కింద కార్మికుల మృతదేహాలు వెలికితీసి హాస్పిటల్‌కు తరలిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ శిథిలాలు తొలగిస్తున్నారు.
ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ఉదయం సిగాచి కెమికల్స్ పరిశ్రమ వద్దకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. శిథిలాల కింద నుంచి బయటకు తీస్తున్న వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లో పాశమైలారం చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు. ఘటనాస్థలాన్ని స్వయంగా పరిశీలించి ప్రమాద తీవ్రతను తెలుసుకోనున్నారు.