Gopashtami 2025: శ్రీ కృష్ణుడి భక్తులకు అక్టోబర్ 30 చాలా ప్రత్యేకమైన రోజు! విశిష్ఠత ఏంటి? ఈ రోజు ఏం చేయాలి?
గోపాష్టమి పండుగ కార్తీక మాసం శుక్ల పక్ష అష్టమి రోజు జరుపుకుంటారు. ఈ ఏడాది ఈ పండుగ అక్టోబర్ 30న వచ్చింది. ఈ రోజు గోమాతను పూజించడం వల్ల 33 కోట్లమంది దేవతల ఆశీర్వాదం లభిస్తుందని భక్తుల విశ్వాసం. పురాణాల ప్రకారం, ఈ రోజున శ్రీకృష్ణుడు మొదటిసారిగా ఆవులను మేపడం ప్రారంభించాడు, ఈ సందర్భంగా గోపాష్టమి పండుగ జరుపుకుంటారు.
గోపాష్టమి రోజు నుంచి గోవులను మేపాడట శ్రీకృష్ణుడు. దీనివెనుక ఓ పురాణ కథ ఉంది. కృష్ణుడు 6 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, తన తల్లి యశోదతో ఇలా అన్నాడు..అమ్మా నేను పెద్దయ్యాను కదా ఈ రోజు నుంచి దూడలవెనుక ఆడుకోవడం కాదు ఆవులను మేపేందుకు వెళతాను అని చెప్పాడట.
నందుడు మాత్రం నువ్వు ఇంకా చిన్న పిల్లాడివే దూడలను మేపు..ఆవులను వద్దు అని చెప్పాడట. కానీ కృష్ణుడు మాత్రం పట్టుదలగా ఆవులను తీసుకెళ్తా అన్నాడట. అయితే గోచారానికి ముహూర్తం నిర్ణయించాలని పండితులవద్దకు వెళ్లి అడిగాడట నందుడు.
మీకు వెన్నఇస్తాను ముహూర్తం త్వరగా నిర్ణయించండి అని శ్రీ కృష్ణుడు.. పండితుడిని అడిగాడట. కానీ ఆయన చాలాసేపు పంచాంగం చూస్తూ ఉండిపోయారు కానీ ఏమీ మాట్లాడలేదు
చాలా సేపటి నుంచి అలాగే ఉండిపోయారని నందుడు...ఆ పండితుడిని ప్రశ్నించగా.. ఈరోజే ముహూర్తం ఉంది ఆ తర్వాత సంవత్సరం పాటు ముహూర్తం లేదని చెప్పారట. ఆ మాటవిన్న కృష్ణుడు అయితే ఈ రోజే వెళ్లిపోతాను అని వెంటనే పరిగెత్తాడట. ఆ రోజు కార్తీక మాస శుక్ల పక్ష అష్టమి తిథి, అందుకే ఈ రోజున గోపాష్టమిని వ్రజంలో జరుపుకుంటారు
కార్తీక శుక్ల పాడ్యమి నుంచి సప్తమి వరకు శ్రీకృష్ణుడు ఇంద్రుని కోపం నుంచి బృందావన వాసులను రక్షించడానికి గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడని నమ్ముతారు. ఎనిమిదవ రోజున ఇంద్రుని అహంకారం తొలగి...శ్రీకృష్ణుడిని క్షమించమని కోరాడు, అప్పటి నుండి కార్తీక మాసంలోని అష్టమి రోజున గోపాష్టమి ఉత్సవం జరుపుకుంటారు.