AI Chatbots on Mental Health : మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోన్న AI Chatbots.. AI సైకోసిస్పై నిపుణుల హెచ్చరికలివే
డెన్మార్క్‌లోని ఆర్హస్ విశ్వవిద్యాలయానికి చెందిన మనస్తత్వవేత్త సోరెన్ ఆస్టర్‌గార్డ్ తన పరిశోధనలో AI చాట్‌బాట్‌లు తరచుగా సానుకూలంగా కనిపించే సమాధానాలు ఇస్తాయని చెప్పారు. అయితే కొన్నిసార్లు వాస్తవికతకు దూరంగా ఉంటాయని చెప్పారు. దీనివల్ల మానసికంగా సున్నితమైన వినియోగదారుల ఆలోచనలు మరింత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కూడా చాలా చాట్‌బాట్‌లు మానసిక అనారోగ్యాలకు సంబంధించి.. తప్పుడు ఇన్ఫర్మేషన్ తెలియకుండానే ఇస్తుందని కనుగొన్నారు. దీనివల్ల పరిస్థితి మరింత దిగజారవచ్చు.
చాట్‌బాట్‌లు వినియోగదారుడి భాష, భావోద్వేగాలు, ఆలోచనలను ప్రతిధ్వనించి రిప్లై ఇస్తున్నాయని చెబుతున్నారు. ఇది ఒక రకమైన ఎకో చాంబర్ను సృష్టిస్తుంది. ఇక్కడ వినియోగదారుడి ప్రతికూల ఆలోచనలు మరింత లోతుగా మారతాయి. కొన్ని సందర్భాల్లో మానసికంగా బలహీనంగా ఉన్న వ్యక్తులు చాట్బాట్లతో సంభాషిస్తూ తీవ్రమైన మానసిక రుగ్మతలకు, ఆత్మహత్య ఆలోచనలకు కూడా దారితీసినట్లు గుర్తించారు.
కాలిఫోర్నియాలో ఇటీవల 7 మంది ChatGPT తప్పుడు ప్రతిస్పందనలు ఆత్మహత్య వంటి చర్యలకు ప్రేరేపించాయని పేర్కొన్నారు. అమెరికాలో చాలా మంది టీనేజర్ల మరణాలకు కూడా AI చాట్ బాట్‌తో జరిగిన సంభాషణలను ముడిపెట్టారు.
భారతదేశంలోని గురుగ్రామ్‌కి చెందిన మనస్తత్వవేత్త డాక్టర్ మునియా భట్టాచార్య మాట్లాడుతూ.. AI ఆధారిత సాధనాలు తేలికపాటి ఒత్తిడి, ఆందోళన లేదా ఒంటరితనంతో బాధపడేవారికి తాత్కాలిక మద్దతు అందించగలవని చెప్తున్నారు. కానీ తీవ్రమైన మానసిక సమస్యలు, తీవ్రమైన డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలు లేదా మనోవైకల్యం వంటి పరిస్థితులలో ఈ చాట్‌బాట్‌లు సహాయం చేయడానికి బదులుగా మరింత ప్రమాదకరంగా మారవచ్చు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. AI చికిత్సను మానవ చికిత్సకు బదులుగా కేవలం ఒక సహాయక సాధనంగా చూడాలి. AI అందించే సలహా ఎల్లప్పుడూ ఖచ్చితమైనది లేదా సురక్షితమైనది కాదు. కాబట్టి దాని పరిమితులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మానసిక ఆరోగ్యానికి AI వినియోగానికి సంబంధించిన ప్రమాదాలపై మరింత లోతైన పరిశోధన అవసరమని పరిశోధకులు భావిస్తున్నారు. తద్వారా దాని వినియోగానికి సరైన మార్గదర్శకాలు, భద్రతా ప్రమాణాలు రూపొందించాలి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతున్న వినియోగం మానసిక ఆరోగ్య రంగంలో కొత్త అవకాశాలను తెస్తుంది. అయితే దానితో పాటు ప్రమాదాలు కూడా అంతే ఉన్నాయి. కాబట్టి అవగాహన, జాగ్రత్త, నిపుణుల సలహా అవసరం. తద్వారా సాంకేతికత మనకు సహాయపడుతుంది. కొత్త ప్రమాదాలను సృష్టించదు.