Assam Marriages Act: వివాహాలపై అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం.. త్వరలో అసెంబ్లీకి రానున్న బిల్లు
అస్సాం ప్రభుత్వం రాష్ట్రంలో బహుళ వివాహాలను నిషేధించే చట్టాన్ని ఆమోదించింది. సీఎం హిమంత బిస్వా శర్మ ఆదివారం నాడు మంత్రివర్గ సమావేశం అనంతరం మాట్లాడుతూ ‘అస్సాం బహుళ వివాహాల నిషేధ బిల్లు, 2025’ కేబినెట్ ఆమోదం పొందిందని, నవంబర్ 25న అసెంబ్లీలో ప్రవేశపెడతామని తెలిపారు.
ఆ బిల్లు ప్రకారం, అస్సాంలో ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటే, వారికి 7 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష విధించవచ్చు.
అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ మాట్లాడుతూ.. బహుళ వివాహాల నిరోధక చట్టం లక్ష్యం రాష్ట్రంలో మహిళల హక్కులను కాపాడటంతో పాటు సమాజంలో సమానత్వాన్ని నిర్ధారించడమే అన్నారు. బహుళ వివాహాల బారిన పడిన మహిళలకు జీవనోపాధి కష్టాలు రాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ‘నష్టపరిహార నిధి’ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఈ చట్టం అస్సాం లోని ఆరవ షెడ్యూల్ ప్రాంతాలు, గిరిజన సమాజాలపై వర్తించదని హిమంత బిస్వ శర్మ స్పష్టం చేశారు. ఈ ప్రాంతాలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు లభిస్తుందన్నమాట. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలో ఈ చట్టం అమలుకానుంది. ఈ నిబంధన ముస్లింలకు కూడా వర్తిస్తుంది.
అస్సాం కేబినెట్ నిర్ణయం తరువాత రాష్ట్రంలో మతపరమైన, సామాజిక వర్గాలలో చర్చలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ముస్లింలలో ఈ చట్టం తమ మతపరమైన హక్కులపై ప్రభావం చూపుతుందేమో అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇస్లాంలో పురుషుడికి నాలుగు వివాహాలు చేసుకునేందుకు అనుమతి ఉందని చెబుతారు.
ఈ చట్టం ఒకే వివాహ చట్టం కిందకు అందరినీ తీసుకురావాలనే లక్ష్యంతో సమాన పౌర స్మృతి దిశగా ఒక అడుగు అని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ అన్నారు
ఆయన తన ప్రకటనలో మాట్లాడుతూ 2001 నుండి 2011 మధ్య అస్సాం జనాభాలో వచ్చిన మార్పు ఆందోళన కలిగించే విషయం అని అన్నారు. హిందూ జనాభా వృద్ధి రేటు తగ్గగా ముస్లిం జనాభా నిరంతరం పెరుగుతోంది. ఈ అసమతుల్యతను దృష్టిలో ఉంచుకుని మేము సామాజిక సంస్కరణల దిశగా ఈ చర్య తీసుకున్నాము.