Railway Rules Change: టికెట్ బుకింగ్ నుంచి ప్రయాణీకుల చార్ట్ వరకు.. జూలై 01 నుంచి మారిన రైల్వే నిబంధనలు ఇవే!
రైలు ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మిగిలిన రవాణా మార్గాల కన్నా తక్కువ ధరతో పూర్తయ్యేది. అందుకే లక్షలాది ప్రయాణికులు రైలులో ప్రయాణించడానికి ఇష్టపడతారు. అయితే, జూలై 1, 2025 నుంచి రైలుప్రయాణానికి సంబంధించిన అనేక నిబంధనల్లో ముఖ్యమైన మార్పులు జరిగాయి
రైల్వే శాఖ జూలై 1 2025 నుంచి రైలులో ప్రయాణించే విషయంలో కొన్ని మార్పులు చేసింది. దీని ప్రభావం కోట్లాది ప్రయాణికులపై పడుతుంది. అత్యంత ముఖ్యమైన మార్పు తత్కాల్ టికెట్ బుకింగ్‌కు సంబంధించింది. ఇకపై ఆధార్ ధృవీకరణ లేకుండా ఏ ప్రయాణికుడూ తత్కాల్ టికెట్ బుక్ చేసుకోలేరు.
ఈ నిబంధన ఆన్లైన్ బుకింగ్ లకు మాత్రమే వర్తిస్తుంది. అంటే, IRCTC వెబ్సైట్ లేదా రైల్ కనెక్ట్ యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు ముందుగా ఆధార్ ప్రమాణీకరణ చేయించుకోవాలి. ఆధార్ ధృవీకరణ తర్వాతే టికెట్ బుకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.
ప్రయాణికుల చార్టులు తయారు చేసే నిబంధనలలో కూడా మార్పులు చేశారు. మొదట చార్ట్ రైలు బయలుదేరే 4 గంటల ముందు తయారు చేసేవారు. ఇకపై ఈ సమయాన్ని 8 గంటలకు పెంచారు.
రైల్వే ఏసీ కోచ్ వెయిటింగ్ లిస్ట్ పరిమితిని కూడా పెంచింది. మొదట ఏసీ కోచ్‌లో మొత్తం సీట్లలో 25% వరకు వెయిటింగ్ టిక్కెట్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఈ పరిమితిని 60%కి పెంచారు. ఉదాహరణకు, ఒక ఏసీ కోచ్‌లో 50 సీట్లు ఉంటే, మొదట 12 వెయిటింగ్ టిక్కెట్లు లభించేవి. ఇప్పుడు 30 వెయిటింగ్ టిక్కెట్లు జారీ చేయవచ్చు.
రైల్వే మెయిల్ మరియు ఎక్స్ప్రెస్ రైళ్ల ఛార్జీలను కూడా పెంచింది. నాన్-ఏసీ కోచ్లలో కిలోమీటరుకు 1 పైసా , ఏసీ కోచ్లలో కిలోమీటరుకు 2 పైసలు పెంచారు. అయితే ఈ కొత్త ఛార్జీలు 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారికి మాత్రమే వర్తిస్తాయి.